మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు | Maximum temperatures for another 3 days | Sakshi
Sakshi News home page

మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు

Jun 12 2026 3:48 AM | Updated on Jun 12 2026 3:48 AM

Maximum temperatures for another 3 days

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా తగ్గని ఎండలు

వచ్చే రెండ్రోజుల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఎండలు ఇంకా తగ్గలేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికీ సాధారణ స్థితికి చేరుకోలేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులతో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే తక్కువగానే నమోదవుతున్నప్పటికీ అవి ఇంకా సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. 

గురువారం ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీలు అధికంగా నమోదవగా నిజామాబాద్, హనుమకొండ, హైదరాబాద్‌లలో 4 డిగ్రీల మేర అధికంగా రికార్డయ్యాయి. కేవలం ఖమ్మం, భద్రాచలంలలో మాత్రమే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కూడా విపరీతంగా ఉండటంతో నడివేసవి పరిస్థితి గుర్తుచేస్తోంది. రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో నమోదైంది.

నైరుతి విస్తరణ బాట..
నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న 2–3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

 ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికితోడు తెలంగాణ, దక్షిణ కోస్తా ఏపీ మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement