
సాక్షి, హైదరాబాద్: హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో రాత్రి, ఉదయం సమయాల్లో పొగమంచు ఏర్పడే అవకాశముందన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 7 డిగ్రీలకు పడిపోయింది. రామగుండంలో 12, హకీంపేట, హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మహబూబ్‌నగర్‌లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏకంగా 9 డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీలు నమోదైంది. ఏడు డిగ్రీలు తక్కువగా భద్రాచలంలో 25, హన్మకొండలో 24, హైదరాబాద్‌లో 23 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.