రాష్ట్రంలో క్షీణిస్తున్నఉష్ణోగ్రతలు
చాలాచోట్ల సాధారణంకంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు
పెరుగుతున్నచలిగాలుల తీవ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పతనమవుతున్నాయి. చాలాచోట్ల సాధారణం కంటే తక్కువగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణం పొడిగా, ఆకాశం మేఘరహితంగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడంతో చలి తీవ్రమవుతోంది. పగటి పూట కాస్త తగ్గుతున్నప్పటికీ.. సాయంత్రం నుంచి మాత్రం ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుతున్నాయి.
మంగళవారం రాష్ట్రంలో చాలాచోట్ల తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. ప్రధాన పట్టణాలను పరిశీలిస్తే.. భద్రాచలం, నిజామాబాద్‌లో 30.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా..కనిష్టంగా ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అత్యల్పంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
వచ్చే వారం నుంచి మరింత చలి: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వచ్చే వారం నుంచి మరింత క్షీణిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శీతాకాలం ప్రవేశంతో వాతావరణంలో, ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు కనిపిస్తాయి. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడాతేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలుసాధారణ స్థితిలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
మొత్తం మీద వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని, డిసెంబర్ నెలలో చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు సైతంఉంటుందని, వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలని, తెల్లవారుజాము ప్రయాణాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో సూచించింది.


