ఆది శ్రీనివాస్ రాసిచ్చిన బాండ్ పేపర్‌ను చూపిస్తున్న కేటీఆర్
కారుకు ఓటేసి కేసీఆర్‌ను సీఎం చేసే ప్రస్థానం ప్రారంభించండి
సిరిసిల్ల, వేములవాడ ప్రచార సభల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో స్కామ్‌లే తప్ప.. కొత్త స్కీమ్‌లు లేవని.. ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ దొంగమాటలతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి పదవి ఎక్కిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో అమలు చేస్తానని హామీలతో రాసిచ్చిన బాండ్‌పేపర్‌ను ప్రజలకు కేటీఆర్ చూపించారు. తనకు ఓటు వేయకుంటే చనిపోతానని, నాలుగుసార్లు ఓడిపోయానని చెప్పి సానుభూతి డైలాగులతో మభ్యపెట్టిన ఆది శ్రీనివాస్ ఆ తర్వాత హామీల అమలు నుంచి అభివృద్ధి వరకు అడ్రస్ లేకుండా పారిపోయాడన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మోసాలకు మద్దతిచ్చినట్టే...
ఒకవేళ ఇన్ని రకాల మోసాల తర్వాత, ద్రోహాల తర్వాత కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు మేము చేస్తున్నదే సరైందని, ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని కేటీఆర్ చెప్పారు. హామీల అమలుపై భవిష్యత్‌లోనూ దృష్టి పెట్టే అవకాశమే ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్ చెప్పిన హామీలు రూ.4 వేల పెన్షన్ నుంచి మొదలుకొని రైతు భరోసా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , తులం బంగారం రావాలన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు.
దేవుడి పేరు చెప్పి ఓట్లు
పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేసిందేమీ లేదని కేటీఆర్ చెప్పారు. రూ.15 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పిన మోదీ ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టారని విమర్శించారు. ప్రతీసారి ఎన్నికలు రాగానే దేవుడి పేరు చెప్పి కులం, మతం పేరు చెప్పి బీజేపీ ఓట్లు వేయించుకుంటుందన్నారు. ఈసారి కూడా బీజేపీ దొంగమాటలకు మోసపోవద్దని కోరారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వేసే ఓటుతో మరోసారి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునే ప్రస్థానం ప్రారంభం కావాలన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో జరిగిన ప్రచార సభల్లో బీఆర్‌ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, కొండూరి రవీందర్‌రావు, తోట ఆగయ్య, తుల ఉమ, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి పాల్గొన్నారు.


