ఎండలకు 40 మంది మృత్యువాత | 40 people die due to heatstroke in Telangana | Sakshi
Sakshi News home page

ఎండలకు 40 మంది మృత్యువాత

May 24 2026 3:46 AM | Updated on May 24 2026 3:46 AM

40 people die due to heatstroke in Telangana

నిర్మానుష్యంగా మారిన రాజేంద్రనగర్‌ రహదారి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 22 మంది, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 11 మంది మృతి

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 40 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే శుక్రవారం రాత్రి, శనివారం వడదెబ్బతో 22 మంది, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 11 మంది మృతిచెందారు. మహబూబాబాద్‌లోని ఇరిగేషన్‌ కార్యాలయ ఆవరణలోని చింతచెట్టుపై ఉన్న వందలాది గబ్బిలాలు ఎండ త్రీవ్రతతో మృత్యువాత పడుతున్నాయి.  

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..  
మహబూబాబాద్‌ జిల్లాలో కురవి మండలం బలపాలకు చెందిన రొయ్యలపెద్దరాములు(75), బంగారుగూడెం తండా గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూడు జాన్వు(38), సీరోలు మండలం బీల్యానాయక్‌ తండాకు చెందిన బానోత్‌ కమ్లి(65), డోర్నకల్‌ యాదవనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్‌ జానీమియా(43), గూడూరు మండల కేంద్రానికి చెందిన పెసరి వీరమల్లు (70) చనిపోయారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బండ చిన్నమల్లయ్య(90), కక్కిరాలపల్లికి చెందిన అలువాల నీలమ్మ(80), ఇదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి శాంతమ్మ(90), ఎల్కతుర్తి మండలం పెంచికలపేటకు చెందిన దుగ్యాని కొమురయ్య(101), కమలాపూర్‌ మండలం వంగపల్లికి చెందిన పొడేటి లచ్చమ్మ (82), పరకాల శ్రీనివాసకాలనీకి చెందిన టైలర్‌ వెల్దండి వెంకటేశ్వర్లు(48) చనిపోయారు. 

వరంగల్‌ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన రోజువారీ కూలీ పెద్దమ్మ కుమారస్వామి (60), వరంగల్‌ 41వ డివిజన్‌ విశ్వనాథ కాలనీకి చెందిన నాయీబ్రహ్మణుడు సింగారపు కుమారస్వామి (45), రంగశాయిపేట కాపువాడకు చెందిన శెంకేశి భాగ్యలక్ష్మి(60), పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దొడ్డ సత్యనారాయణ, రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన చిన్నపాక యాకయ్య(50) మృతిచెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన దుర్గం అంకయ్య(65), కాటారం రేగులగూడెం జీపీ పరిధిలో భూయాన్‌ వినోద్‌(35), కాళేశ్వరంలో సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చిన గుర్తు తెలియని భక్తుడు(50) శనివారం వడదెబ్బతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని ఇప్పగూడేనికి చెందిన హమాలీ కార్మికుడు గొడిశాల పరశురాములు(55), జనగామ అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన యాచకురాలు జ్యోతి(58), ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రునిపేటకు చెందిన రైతు ఊటుకూరి సోమిరెడ్డి(78) వడదెబ్బతో మృతిచెందారు.  

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో...  
పెద్దపల్లిలోని ముత్యాల పోచమ్మవాడకు చెందిన దినసరి కూలీ ఫయాజ్‌ (52), సుల్తానాబాద్‌ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన న్యాతరి మొండయ్య (76), ఓదెల మండలం కొలనూర్‌ గ్రామానికి చెందిన గీట్ల మధుసూదన్‌రెడ్డి (53), రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుడిగె కమల(65), యైటింక్లయిన్‌కాలనీ వెంకట్రావుపల్లి కేకేనగర్‌కు చెందిన కనుకుట్ల ఐలమ్మ(73), గోదావరిఖని పరుశరాంనగర్‌కు చెందిన ఎం.శంకర్‌(45), గోదావరిఖనిలోని మధుప్రియ హోటల్‌లో పనిచేస్తున్న వెల్దండి మహేశ్‌(52), ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మీకురాలు గజనవేని మల్లమ్మ(56), రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన మంచాల నరసయ్య(75), మిట్టపల్లి శంకర్‌(48), కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ దామెరశెట్టి మల్లేశం (52) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో.... 
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్‌ ఫారీక్‌(40), మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన రామగిరి పుల్లమ్మ(78), నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో గోపాల్‌నగర్‌కు చెందిన సట్వే శంకర్‌(50), గణేశ్‌నగర్‌కు చెందిన ఎనుపోతుల బాబు(65) వడదెబ్బతో చనిపోయారు.  

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో... 
నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) ఎర్రచెరువుతండాకు చెందిన రైతు ఆంగోతు యుగేంధర్‌(32), యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మందోళ్లగూడెంకు చెందిన కార్పెంటర్‌ దేవరకొండ శంకరయ్యచారి(65), మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వరికుప్పల శంకరయ్య(65), ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌కు చెందిన చెన్న హరికిషన్‌ (50) వడదెబ్బ తగిలి మృతిచెందాడు.  

Advertisement
 
Advertisement
Advertisement