ఆరోగ్యానికి 'సెగ'! | Maximum temperatures likely to reach 48 in the coming days | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి 'సెగ'!

Apr 16 2026 5:56 AM | Updated on Apr 16 2026 5:56 AM

Maximum temperatures likely to reach 48 in the coming days

అనూహ్యంగా మారిన వాతావరణం 

ఇప్పటికే 42–43 గరిష్ట ఉష్ణోగ్రతలు.. 

రానున్న రోజుల్లో 48 గరిష్ట ఉష్ణోగ్రతలకు చేరే అవకాశం

పొంచిఉన్న వడ‘దెబ్బ’.. ఆరోగ్యంపై పెను ప్రభావం

ఎండ ఎరుపు రంగు పూసుకుంది.. ఉదయం ఏడింటికే సుర్రుమంటోంది.. సాయంత్రం చీకటిపడేదాకా తాపం తగ్గేది లేదంటోంది.. ఇంకేముంది భానుడి సెగ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. మండుటెండల కారణంగా వడ‘దెబ్బ’ పొంచి ఉంది. ఇప్పటికే వడదెబ్బలు నమోదవుతున్నాయి.. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

కడప రూరల్‌: సూర్యుడు ‘చుర్రు’మంటున్నాడు.. మాడు పగిలేలా భగభగమంటున్నాడు. ఇటీవల కాలంలో వాతావ‘రణం’ రణరంగంగా మారింది. దీంతో ప్రజల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటోంది.  ఇప్పటికే 42–43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నరోజుల్లో 48 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావర ణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా..ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. 

జాగ్రత్తలతోనే అడ్డుకట్ట... 
ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం (హైపో «థలామన్‌) దెబ్బతింటుంది. ఫలితంగా సదరు వ్యక్తి వడదెబ్బకు గురవుతాడు. దీనినే ‘హీట్‌ స్ట్రోక్‌’ లేదా ‘సన్‌ స్ట్రోక్‌’ అంటారు. ఈ దశ ప్రమాదకరం, ప్రాణాంతకం. 

లక్షణాలు..కారణాలు.. 
» చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం 
» వణుకు పుట్టడం. మగత నిద్ర లేదా కలవరింత. 
»ఫిట్స్‌ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి కలగడం. 
» శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం. శరీరం ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది. 

శరీరంలో కలిగే మార్పులు... 
» వేడి వల్ల చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్‌) తగ్గిపోతుంది. లేదా శరీరంలోని నీటి నిష్పత్తి తగ్గుతుంది.  
» ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో  శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు 3–4 లీటర్ల నీటిని చెమట రూపంలో శరీరం కోల్పోతుంది. 

అధికంగా అనారోగ్యానికి గురయ్యేవారు ఎవరంటే.... 
 65 ఏళ్ల వయస్సు పైబడిన వారు. 
 గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు 
» అనారోగ్యంతో బాధపడుతున్న వారు. ఉదాహరణకు అధిక రక్తపోటు, గుండె జబ్బులు కలిగిన తదితరులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

ప్రథమ చికిత్స ఇలా... 
» వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలి. 
» చల్లని నీటితో ముంచిన తడి గుడ్డతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడి గుడ్డతో తుడవాలి. ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలేలా ఉంచాలి. 
» ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన  గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీ హై డ్రేషన్‌) ద్రావణాన్ని తాగించాలి. 
» వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. వీలైనంత త్వరగా వైద్యుడి వద్దకు తీసుకుపోవాలి.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
» తలకు టోపీ, రుమాలు వాడాలి. వేడిగాలి తగలకుండా చూసుకోవాలి. 
» గొడుగు వాడాలి. తెలుపు రంగు, పలచటి చేనేత వస్త్రాలను ధరించాలి. 
» ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పని చేయకుండా ఉండాలి. 
» శీతల పానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
» ఇంటి నుంచి బైటకు వెళ్లే ముందు ఒక గ్లాసు మంచి నీరుతాగాలి. వీలైనన్ని సార్లు మంచి నీటిని తాగడం మంచిది. 
» ఎండలో తిరిగే సమయంలో చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు, చల్లని మంచి నీరు తాగాలి 
» తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తల తిరగిడం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణం వైద్యులను సంప్రదించాలి. 

కిడ్నీలపై డీహైడ్రేషన్‌ ప్రభావం 
వేసవి కాలంలో   డీహైడ్రేషన్‌ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతా యి. ఇన్‌ఫెక్షన్‌లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సీజన్‌లో కిడ్నీలను కాపాడుకోవాలంటే ఒక రోజుకు  3 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు ను తగ్గించాలి.  –డాక్టర్‌  దినేష్‌కుమార్‌రెడ్డి,  మూత్రపిండాల వైద్య నిపుణులు, కడప.   

Advertisement
 
Advertisement
Advertisement