నటుడు శివాజీ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించాడు. హీరోయిన్ల దుస్తులు, ఆడవాళ్లు, అందం, చీర సాంప్రదాయం అంటూ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మహిళల వేషధారణపై తీవ్ర అభ్యంతరకరమైన పదజాలాన్ని వాడాడు. మాటల్లో చెప్పలేనంతగా నోటి కొచ్చినట్టు రెచ్చిపోయాడు. దీనిపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళను ఒక మనిషిగా చూడలేని శివాజీ, వారి శరీరాలను ‘సామాను’గా అభివర్ణించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, మరో హీరోయిన్ నిధి అగర్వాల్ ,ఇతర సినీ సెలబ్రిటీలపై అభిమానం పేరుతో కొంతమంది ఆకతాయిలు హద్దులు దాటి ప్రవర్తించిన ఘటనపై పరోక్షంగా స్పందిస్తూ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై నటుడు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఒక ఈవెంట్‌కు వచ్చిన నటీమణులపై సభ్యత మరచి సంస్కార హీనంగా ప్రవర్తించిన వారికి బుద్ధి చెప్పాల్సిందిపోయి సెలబ్రిటీల వేషధారణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్దూరంగా నిలిచింది.

తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట
తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్న చందంగా అంటూ శివాజీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. పురుషాధిక్య భావజాలం, ఫ్యూడల్ మనస్తత్వంతో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. అరకొరా సినిమాలతో అల్లాడుతున్న శివాజీ బిగ్‌బాస్ సీజన్-7తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడనీ, అలా అనుకోకుండా అందివచ్చిన ఫేమ్‌తో వాపును చూసి బలుపు అని విర్రవీగుతున్నాడంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో కూడా బూతుల పురాణంతో రెచ్చిపోయిన వైనాన్ని, హోస్ట్ నాగార్జున (Nagarjuna) గడ్డి పెట్టిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. బహిరంగ వేదికల మీద మహిళలపై హద్దూ పద్దు లేకుండా నోటికి ఎంత వస్తే మాట్లాడటం, పైగా ఎవరేమనుకున్నా పర్వాలేదు అంటూ తెగింపు ప్రదర్శిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గొంగట్లో తింటూ
సినిమాలో ఎక్స్పోజింగ్ చేయలేదా, వెర్రిమొర్రి డ్యాన్స్‌లు చేయలేదా, సినిమాలు లేక వాడి వీడి కాళ్లు పట్టుకుని నాలుగు అవకాశాలు రాగానే ఇలా నీతి సూక్తులు చెప్తున్నాడని మరి కొంతమంది మండి పడు తున్నారు. అసలు సంప్రదాయాల్ని, మహిళల గౌరవాన్ని మంటగలింపిందే సినిమాలు కదా అని గుర్తు చేస్తున్నారు. ఏమి అందంగా కనిపించారని అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలపై, వృద్ధ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, బహిరంగ వేదికలపై ఇలాంటి చెత్తను, మగ దురహంకారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా భవిష్యత్తరాలకు ఏం సందేశమిస్తున్నావంటూ నిలదీస్తున్నారు.
నీతి సూత్రాలు నీకు తగవు బాసూ
అంతేకాదు ఎంతోమంది మహిళా నటులను వేధించిందీ, అవకాశాల కోసం వారిని లైంగికంగా వేధించిన నీ చరిత్ర మర్చిపోయావా దొరా? ఇపుడు నీతి సూక్తులు వల్లిస్తున్నావు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మహిళలు వస్త్రాధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివాజీపై ఇప్పటికే గాయని చిన్మయి, నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.


