ఎల్‌నినో ప్రభావంతో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపులలో ఎండిపోయిన మానేరు. ప్రధానంగా పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో ఏడాది పొడవునా పారే మానేరు.. ఇలా ఎండిపోవడంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. – ఓదెల
సాధారణంకన్నా ఎక్కువగా నమోదవనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
ఎల్‌నినో ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ లోటు వానలే
అక్టోబర్–డిసెంబర్ అంచనాలు విడుదల చేసిన వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా రాష్ట్రంలో మూడు నెలలపాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అలాగే ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ వర్షాలు తక్కువగా కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు, ఉష్ణోగ్రతల పరిస్థితులపై తాజాగా అంచనాలు విడుదల చేసింది.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది జాతీయస్థాయిలో నమోదైన 13 శాతం లోటు కంటే ఎక్కువ. దీంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినప్పటికీ... ఎల్‌నినో ప్రభావం ఫిబ్రవరి దాకా కొనసాగే అవకాశం ఉన్నందువల్ల ఈశాన్య రుతుపవనాల్లోనూ వర్షాభావ పరిస్థితులుంటాయని అంచనా వేసింది.
ఇప్పటికే వేసవిని తలపిస్తున్న ఉష్ణోగ్రతలు..
సాధారణంగా నైరుతి సీజన్ చివర్లోనే∙ఉష్ణోగ్రతలు చల్లబడటం, చలి ప్రభావం మొదలవడం కనిపిస్తుంది. కానీ ప్రస్తుత వాతావరణం వేసవి సీజన్‌ను తలపిస్తోంది. రాష్ట్రంలో సగటున 34–38 డిగ్రీల సెల్సియస్ మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు పగటిపూట ఉక్కపోత కూడా అధికంగానే ఉంటోంది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సగటున 11.02 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉందని.. కానీ ఐఎండీ అంచనాల ప్రకారం కనీసం 30 శాతం తక్కువగా వర్షాలు కురవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ నెలలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఏపీ, తమిళనాడుపైనే వాటి ప్రభావం ఉంటుందని.. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశంతక్కువని విశ్లేషిస్తున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని.. దీంతో చలి తీవ్రత పెద్దగా ఉండదని చెబుతున్నారు.


