వారిదే ఫెవికాల్,ఫెవిక్విక్‌ బంధం | BJP Ramchander Rao Released Municipal Election Manifesto: Ramchander Rao comments on KCR and Revanth Reddy | Sakshi
Sakshi News home page

వారిదే ఫెవికాల్,ఫెవిక్విక్‌ బంధం

Feb 7 2026 5:16 AM | Updated on Feb 7 2026 5:16 AM

BJP Ramchander Rao Released Municipal Election Manifesto: Ramchander Rao comments on KCR and Revanth Reddy

ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్న రాంచందర్‌రావు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య బంధం నేటికీ కొనసాగుతోంది... నాడు ‘ఓటుకు కోట్లు’ కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్‌ కాపాడారు 

నేడు కాళేశ్వరం అవినీతి విషయంలో కేసీఆర్‌ను రేవంత్‌ కాపాడుతున్నారని విమర్శ 

బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన రాంచందర్‌రావు  

సాక్షి.హైదరాబాద్‌: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య ఫెవికాల్, ఫెవిక్విక్‌ బంధం ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైందని, నేటికీ కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. గతంలో ‘ఓటుకు కోట్లు’కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్‌ కాపాడితే, నేడు కాళేశ్వరం అవినీతి విషయంలో కేసీఆర్‌ను రేవంత్‌ కాపాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్‌లు కూలినపుడు కేవలం  వాటి పైనే జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ను వేసి రేవంత్‌ చేతులు దులుపుకున్నారని, అయితే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తోందని చెప్పారు.

శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల సహ ఇన్‌చార్జిలు అశోక్‌ పర్మాణి, రేఖాశర్మ, మాజీ ఎంపీ పి.రాములు, పార్టీ నేతలు డా.ఎన్‌.గౌతమ్‌రావు, ఎన్వీ సుభాషలతో కలిసి.. ‘వికసిత్‌ తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం’పేరిట మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు విడుదల చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచార గీతాన్ని కూడా వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. 

కమీషన్ల సర్కార్‌ నడిపిస్తున్నారు.. 
    ‘ఈ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందనే పూర్తి నమ్మకం ఉంది. బీజేపీ విజయం తథ్యమని తెలుసుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని సీఎం రేవంత్‌ అంటున్నారు. జిల్లాల వారీగా ఎంతెంత ఇచ్చామో చిట్టా మా వద్ద ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో ఏ జిల్లాకు ఎంత నిధులు ఇచ్చారో రేవంత్‌ చెప్పగలరా? ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటూ కమీషన్‌ సర్కార్‌ నడిపిస్తున్నారు..’అని రాంచందర్‌రావు విమర్శించారు.  

కేంద్రంలో మా సర్కార్‌ ఉందని మరిచిపోవద్దు 
    ‘మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు అనవసర కేసులు, దాడులు, బెదిరింపుల వంటి అరాచకాలకు పాల్పడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉందని పోలీసులు మరిచిపోవద్దు. జాతీయ మానవహక్కుల కమిషన్‌ వద్దకు లాక్కెళ్లి నిలబెడతాం. శనివారం మంచిర్యాలలో ఎన్నికల ప్రచారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వస్తుంటే.. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులను కొట్టి, బెదిరించి ఉపసంహరింపజేసిన ఉదంతాలను సీరియస్‌గా తీసుకుంటాం. కర్ణాటకలో మాదిరిగా హేట్‌స్పీచ్‌ యాక్ట్‌ (విద్వేషపూరిత వ్యాఖ్యల చట్టాన్ని)ను బీజేపీ కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ తెలంగాణలోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చట్టాన్ని తీసుకొస్తే ముందుగా సీఎం రేవంత్‌రెడ్డిపై మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టినందుకు కేసులు పెట్టాల్సి వస్తుంది..’అని రాంచందర్‌రావు అన్నారు. 

బీజేపీ ప్రధాన హామీలివే.. 
⇒  మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదు 
⇒  ఆన్‌లైన్, సింగిల్‌ విండో సిస్టం ద్వారా వారం రోజుల్లో ఇంటి అనుమతులు 
⇒ ప్రతి వార్డు/డివిజన్‌లో బస్తీ దవాఖానాల బలోపేతానికి కృషి, చౌక ధరల్లో మందులు 
⇒ అర్హత కలిగిన మున్సిపాలిటీలు/కార్పొరేషన్లను స్మార్ట్‌ సిటీలుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పిస్తాం  
⇒ మున్సిపాలిటీ/కార్పొరేషన్లను గ్రీన్‌ టౌన్‌/క్లీన్‌ సిటీలుగా తీర్చిదిద్దుతాం 
⇒ అన్ని చోట్లా 100% భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ.. షీ టీమ్స్‌ వ్యవస్థ బలోపేతం 
⇒ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు, క్రమం తప్పకుండా జాబ్‌ మేళాలు 
⇒ ఏఐ సాంకేతికత సహకారంతో అవినీతి రహితంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 
⇒ 100% ఇంటింటి చెత్త సేకరణ, సమర్థవంతంగా వ్యర్థాల నిర్వహణతో చెత్త రహిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement