ఉడుకుతున్న ఊళ్లు | Maximum Temperatures Reach Extreme Levels in Telangana | Sakshi
Sakshi News home page

ఉడుకుతున్న ఊళ్లు

May 22 2026 2:30 AM | Updated on May 22 2026 5:30 AM

Maximum Temperatures Reach Extreme Levels in Telangana

ఎండల తీవ్రతతో నిర్మానుష్యంగా మారిన తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ పరిసరాలు

నిప్పుల కొలిమిలా తెలంగాణ

తీవ్రస్థాయికి చేరిన గరిష్ట ఉష్ణోగ్రతలు 

పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత

25 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

వడదెబ్బతో తొమ్మిది మంది మృతి 

సాక్షి, హైదరాబాద్‌: అత్యధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తీవ్ర స్థాయికి చేరి..నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా మండిపోతున్నాయి. గురువారం అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చుంచుపల్లి, కమలాపూర్, ధర్మపురి, మహదేవ్‌పూర్, గంగధార, కల్లూరు, ఆసిఫాబాద్, మందమర్రి, వెంకటాపూర్, కట్టంగూరు, వేములవాడ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 46.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరో 10 ప్రాంతాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  

చురుగ్గా నైరుతి... 
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులు తున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలు, కొమరిన్‌ ప్రాంతం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రంలోని మిగిలిన భాగాలు మరియు తూర్పు–మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ నెల 26న కేరళను తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.  

భగ్గుమన్న ఉమ్మడి ఖమ్మం  
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సూర్యుడు పంజా విసిరాడు. రికార్డుస్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఖమ్మం జిల్లాలోని 42 వెదర్‌ స్టేషన్లలో 45 డిగ్రీలకుపైగా రెడ్‌ అలర్ట్‌ స్థాయిలో నమోదయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 19 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది.  
– ఖమ్మం జిల్లాలోని కల్లూరు, సత్తుపల్లిలోని జేవీఆర్‌ ఓసీ, వైరా, భద్రాద్రి జిల్లాలోని చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్, పాల్వంచ మండలం యానంబైల్‌లో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  
– ఏన్కూరు మండలం తిమ్మారావుపేట, మధిర, కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, బోనకల్‌ మండలం రావినూతల, మధిర మండలం సిరిపురం గ్రామాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  
– సత్తుపల్లి, ముదిగొండ, ఖమ్మం అర్బన్‌ ప్రకాశ్‌నగర్, ఎర్రుపాలెం, ఖమ్మం అర్బన్‌ ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్‌ ప్రాంతాల్లో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది.  

కంటెయినర్‌లో మంటలు....8 కొత్త కార్లు దహనం  
తూప్రాన్‌: కంటెయినర్‌లో మంటలు చెలరేగి అందులో ఉన్న 8 కొత్త కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. నాగపూర్‌ నుంచి కాకినాడకు మారుతి సుజుకి కంపెనీకీ చెందిన ఎనిమిది కొత్త కార్లతో కంటెయిన్‌ వెళుతోంది. తూప్రాన్‌ సమీపంలోని నాగులపల్లి చౌరస్తా సమీపంలోకి కంటెయినర్‌ చేరుకోగా, ఇంజిన్‌లో నుంచి పొగలు రావడం డ్రైవర్‌ నజీం గమనించాడు. వెంటనే అప్రమత్తమై కంటెయినర్‌ను రహదారి పక్కకకు ఆగి కిందకు దిగాడు. ఈ క్రమంలోనే లారీ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో ప్రమాద రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ కాగా, వాహనాలను దారి మళ్లించారు. అయితే ప్రమాదానికి అధిక ఉష్ణోగ్రతే కారణమని భావిస్తున్నారు.  


హార్వెస్టర్‌ దగ్ధం 
ముధోల్‌: నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలం తరోడా సమీపాన రోడ్డుపై హార్వెస్టర్‌ కాలిపోయింది. ఎండవేడికి బ్యాటరీలోని వైరింగ్‌ ఒక్కసారిగా కాలి మంటలు హార్వెస్టర్‌ మొత్తం వ్యాపించాయి. దీంతో హార్వెస్టర్‌ పూర్తిగా కాలి బూడిదయింది.  

రోడ్డుపై అమ్లెట్‌  
నర్సంపేట : వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గురువారం నర్సంపేట–వరంగల్‌ ప్రధాన రహదారిపై స్థానికుడు ఎస్‌కె.రఫీసాఫ్‌ ఆమ్లెట్‌ వేశాడు.  


వడదెబ్బతో 8 మంది మృతి  
– మృతుల్లో ఇంటర్‌ విద్యార్థి  
సాక్షి నెట్‌వర్క్‌: వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 8మంది మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన కౌలురైతు పొన్నాల భరత్‌ (34), మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వలకు చెందిన గాదె కొమురమ్మ(90), బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన కేస లచ్చమ్మ(90), నెల్లికుదురు మండలం హనుమాన్‌ నగర్‌తండాకు గుగులోత్‌ అమృత (54), కురవి మండలం రాజోలుకు చెందిన నల్ల లింగయ్య(70), ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మాదరి లక్షి్మ(85), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్‌ గ్రామానికి చెందిన నాంపల్లి సక్కమ్మ(58) చనిపోయారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన బొమ్మిడి వెంకటేశ్‌(17) నడిగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇటీవల ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పూర్తి చేశారు. వేసవి సెలవులు కావడంతో గ్రామంలోని టెంట్‌ హౌస్‌లో పనికెళ్తున్నాడు. వడదెబ్బకు గురై చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement