ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు బ్రేక్‌! | Khairatabad Bypoll Put On Hold Election Commission: Telangana | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు బ్రేక్‌!

Oct 2 2026 4:30 AM | Updated on Oct 2 2026 4:30 AM

Khairatabad Bypoll Put On Hold Election Commission: Telangana

ఎన్నికల పిటిషన్‌ తేలే వరకు ఉప ఎన్నిక వద్దు 

హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌ నేత విజయారెడ్డి 

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రస్తావన 

కీలకంగా ఈసీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ కేసు ఉత్తర్వులు 

సీజే ధర్మాసనం ఏ నిర్ణయం వెల్లడిస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు బ్రేక్‌ పడనుంది. తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ తేలే వరకు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని 2023 ఎన్నికల నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నిక ఆపేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆమె కోరారు. ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఈసీ కూడా అంగీకరించడంతో ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడంలేదని నిపుణులు అంటున్నారు.

 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయారెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో దానం విజయం సాధించారు. అనంతరం ఎన్నికల అఫిడవిట్‌లో భార్యతోపాటు తనపై ఆధారపడిన వారి ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ విజయారెడ్డి 2024, జనవరి 20న ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. నాగేందర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ పిటిషన్‌ 2024, డిసెంబర్‌ తర్వాత విచారణకు రాలేదు.  

2 న్యాయపర అంశాలు.. 2 వేర్వేరు కేసులు 
నాగేందర్‌పై ఇటీవల వచ్చిన అనర్హత తీర్పు, విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ వేర్వేరు న్యాయ ప్రక్రియలు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో నాగేందర్‌ ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడని ఓ కేసులో తేలింది. హైకోర్టు సెప్టెంబర్ 18న నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించగా, సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఉపశమనం లభించలేదు. అనంతరం ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ కార్యదర్శి సెప్టెంబర్‌ 26న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

దీంతో ఉపఎన్నికకు మార్గం సుగమమైందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో తాజా పిటిషన్‌తో ఉప ఎన్నికపై సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు, 2023లో ఆయన సాధించిన ఎన్నిక చట్టబద్ధంగా జరిగిందా? లేదా? అన్నది ఎన్నికల పిటిషన్‌లో తేలాల్సి ఉంది. ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు గత తీర్పులు ఏమిచ్చాయో పరిశీలించాల్సి ఉంది.  

సుప్రీంకోర్టు సూత్రం ప్రకారం 
ఎన్నికల సంఘం వర్సెస్‌ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) కేసులో.. ఎన్నికల పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న సందర్భంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించిన అంశాన్ని కోర్టు పరిశీలించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 151ఏ ప్రకారం సాధారణంగా ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నా, ఎన్నికను సవాల్‌ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌ ఇంకా తుది పరిష్కారం కాకపోతే ఆ ఖాళీని వెంటనే భర్తీ చేయడానికి అందుబాటులో ఉన్న ఖాళీ (క్యాజువల్‌ వేకెన్సీ)గా పరిగణించలేమని పేర్కొంది. 

ఎన్నికల పిటిషన్‌లో గెలిచిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేయాలని మాత్రమే కాకుండా, పిటిషనర్‌ లేదా మరో అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని కూడా కోరితే.. ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా.. అదే స్థానానికి ఉపఎన్నిక నిర్వహిస్తే, ఒకే నియోజకవర్గానికి ఇద్దరు వ్యక్తులు ఎన్నికయ్యే పరిస్థితి ఉత్పన్నమవ్వొచ్చని పేర్కొంది. అందువల్ల అటువంటి పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న స్థానాన్ని సాధారణ ఖాళీగా పరిగణించి ఉపఎన్నిక నిర్వహించలేమనే న్యాయ సూత్రాన్ని స్పష్టం చేసింది. ప్రమోద్‌ లక్ష్మణ్‌ గుడాధే వర్సెస్‌ ఎన్నికల సంఘం కేసులోనూ ఇదే న్యాయ సూత్రాన్ని ప్రస్తావించింది. 

ఖైరతాబాద్‌ విషయంలోనూ.. 
ఖైరతాబాద్‌ వ్యవహారంలోనూ ఇది కీలకంగా మారనుంది. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌లో దానం ఎన్నికను రద్దు చేయడంతోపాటు తనను శాసనసభ్యురాలిగా ప్రకటించాలని కోరారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన న్యాయ సూత్రాన్ని ఇక్కడ కూడా వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుల్లో చర్చించిన అంశాలు, ప్రస్తుత ఖైరతాబాద్‌ స్థానంలో ఖాళీ ఏర్పడిన విధానం, విజయారెడ్డి పాత ఎన్నికల పిటిషన్‌.. అన్ని అంశాలను హైకోర్టు విడిగా పరిశీలించాల్సి ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం ఖైరతాబాద్‌ స్థానాన్ని ఖాళీగా ప్రకటించినందున ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. విజయారెడ్డి తాజా పిటిషన్‌ నేపథ్యంలో ఎన్నికలు నిలిచినట్లేనని చెబుతున్నారు. కాగా, రిట్‌ పిటిషన్‌ విచారణ తర్వాత సీజే ధర్మాసనం ఏ తీర్పునిస్తుందా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement