విచారణ తర్వాతే ఓటర్ల తొలగింపు! | Concerns with BLOs at the field level over removal of voters | Sakshi
Sakshi News home page

విచారణ తర్వాతే ఓటర్ల తొలగింపు!

Oct 2 2026 4:29 AM | Updated on Oct 2 2026 4:29 AM

Concerns with BLOs at the field level over removal of voters

ముస్లిం ఓటర్ల తొలగింపునకు గంపగుత్తగా ప్రీప్రింటెడ్‌ దరఖాస్తులపై కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు 

కేవలం దరఖాస్తులు రాగానే ఓటర్లను తొలగించబోమని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి వివరణ

క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలతో విచారణ.. ఆ తర్వాతే ఈఆర్వో నిర్ణయం 

సీఈఓ సుదర్శన్‌ రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026 ప్రక్రియలో భాగంగా ఓటర్ల తొలగింపు కోసం వచ్చే ఫారం–7 దరఖాస్తులపై బూత్‌ స్థాయి అధికారులు(బీఎల్‌ఓలు), ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారుల (ఈఆర్వోలు) ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక తరహాలో రాష్ట్రంలో సైతం గంపగుత్తగా ముస్లిం ఓటర్ల పేర్లతో ముద్రించిన ఫారం–7 దరఖాస్తులను సమర్పించి భారీ సంఖ్యలో వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలపై ఆయన గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. 

ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్‌ నంబర్‌ 210 పరిధిలో ఓ ముస్లిం కుటుంబంలోని 30 మంది ఓటర్లను తొలగించాలని కోరుతూ వారి పేర్లతో ప్రింట్‌ చేసిన ఫారం–7 దరఖాస్తులను గంపగుత్తగా బీజేపీ బూత్‌స్థాయి ఏజెంట్‌ సమర్పించిన అంశంపై టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ అంతకుముందు సీఈఓకు ఫిర్యాదు చేసింది. ఎలక్షన్‌ మాన్యువల్‌–2023 ప్రకారం ఓటరు కుటుంబ సభ్యులు, స్థానిక ఓటరు, బీఎల్‌ఓ నుంచి ఫారం–7 దరఖాస్తును స్వీకరిస్తే ఈఆర్వో కార్యాలయ నోటీసు బోర్డుపై 7 రోజులపాటు నోటీసును ప్రదర్శిస్తారని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. 

ఆ సమయం ముగిశాక ఈఆర్వో దరఖాస్తు/అభ్యంతరాన్ని పరిశీలించి సంతృప్తి చెందితే తదుపరి విచారణ అవసరం లేకుండా ఓటరు పేరు తొలగింపునకు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈఆర్వో సంతృప్తి చెందకుంటే ఫారం–7 దరఖాస్తు చేసిన వ్యక్తితోపాటు సంబంధిత ఓటరుకు వ్యక్తిగతంగా/రిజిస్టర్‌ పోస్టు ద్వారా నోటీసు జారీ చేసి లేదా వారి ఇంటి వద్ద నోటీసు అంటించి విచారణకు పిలుస్తారని తెలిపారు. విచారణలో ఓటరు అనర్హుడని నిర్థారిస్తేనే పేరు తొలగించాలని నిర్ణయిస్తారన్నారు. 

ఈసీ నుంచి ఫోన్‌కు సందేశం 
ఫారం–7 దాఖలు చేసినంత మాత్రాన ఓటర్లను తొలగించరని, బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో విచారణ, ఈఆర్వోల ఆధ్వర్యంలో దరఖాస్తుదారులు, సంబంధిత ఓటర్ల విచారణ తర్వాతే ఓటరు పేరు తొలగింపుపై నిర్ణయం జరుగుతుందని సీఈఓ చెప్పారు. ఓటర్ల జాబితాతో తన ఫోన్‌ నంబర్‌ను అనుసంధానం చేసుకున్న ఓటర్ల పేర్లను తొలగించడానికి ఎవరైనా ఫారం–7 సమర్పిస్తే సంబంధిత ఓటరు ఫోన్‌కు ఎన్నికల సంఘం నుంచి సందేశం అందుతుందని తెలిపారు. ఒకవేళ ఫోన్‌ నంబర్‌ అనుసంధానమై ఉండకపోయినా, పైన పేర్కొన్న విధానంలో చర్యలు తీసుకుంటారని ఓటర్లకు భరోసా కల్పించారు. 

ఓటరు చనిపోయారనే కారణంతో అతడి పేరును తొలగించాలని ఎవరైనా ఫారం–7 సమర్పిస్తే బీఎల్‌ఓ తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మరణ ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న తర్వాతే ఆ ఓటరు పేరును తొలగిస్తారని తెలిపారు. ఓటరు శాశ్వతంగా చిరునామా మారడంతో అతడి పేరును తొలగించాలని ఫారం–7 దాఖలు చేస్తే సంబంధిత ఓటరుకు నోటీసులు జారీ చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓ విచారణ అనంతరమే నిర్ణయం ఉంటుందన్నారు.

ఇక ఓటర్ల ఇళ్లకు బీఎల్‌ఓలు
నోటీసులు అందుకున్న ఓటర్లు ఈఆర్వోల కార్యాలయాలకు ఇకపై విచారణకు వెళ్లాల్సిన అవసరం లేదని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. స్థానిక బీఎల్‌ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఈసీఐ నెట్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారన్నారు. ఈ పత్రాలను పరిశీలించి ఈఆర్వోలు/అదనపు ఈఆర్వోలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశామన్నారు. 

ప్రత్యేక కేసుల్లోనే ఓటర్లను విచారణకు పిలుస్తారని, ఓటరుకు బదులు కుటంబ సభ్యులు హాజరు కావచ్చన్నారు. నైట్‌ షెల్టర్లు, కూలీలు, పేదలు, నిరాశ్రయులకు సహకరించేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. సర్‌లో భాగంగా కొత్త ఓటరుగా నమోదుకు ఫారం–6తోపాటు స్వీయధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుందని, ఆ తర్వాత కాలంలో అవసరం ఉండదన్నారు. సమావేశంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్‌ రెడ్డి, డిప్యూటీ సీఈఓ జీఎస్‌ చారి పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement