Maximum temperatures
-
మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఎండలు ఇంకా తగ్గలేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికీ సాధారణ స్థితికి చేరుకోలేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులతో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే తక్కువగానే నమోదవుతున్నప్పటికీ అవి ఇంకా సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గురువారం ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీలు అధికంగా నమోదవగా నిజామాబాద్, హనుమకొండ, హైదరాబాద్‌లలో 4 డిగ్రీల మేర అధికంగా రికార్డయ్యాయి. కేవలం ఖమ్మం, భద్రాచలంలలో మాత్రమే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కూడా విపరీతంగా ఉండటంతో నడివేసవి పరిస్థితి గుర్తుచేస్తోంది. రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో నమోదైంది.నైరుతి విస్తరణ బాట..నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న 2–3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికితోడు తెలంగాణ, దక్షిణ కోస్తా ఏపీ మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
అటు మండే ఎండలు.. ఇటు పిడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పన్టీమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటొచ్చు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం 41–42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జైన్ తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40–41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాగా.. మంగళవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 42.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 42.4, మన్యం జిల్లా భామినిలో 42.2, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 42, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా పిఠాపురంలో 41.6, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెం 41.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కొనసాగుతున్న ఎండ తీవ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ మండిపోతోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.7, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.3, కృష్ణా జిల్లా కానుమోలులో 43.1, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 43.1, ప్రకాశం జిల్లా కరేడులో 43, విజయనగరం జిల్లా రాజాంలో 42.7, అనకాపల్లి జిల్లా రాజాంలో 42.6 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కర్నూలు జిల్లా పి.కోటకొండలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లా హంద్రీకైర్వాడిలో 4.2, బాపట్ల జిల్లా గూడవల్లిలో 4.2, కర్నూలు జిల్లా గూడూరులో 2.7, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1.7, ఎర్రమంచిలో 1.3, అనంతపురం జిల్లా సలకంచెరువులో 1.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. నేడు ఎండ తీవ్రత ఉండే ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
ఎండలకు 40 మంది మృత్యువాత
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 40 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే శుక్రవారం రాత్రి, శనివారం వడదెబ్బతో 22 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 మంది మృతిచెందారు. మహబూబాబాద్‌లోని ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలోని చింతచెట్టుపై ఉన్న వందలాది గబ్బిలాలు ఎండ త్రీవ్రతతో మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. మహబూబాబాద్ జిల్లాలో కురవి మండలం బలపాలకు చెందిన రొయ్యలపెద్దరాములు(75), బంగారుగూడెం తండా గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూడు జాన్వు(38), సీరోలు మండలం బీల్యానాయక్ తండాకు చెందిన బానోత్ కమ్లి(65), డోర్నకల్ యాదవనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ జానీమియా(43), గూడూరు మండల కేంద్రానికి చెందిన పెసరి వీరమల్లు (70) చనిపోయారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బండ చిన్నమల్లయ్య(90), కక్కిరాలపల్లికి చెందిన అలువాల నీలమ్మ(80), ఇదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి శాంతమ్మ(90), ఎల్కతుర్తి మండలం పెంచికలపేటకు చెందిన దుగ్యాని కొమురయ్య(101), కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన పొడేటి లచ్చమ్మ (82), పరకాల శ్రీనివాసకాలనీకి చెందిన టైలర్ వెల్దండి వెంకటేశ్వర్లు(48) చనిపోయారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన రోజువారీ కూలీ పెద్దమ్మ కుమారస్వామి (60), వరంగల్ 41వ డివిజన్ విశ్వనాథ కాలనీకి చెందిన నాయీబ్రహ్మణుడు సింగారపు కుమారస్వామి (45), రంగశాయిపేట కాపువాడకు చెందిన శెంకేశి భాగ్యలక్ష్మి(60), పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దొడ్డ సత్యనారాయణ, రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన చిన్నపాక యాకయ్య(50) మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన దుర్గం అంకయ్య(65), కాటారం రేగులగూడెం జీపీ పరిధిలో భూయాన్ వినోద్(35), కాళేశ్వరంలో సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చిన గుర్తు తెలియని భక్తుడు(50) శనివారం వడదెబ్బతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడేనికి చెందిన హమాలీ కార్మికుడు గొడిశాల పరశురాములు(55), జనగామ అంబేడ్కర్ నగర్‌కు చెందిన యాచకురాలు జ్యోతి(58), ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రునిపేటకు చెందిన రైతు ఊటుకూరి సోమిరెడ్డి(78) వడదెబ్బతో మృతిచెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... పెద్దపల్లిలోని ముత్యాల పోచమ్మవాడకు చెందిన దినసరి కూలీ ఫయాజ్ (52), సుల్తానాబాద్ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన న్యాతరి మొండయ్య (76), ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల మధుసూదన్‌రెడ్డి (53), రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుడిగె కమల(65), యైటింక్లయిన్‌కాలనీ వెంకట్రావుపల్లి కేకేనగర్‌కు చెందిన కనుకుట్ల ఐలమ్మ(73), గోదావరిఖని పరుశరాంనగర్‌కు చెందిన ఎం.శంకర్(45), గోదావరిఖనిలోని మధుప్రియ హోటల్లో పనిచేస్తున్న వెల్దండి మహేశ్(52), ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మీకురాలు గజనవేని మల్లమ్మ(56), రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన మంచాల నరసయ్య(75), మిట్టపల్లి శంకర్(48), కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దామెరశెట్టి మల్లేశం (52) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన రామగిరి పుల్లమ్మ(78), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గోపాల్‌నగర్‌కు చెందిన సట్వే శంకర్(50), గణేశ్‌నగర్‌కు చెందిన ఎనుపోతుల బాబు(65) వడదెబ్బతో చనిపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో... నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) ఎర్రచెరువుతండాకు చెందిన రైతు ఆంగోతు యుగేంధర్(32), యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంకు చెందిన కార్పెంటర్ దేవరకొండ శంకరయ్యచారి(65), మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వరికుప్పల శంకరయ్య(65), ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్‌కు చెందిన చెన్న హరికిషన్ (50) వడదెబ్బ తగిలి మృతిచెందాడు. -
ఉడుకుతున్న ఊళ్లు
సాక్షి, హైదరాబాద్: అత్యధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తీవ్ర స్థాయికి చేరి..నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా మండిపోతున్నాయి. గురువారం అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చుంచుపల్లి, కమలాపూర్, ధర్మపురి, మహదేవ్పూర్, గంగధార, కల్లూరు, ఆసిఫాబాద్, మందమర్రి, వెంకటాపూర్, కట్టంగూరు, వేములవాడ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 46.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరో 10 ప్రాంతాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చురుగ్గా నైరుతి... నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులు తున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు మరియు తూర్పు–మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ నెల 26న కేరళను తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. భగ్గుమన్న ఉమ్మడి ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సూర్యుడు పంజా విసిరాడు. రికార్డుస్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఖమ్మం జిల్లాలోని 42 వెదర్ స్టేషన్లలో 45 డిగ్రీలకుపైగా రెడ్ అలర్ట్ స్థాయిలో నమోదయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 19 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. – ఖమ్మం జిల్లాలోని కల్లూరు, సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ, వైరా, భద్రాద్రి జిల్లాలోని చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్, పాల్వంచ మండలం యానంబైల్‌లో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. – ఏన్కూరు మండలం తిమ్మారావుపేట, మధిర, కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, బోనకల్ మండలం రావినూతల, మధిర మండలం సిరిపురం గ్రామాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. – సత్తుపల్లి, ముదిగొండ, ఖమ్మం అర్బన్ ప్రకాశ్‌నగర్, ఎర్రుపాలెం, ఖమ్మం అర్బన్ ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. కంటెయినర్లో మంటలు....8 కొత్త కార్లు దహనం తూప్రాన్: కంటెయినర్లో మంటలు చెలరేగి అందులో ఉన్న 8 కొత్త కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. నాగపూర్ నుంచి కాకినాడకు మారుతి సుజుకి కంపెనీకీ చెందిన ఎనిమిది కొత్త కార్లతో కంటెయిన్ వెళుతోంది. తూప్రాన్ సమీపంలోని నాగులపల్లి చౌరస్తా సమీపంలోకి కంటెయినర్ చేరుకోగా, ఇంజిన్‌లో నుంచి పొగలు రావడం డ్రైవర్ నజీం గమనించాడు. వెంటనే అప్రమత్తమై కంటెయినర్‌ను రహదారి పక్కకకు ఆగి కిందకు దిగాడు. ఈ క్రమంలోనే లారీ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో ప్రమాద రహదారిపై ట్రాఫిక్ జామ్ కాగా, వాహనాలను దారి మళ్లించారు. అయితే ప్రమాదానికి అధిక ఉష్ణోగ్రతే కారణమని భావిస్తున్నారు. హార్వెస్టర్ దగ్ధం ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా సమీపాన రోడ్డుపై హార్వెస్టర్ కాలిపోయింది. ఎండవేడికి బ్యాటరీలోని వైరింగ్ ఒక్కసారిగా కాలి మంటలు హార్వెస్టర్ మొత్తం వ్యాపించాయి. దీంతో హార్వెస్టర్ పూర్తిగా కాలి బూడిదయింది. రోడ్డుపై అమ్లెట్ నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గురువారం నర్సంపేట–వరంగల్ ప్రధాన రహదారిపై స్థానికుడు ఎస్కె.రఫీసాఫ్ ఆమ్లెట్ వేశాడు. వడదెబ్బతో 8 మంది మృతి – మృతుల్లో ఇంటర్ విద్యార్థి సాక్షి నెట్వర్క్: వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 8మంది మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన కౌలురైతు పొన్నాల భరత్ (34), మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వలకు చెందిన గాదె కొమురమ్మ(90), బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన కేస లచ్చమ్మ(90), నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్‌తండాకు గుగులోత్ అమృత (54), కురవి మండలం రాజోలుకు చెందిన నల్ల లింగయ్య(70), ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మాదరి లక్షి్మ(85), జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్ గ్రామానికి చెందిన నాంపల్లి సక్కమ్మ(58) చనిపోయారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన బొమ్మిడి వెంకటేశ్(17) నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేశారు. వేసవి సెలవులు కావడంతో గ్రామంలోని టెంట్ హౌస్‌లో పనికెళ్తున్నాడు. వడదెబ్బకు గురై చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. -
ఆరోగ్యానికి 'సెగ'!
ఎండ ఎరుపు రంగు పూసుకుంది.. ఉదయం ఏడింటికే సుర్రుమంటోంది.. సాయంత్రం చీకటిపడేదాకా తాపం తగ్గేది లేదంటోంది.. ఇంకేముంది భానుడి సెగ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. మండుటెండల కారణంగా వడ‘దెబ్బ’ పొంచి ఉంది. ఇప్పటికే వడదెబ్బలు నమోదవుతున్నాయి.. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కడప రూరల్: సూర్యుడు ‘చుర్రు’మంటున్నాడు.. మాడు పగిలేలా భగభగమంటున్నాడు. ఇటీవల కాలంలో వాతావ‘రణం’ రణరంగంగా మారింది. దీంతో ప్రజల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పటికే 42–43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నరోజుల్లో 48 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావర ణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా..ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. జాగ్రత్తలతోనే అడ్డుకట్ట... ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం (హైపో «థలామన్) దెబ్బతింటుంది. ఫలితంగా సదరు వ్యక్తి వడదెబ్బకు గురవుతాడు. దీనినే ‘హీట్ స్ట్రోక్’ లేదా ‘సన్ స్ట్రోక్’ అంటారు. ఈ దశ ప్రమాదకరం, ప్రాణాంతకం. లక్షణాలు..కారణాలు.. » చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం » వణుకు పుట్టడం. మగత నిద్ర లేదా కలవరింత. »ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి కలగడం. » శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం. శరీరం ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది. శరీరంలో కలిగే మార్పులు... » వేడి వల్ల చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోతుంది. లేదా శరీరంలోని నీటి నిష్పత్తి తగ్గుతుంది. » ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు 3–4 లీటర్ల నీటిని చెమట రూపంలో శరీరం కోల్పోతుంది. అధికంగా అనారోగ్యానికి గురయ్యేవారు ఎవరంటే.... 65 ఏళ్ల వయస్సు పైబడిన వారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు » అనారోగ్యంతో బాధపడుతున్న వారు. ఉదాహరణకు అధిక రక్తపోటు, గుండె జబ్బులు కలిగిన తదితరులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.ప్రథమ చికిత్స ఇలా... » వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలి. » చల్లని నీటితో ముంచిన తడి గుడ్డతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడి గుడ్డతో తుడవాలి. ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలేలా ఉంచాలి. » ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్ఎస్ (ఓరల్ రీ హై డ్రేషన్) ద్రావణాన్ని తాగించాలి. » వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. వీలైనంత త్వరగా వైద్యుడి వద్దకు తీసుకుపోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు» తలకు టోపీ, రుమాలు వాడాలి. వేడిగాలి తగలకుండా చూసుకోవాలి. » గొడుగు వాడాలి. తెలుపు రంగు, పలచటి చేనేత వస్త్రాలను ధరించాలి. » ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పని చేయకుండా ఉండాలి. » శీతల పానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. » ఇంటి నుంచి బైటకు వెళ్లే ముందు ఒక గ్లాసు మంచి నీరుతాగాలి. వీలైనన్ని సార్లు మంచి నీటిని తాగడం మంచిది. » ఎండలో తిరిగే సమయంలో చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు, చల్లని మంచి నీరు తాగాలి » తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తల తిరగిడం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణం వైద్యులను సంప్రదించాలి. కిడ్నీలపై డీహైడ్రేషన్ ప్రభావం వేసవి కాలంలో డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతా యి. ఇన్ఫెక్షన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సీజన్లో కిడ్నీలను కాపాడుకోవాలంటే ఒక రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు ను తగ్గించాలి. –డాక్టర్ దినేష్‌కుమార్‌రెడ్డి, మూత్రపిండాల వైద్య నిపుణులు, కడప. -
జూలైలోనూ వేసవే.!
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె వెళ్లిపోయింది. వేసవి కాలం ముగిసింది. వర్షాలు దండిగా కురవాల్సిన సమయం.. కానీ భానుడి భగభగలు తగ్గకపోగా మరింత పెరిగాయి. ఈ సారి నైరుతి ముందుగానే పలకరించినా జూలైలో ముఖం చాటెయ్యడంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా జూలైలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పొడిగాలుల కారణంగా శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీల అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరులో అత్యధికంగా 39.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. జంగమహేశ్వరపురంలో 39.2, కావలి, మచిలీపట్నంలో 38.9, తిరుపతిలో 38.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 14 వరకూ ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని, 15వ తేదీ సాయంత్రం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
నిప్పుల కొలిమి.. రికార్డు స్థాయిలో ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో చాలా ప్రాంతాలు భగభగమంటున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గత వారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఐదు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతు న్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్ర తలు తార స్థాయికి చేరాయి. మరోవైపు గాలిలో తేమ శాతం కూడా పెరగటంతో ఉక్క పోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. బుధవారం నిజామాబాద్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణో గ్రత మెదక్‌లో 24.3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్ర తలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డయ్యాయి. నిజామాబాద్‌లో 3.6, ఆదిలాబాద్‌లో 3.4, ఖమ్మంలో 3.1 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటిపూట జన సంచారం తగ్గింది. అత్యవసరమైతేనే ప్రజలు బయ టకు రావాలని, మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ప్రాంత జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతుండటంతో రాత్రిపూట కూడా వేడి తగ్గటంలేదు. -
పెరుగుతున్న ఎండల తీవ్రత
సాక్షి, అమరావతి: వేసవి తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటోంది. నిన్నటి వరకు రెండు, మూడు చోట్ల మాత్రమే 40 డిగ్రీలు దాటిన ఎండ.. గురువారం చాలా మండలాల్లో 40 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో 42.1 డిగ్రీలు నమోదైంది. ఇవి సాధారణంకంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండో వారానికల్లా మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గాలిలో తేమ శాతం ఎక్కువగానే ఉండడం వల్ల ఉక్కపోత ఉండడంలేదు. అయితే ఎలినినో పరిస్థితుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మున్ముందు ఎండ, వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అప్పుడే భగభగలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి రెండో వారంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈసారి వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. వాస్తవానికి మార్చి మొదటి వారం నుంచి వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ క్రమంలో మార్చిలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. కానీ గత రెండ్రోజుల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్‌లో సగటు ఉష్ణోగ్రతకన్నా 4.4 డిగ్రీలు అధికంగా, నిజామాబాద్‌లో 3.2, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మంలో 3 డిగ్రీలు అధికంగా నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డు అయింది. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు వేగంగా పెరినట్లు ఐఎండీ తెలిపింది. రానున్న మూడు రోజులు ఇదేతరహాలో వాతావరణం ఉంటుందని వివరించింది. వడదెబ్బతో కూలి మృతి రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజా పేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి బొల్లారం నర్సమ్మ (55) వడదెబ్బతో మృతిచెందింది. నర్సమ్మ గురువారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిoది. దాహం వేయడంతో నీళ్లు తాగింది. ఆ వెంటనే ఆమె అస్వస్థతకు గురైంది. నర్సమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. -
చిటపట.. గజగజ..
రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి.. పగలంతా ఉక్కపోత.. రాత్రయితే వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు పతనం కావడం, చలిగాలుల ప్రభావంతో వాతావరణం వేగంగా చల్లబడుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోతగా ఉంటే.. రాత్రిపూట గజగజమంటూ చలి వణికిస్తోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకు మించి నమోదవుతుండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంకంటే తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వర కు అధికంగా నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. బుధవా రం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 34.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో జనజీవనం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ మార్పులు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయ ని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణో గ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం భారీ వ్యత్యాసంతో నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతకంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కాగా, హైదరాబాద్, రామగుండంలో 3డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది.రాష్ట్ర ప్రణాళికా విభా గం వివరాల ఆధారంగా కనిష్ట ఉష్ణోగ్రత కోహి ర్లో 6.9 డిగ్రీలుగా నమోదైంది. రానున్న 3 రోజులు కూడా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ గా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారు లు అంచనా వేస్తున్నారు. ఈసారే ఎందుకిలా?రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో చలిగాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు పతనం కావడం, చలిగాలుల ప్రభావంతో వాతావరణం వేగంగా చల్లబడుతోంది. భౌగోళికంగా రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గడం, పెరగడం జరుగు తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతుంటాయి. ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి బలమైన చలిగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. గతేడాది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదు కాగా.. ఈ ఏడాది మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
నిప్పులు కక్కుతున్న సూరీడు
సాక్షి, హైదరాబాద్: సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. భద్రాచలంలో గరిష్టంగా 43.8 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4.6 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 3.7 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రెండురోజులు పలుచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట్లకు ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రస్థాయిలో ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రణాళికా శాఖ ప్రకారం 45 డిగ్రీలపైనే.. ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలాచోట్ల ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో 45.4, ములుగు జిల్లా మంగపేటలో 45.3, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వాపురంలో 45.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
వేడి నుంచి కాస్త ఊరట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. ఆకాశం మేఘావృతం కావడంతో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత మాత్రం అధికంగానే ఉంది. శనివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 38.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ప్రస్తుతం మరఠ్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కోమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి తక్కువ ఎత్తు నుంచి దక్షిణ, ఆగ్నేయ దిశల వైపుగా గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. వానలతో పాటు వడగండ్లు కూడా పడతాయని హెచ్చరించింది. సాధారణం కంటే తక్కువగా... శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సగటున 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఇక రామగుండంలో 3 డిగ్రీల కంటే తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. -
పగలు భగభగ.. రాత్రి గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గతవారం వరకు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఇప్పుడు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తి కావడంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం తోడుకావడం, రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పతనం కావడంతో పాటు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లో తక్కువగా.. సెప్టెంబర్ నెలాఖరుతో వానాకాలం ముగిసినప్పటికీ... అక్టోబర్ రెండో వారం వరకు నైరుతి ప్రభావం ఉంటుంది. తాజాగా నాలుగో వారం వరకు చలి తీవ్రత పెద్దగా లేకపోగా... రెండ్రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో కని ష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. మెదక్, వరంగల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దక్షిణ ప్రాంత జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... ఉత్తర ప్రాంతంలో మాత్రం సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 15 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. -
ఢిల్లీలో తీవ్ర ఉక్కబోత!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతోంది. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్‌కుపైగా నమోదవుతుండటంతో జనం ఉక్కపోతతో ఉడికిపోతున్నారు. పొరుగున ఉన్న పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో తీవ్రమైన వడగాలుల కారణంగా ఢిల్లీలో వేడి భయంకరంగా ఎక్కువైంది. బుధవారం ఢిల్లీలో 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, అవి ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం చెబుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రత కారణంగా ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. జూన్ ఒకటో తేదీన 4,390 మెగావాట్లుగా నమోదైన విద్యుత్ డిమాండ్ బుధవారానికి 7,190 మెగావాట్లకు ఎగసింది. -
హే.. సూర్య ‘భగ’వాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదవుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మంగళవారం మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మినహా మిగతా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.6 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. -
రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం
సాక్షి, హైదరాబాద్: హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, ఉదయం సమయాల్లో పొగమంచు ఏర్పడే అవకాశముందన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 7 డిగ్రీలకు పడిపోయింది. రామగుండంలో 12, హకీంపేట, హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మహబూబ్‌నగర్‌లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏకంగా 9 డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీలు నమోదైంది. ఏడు డిగ్రీలు తక్కువగా భద్రాచలంలో 25, హన్మకొండలో 24, హైదరాబాద్‌లో 23 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాష్ట్రం.. గజగజ
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం: చలి.. చలి! చిన్నా పెద్దా ఒకటే వణుకు... ఉష్ణోగ్రతల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో పగలు, రాత్రి అనే తేడా తెలియడం లేదు. భానుడి కిరణాలు సోకక ఎటు చూసినా, ఎప్పుడు చూసినా మసక మసకగానే కనిపిస్తోంది. చలి పులి పట్టపగలే అందరినీ గజగజలాడిస్తోంది. శీతల గాలుల ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలో 45 మంది మృత్యువాత పడటం గమనార్హం. ఇక నోరులేని మూగజీవాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, పెథాయ్ తుపాను ప్రభావంతో అతి శీతలమైన ఈదురు గాలులు ఈడ్చి కొడుతుండటంతో రాష్ట్రం మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర చలితో వణికిపోతోంది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. దీంతో పగటిపూట కూడా చలిగా ఉంటోంది. ఒక్కసారిగా పెరిగిన చలి జనం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న శీతల పవనాలకు తట్టుకోలేక సోమవారం 26 మంది ప్రాణాలు కోల్పోగా మంగళవారం 19 మంది చనిపోయారు. రాష్ట్రంలో వడగాడ్పు మరణాలు భారీగా నమోదైనా చలిగాలులకు ఇంత పెద్ద ఎత్తున మృత్యువాత పడటం అరుదని పేర్కొంటున్నారు. వణికిస్తున్న ఉత్తరాది గాలులు బంగాళాఖాతంలో అల్పపీడనం/వాయుగుండం/తుపాన్లు ఏర్పడినప్పుడు మేఘాలు ఆవరించి ఉంటాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చలి తీవ్రత అంతగా ఉండదు. అయితే నిన్నటిదాకా కొనసాగిన పెథాయ్ తుపాను అల్పపీడనంగా బలహీనపడడంతో చలికి రెక్కలొచ్చి నట్టయింది. శనివారం నుంచే వణికించడం మొదలైంది. అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశం నుంచి కోస్తా వైపు చల్ల గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో పగలు, రాత్రి చలి తీవ్రత పెరుగుతోంది. ఇళ్లలోనే గడుపుతున్నా ఇబ్బంది పెడుతోంది. డిసెంబర్ 22వతేదీ నుంచి సూర్యుడు ఉత్తరార్థగోళం వైపు పయనించడం వల్ల భూమికి దూరమవుతాడు. ఫలితంగా సూర్యకిరణాలు వాలుగా పడుతూ ఎండ తీవ్రత తగ్గి రాత్రి ఉష్ణోగ్రతలు క్షీణిస్తాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా (సాధారణం కంటే 3–10 డిగ్రీలు) తక్కువగా నమోదవుతున్నాయి. ఇది క్రమంగా మరింత తగ్గి చలి విజృంభిస్తుందని, అదే సమయంలో పొగమంచు కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పడిపోయిన గరిష్ట ఉష్ణోగ్రతలు.. రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే బాగా పడిపోయాయి. కృష్ణా జిల్లా నందిగామలో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు విజయవాడలో 9, మచిలీపట్నంలో 8, తునిలో 7, నరసాపురంలో 7, జంగమేశ్వరపురంలో 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన పగటి, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం స్పల్పంగా మాత్రమే ఉండటం గమనార్హం. చలి భారీగా పెరగడంతో ఉదయం 9 గంటలకు కూడా ట్యాప్ తిప్పితే నీళ్లు షాక్ కొడుతున్నాయి. మంచు దట్టంగా కురుస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామునే చలిమంటలు వేస్తున్నారు. పంటలకు కాపలాగా పొలాల్లో పడుకునే వారు దుంగలు రాజేసి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చలికి శరీరం గడ్డ కట్టుకుపోయేలా ఉందని వృద్ధులు పేర్కొంటున్నారు. ఉదయం 9 గంటలకు కూడా చలిగా ఉండటంతో బయటకు వెళ్లినవారు వణుకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. తెల్లవారుజామునే ఉదయం నడక కోసం వెళ్లేవారు ఈ చలితో సమయాన్ని మార్చుకుని 8 –9 గంటల మధ్య వెళుతున్నారు. పొలం పనులకు వెళ్లే కూలీలు వణికిపోతున్నారు. సూర్యరశ్మి లేకపోవటంతో అరటి, బొప్పాయి ఆకులపై కురిసిన మంచు నీటి బిందువుల్లా ఉండిపోతోంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారు చలి తీవ్రత వల్ల నరకయాతన అనుభవిస్తున్నారు. చలి నేపథ్యంలో స్వెట్టర్లు, ఉన్ని దుస్తులకు బాగా గిరాకీ పెరిగింది. వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏజెన్సీలో రాకపోకలకు ఇబ్బందులు ఏజెన్సీ ప్రాంతంలో రాత్రిపూట పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో రాత్రిపూట వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అరకులో పర్యాటకుల కోసం రిసార్టు నిర్వాహకులు రాత్రిపూట చలిమంటలు ఏర్పాటు చేస్తున్నారు. గాజు కిటికీలకు బయట భాగంలో మంచు దట్టంగా ఆవరిస్తోంది. జనవరిలో మరింత ఉధృతం... విశాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉన్నా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా పూర్తిస్థాయిలో పడిపోలేదు. విశాఖ జిల్లా లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత డిసెంబరు చివరికి సున్నా డిగ్రీలకు చేరిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 7 – 8 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడే ఇక్కడి వారు ఇబ్బంది ఎదుర్కొంటారు. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతే ఇళ్ల ఎదుట చలిమంటలు వేసి నిద్రిస్తారు. దీంతో కొంతవరకూ చలి నుంచి ఊరట లభిస్తుంది. చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం, అరకు, మారేడుమిల్లి, సీతంపేట ఏజెన్సీల్లో జనవరిలో చలి తీవ్రరూపం దాల్చుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా చలి ముదురుతుంది. రక్తనాళాలు పూడుకుపోయే ప్రమాదం.. చలి బాగా పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, గుండె, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి సూచించారు. ‘చలికి శరీరంలో రక్తానికి గడ్డ కట్టే స్వభావం ఉంటుంది. దీనివల్ల గుండె రక్తనాళాలు పూడుకుపోతాయి. అందువల్ల హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, బలహీనులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. చలి నుంచి కాపాడుకోవాలి ఇలా.... – చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు ధరించాలి. చెవులకు చల్ల గాలి తగలకుండా ఉన్ని మఫ్లర్, టోపీ ధరించాలి. – ఇళ్లలోకి చల్ల గాలి రాకుండా కిటికీలు మూసివేయాలి. – అవకాశం ఉన్నవారు గది వాతావరణం పడిపోకుండా ఎయిర్ కండిషనర్లు వాడుకోవచ్చు. – ద్విచక్ర వాహనాలపై రాత్రిపూట, తెల్లవారుజామున వెళ్లాల్సి వస్తే ముక్కు, చెవులకు చల్ల గాలి తగలకుండా ఉన్ని టోపీ ధరించాలి.స్వెట్టర్లు వాడాలి. – ఉదయం నడక అలవాటు ఉన్నవారు సూర్యోదయమైన తర్వాత వెళ్లడం మంచిది. -
నేడు కోస్తాలో పిడుగులు పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఒకపక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుండగా మరోవైపు అకాల వర్షాలకు దారితీసే పరిస్థితులేర్పడ్డాయి. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అలాగే రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఆదివారం అత్యధికంగా రెంటచింతలలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తిరుపతి, నందిగామల్లో 41, విజయవాడ, కర్నూలు, అనంతపురం, నెల్లూరుల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
మండే ఎండలు మొదలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చి ప్రారంభం కావడంతో రానురాను ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ నుంచి వడగాడ్పులు మొదలవుతాయని.. ఈ సారి వడగాల్పులు ఎక్కువ రోజులు నమోదవుతాయని స్పష్టం చేసింది. దీంతో వేసవి ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. గత 24 గంటల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల వరకు అధికంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లలో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. భద్రాచలంలోనూ 2 డిగ్రీలు అధికంగా 38 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం, హన్మకొండల్లోనూ 3 డిగ్రీలు అధికంగా 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు అక్కడక్కడ సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండలో 23, నిజామాబాద్, భద్రాచలంలలో 21 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. హన్మకొండలో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
ఎండలు@ 44
-
ఎండలు@ 44
మంచిర్యాలలో అత్యధిక ఉష్ణోగ్రత హాజిపూర్ (మంచిర్యాల), హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సోమవారం మంచిర్యాల జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజులుగా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గమనార్హం. సోమవారం ఏకంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పలు వాతావరణ వెబ్సైట్లు పేర్కొనగా.. అధికారులు మాత్రం 41 డిగ్రీల మేర నమోదైనట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు కాస్త అటూఇటుగా నమోదవుతున్నాయి. ఇంకా మే రాక ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. అక్కడక్కడా వడగాడ్పులు వీస్తున్నాయి. దాంతో పగటిపూట బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. చాలా చోట్ల మధ్యాహ్నం పూట కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపిస్తోంది. వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుండటంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు వడదెబ్బకు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి మారుపాక కృష్ణయ్య(55), యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీదేవిగూడెంకు చెందిన ఉల్లెంతల బిచ్చయ్య(70), సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగకు చెందిన పండపాక రాజేందర్, కవిత దంపతుల కూతురు భానుజ (16 నెలలు)లు మృతి చెందారు. -
ఏపిలో భానుడి భగ భగ!
-
తెలంగాణలో 'సూర్య' ప్రతాపం
-
న‘గరం’
ప్రతాపం చూపిస్తున్న సూర్యుడు రాజధానిలో పెరిగిన ఉష్ణోగ్రతలు బుధవారానికి 43 డిగ్రీలకు చేరుకున్న గరిష్ట ఉష్ణోగ్రత జాగ్రత్తలు తప్పనిసరని హెచ్చరిస్తున్న వైద్యులు సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో భానుడి భగభగలు మొదలయ్యాయి. రోజురోజుకి సూర్యుడు తన ప్రతాపాన్ని పెంచుతున్నాడు. ఉదయం పది గం టలకే ఎండ తీవ్రత అధికమవుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో నగరవాసులు సతమతమవుతున్నారు. ఈ వారాంతానికి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరుకోగా, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. కాగా బుధవారం నమోదైన 43 డిగ్రీలు ఈ సీజన్లోనే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతగా వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎండవేడిమికి తోడు వడగాలులు వీస్తుండడంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ ఏడాది కాస్త ఆల స్యం గా మొదలైన వేసవి, కొద్ది రోజుల్లోనే తీవ్రరూపం దాల్చింది. అత్యవసర పనులు ఉన్నవారు మినహా మధ్యాహ్న సమయంలో బయటికి వచ్చేందుకు జనం ఇష్టపపడడం లేదు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రత్యేకించి వస్త్రధారణ, ఆహారపు అల వాట్లలో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచి స్తున్నారు. ద్విచక్రవాహనాలను వాడేవారు మధ్యా హ్న సమయంలో వీలైనంత తక్కువగా ప్రయాణించేలా చూసుకోవాలంటున్నారు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా వెంట ఒక మంచి నీళ్ల సీసా పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. వేసవితాపం తాళలేక... వేసవి తాపం నుంచి బయటపడేందుకు నగరవాసులు చల్లని పళ్లరసాలు, ఐస్‌క్రీమ్‌లు తింటూ గడుపుతున్నారు. పుచ్చకాయలు, చలవనిచ్చే పళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాల్లో పళ్లరసాలు, ఐస్‌క్రీమ్‌లు విక్రయించే చిన్నచిన్న వ్యాపారులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. ఎండ వేడిమి తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. వచ్చే వారం రోజులు సన్‌స్ట్రోక్ తప్పదు: వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేడిగాలుల తీవ్రత అధికమైంది. రాత్రి వేళల్లోనూ వేడిగాలులు వీస్తుండడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంకో వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికం అవుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వారం రోజుల్లో ఎండల తీవ్రత ఇలా ఉండవచ్చని వారు పేర్కొన్నారు. నీటి, విద్యుత్ సమస్యలపై దృష్టి సారించండి: ఎల్జీ న్యూఢిల్లీ: వేసవికాలంలో ప్రజల ఇబ్బందులు కలగకుండా వివిధ ప్రభుత్వ సంస్థలను డిప్యూటీ కమిషనర్లు సమన్వయం చేయాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. నగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ప్రజలకు అవసరమైన తాగునీటి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని పౌర సమస్యలపై రోజువారీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కిందిస్థాయి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ఎల్జీ కార్యాలయానికి పంపాలన్నారు. వీటిపై రాజ్ నివాస్‌లో సమావేశాలు ఉంటాయని తెలిపారు. అలాగే నగరవాసులకు ఇబ్బంది కలిగిస్తున్న ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమావేశం తర్వాత జంగ్ ముందు ఢిల్లీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజంటేషన్ ఇచ్చింది. -
ఉడికిపోతున్న జనం భగ్గుమంటున్న ఎండలు
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: ‘‘ఒరేయ్ శ్రీను ఏటిరా ఈ ఎండలు, ఉదయం 9 గంటలకే నెత్తి సుర్రుమంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నెలలో ఎలా ఉం టుందోరా’’ అంటూ మండే ఎండల గురించి జనం చర్చించుకుంటూ వగరుస్తున్నారు. ఓవైపు సెగలుకక్కుతున్న ఎండలు, మరోవైపు విద్యుత్‌కోతతో అల్లాడిపోతున్నారు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్లన్నీ ఉదయం తొమ్మిది గంటల తర్వాత నిర్మూనుష్యమవుతున్నాయి. మే,జూన్ నెలలను తలపించే ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. వేడి గాలులు కూడా తోడవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, రోగులు, గర్భిణులు, శస్త్రచికిత్సలు చేసుకున్నవారు, బాలింతలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అగ్నిప్రమాదాలకు గురై, చికిత్స పొందతున్న వారిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు, ఫుట్‌పాత్ వ్యాపారులు, రిక్షా కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులు, టోపీలు ధరించకుండా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కూలీలు అయితే 10 గంటలకే పనిముగించేసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పటికే పలువురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. శీతలపానీయాలను ఆశ్రయిస్తున్న జనం: ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. పళ్లరసాలు, కూల్‌డ్రింక్స్, కొబ్బరి బొండాలు, ఫ్రూట్ సలాడ్ వంటి వి తీసుకుంటున్నారు. దీంతో వీటి విక్రయాలు బాగా పెరిగాయి. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైయితే తప్ప బయటకు వెళ్లకూడదు. గొడుగు లేదా టోపీ, కళ్లద్దాలు ధరించి వెళ్లాలి. చర్మవ్యాధిగ్రస్తులు, పిల్లలు, వృద్ధులు ఎండలోకి వెళ్లరాదు. - బి.వెంకటేష్, పిల్లలు వైద్యుడు, కేంద్రాస్పత్రి 2012 తేదీ గరిష్టం కనిష్టం 15 33 25 16 35 27 17 37 29 18 39 30 19 36 29 2013 15 35 27 16 34 30 17 38 30 18 38 30 19 37 28 2014 15 37 28 16 37 27 17 37 29 18 36 20 19 37 29 -
వడదెబ్బ నుంచి రక్షణ ఇలా..
కడప రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో వేసవి సెగలు బుసగొడుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ఎండలు మండుతున్నాయి. ఫలితంగా ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. వృద్దులు, పిల్లల పరిస్థితి మరీ దారుణం. వడదెబ్బ గురించి అవగాహన పెంచుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.ప్రభుదాస్ గురువారం సూచించారు. వడదెబ్బ ఎలా తగులుతుందంటే: ఎండలో ఎక్కువగా తిరిగినా, పని చేసినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, తీవ్ర జ్వరం (105 డిగ్రీ నుంచి 110 డిగ్రీల వరకు) కండరాల నొప్పులు అపసార్మక స్థితిలోకి వెళ్లడం మరణం కూడా సంభవించవచ్చు ప్రథమ చికిత్స వడదెబ్బ తగిలిందనే అనుమానం కలిగిన వెంటనే ఆ వ్యక్తిని మంచి గాలి, వెలుతురు, నీడ ఉన్న ప్రదేశానికి తక్షణం తరలించాలి. దుస్తులను వదులు చేయాలి. చల్లటి గాలి తగిలేటట్లు ఏర్పాటు చూడాలి శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో తడిసిన గుడ్డతో శరీరం మొత్తం తుడుస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా చల్లని నీరు తాపుతూ ఉండాలి. జాగ్రత్తలు ఎండ తీవ్రంగా ఉండే సమయంలో బయటికి వెళ్లడం గానీ, పని చేయడం గానీ చేయరాదు. వదులుగా ఉండే తెల్లటి నూలు దుస్తులను ధరించాలి. చల్లని నీరు ఎక్కువగా తీసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో ఎండలో వెళ్లాల్సి వస్తే కళ్లకు కూలింగ్ అద్దాలు, తలపై టోపీ లేక గొడుగు వాడాలి. పనులు చేసేవారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కాకుండా తక్కువగా ఉన్న సమయంలో చేసుకోవడం మంచిది. జాగ్రత్తలు తీసుకున్నా శరీర ఉష్ణోగ్రత తగ్గకుంటే తక్షణం వైద్య చికిత్స కోసం దగ్గరలోని వైద్యులను సంప్రదించాలి.


