రాధాకృష్ణకి మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యానించే అర్హత ముమ్మాటికీ లేదు- కొండవీటి సత్యవతి
నటుడు శివాజీ కారుకూతల పైత్యం పెద్ద దుమారాన్నే రాజేసింది. ప్రత్యక్షంగా హీరోయిన్లపైనా, పరోక్షంగా మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన శివాజీపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అలాగే శివాజీకి అనూహ్యంగా మద్దతు కూడా లభించింది. ఈ దుమారం ఇలా కొనసాగుతుండగానే, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో రాసిన వ్యాసం కొత్త దుమారాన్ని రాజేసింది. ఇలాంటి వివాదాల పట్ల మీడియా బాధ్యతను, వ్యవహరించాల్సిన తీరును గుర్తు చేసింది.
భూమిక ఫౌండర్, రచయిత్రి, సామాజికవేత్త కొండవీటి సత్యవతి ఈ ఆర్టికల్‌పై తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది కొత్త పలుకు కాదు. మహిళల పరంగా చెత్త పలుకు. శివాజీని వెనకేసుకొచ్చిన ఈ పెద్దమనిషి గతంలో సినీనటుడు చలపతిరావుతో 'మీకు నిజంగా రేప్ చేయ్యాలనిపించలేదా?.. అని అసహ్యంగా అడిగినపుడు నేను డైరెక్ట్‌గా అతనికే ఫోన్ చేసి నిలదీసినపుడు మర్నాడు ఆంధ్రజ్యోతిలోనే సారీ చెప్పారు. అయినా ఇలాంటి వాళ్ళు మారతారని నేను అనుకోను. శివాజీకి కానీ, రాధాకృష్ణకి కానీ మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యానించే అర్హత ముమ్మాటికీ లేదు. మీ వ్యవహారాలు మీరు చక్కబెట్టుకోండి. మాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి సాహసించకండి. మీకా అర్హత లేదు. మీ వ్యాఖ్యలు చుట్టవిరుద్ధమే కాదు రాజ్యాంగ విరుద్ధం’’ అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో మండిపడ్డారు.
అలాగే సీనియర్ జర్నలిస్టు కృష్ణజ్యోతి కూడా సోషల్‌మీడియాలో దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విక్టిమ్ బ్లేమింగ్, entitlement, మేల్ ప్రివిలేజ్, మేల్ dominance, control, body & gender politics ఈ ఆర్టికల్ అద్దంపడుతోందన్నారు. మీడియాతో సహా మహిళల విషయాల పట్ల అందరికీ కొంతైనా జెండర్ sensitisation ఉండడం చాలా ముఖ్యమని.. కానీ ఇందులో ఆ స్పృహ, ఆలోచన, ఆసక్తి, కించిత్ బాధ్యత లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే సిద్ధార్థ సుభాష్ చంద్రబోస్ ఈ వ్యాసంపై స్పందిస్తూ స్త్రీలు ఎటువంటి దుస్తులు వేసుకోవాలో తెలియజేస్తూ ఒక పత్రిక సంపాదకీయం రాయడం దారుణం అని వ్యాఖ్యానించారు. ‘‘స్త్రీలు మన కొలతల ప్రకారం శరీరం చూపే జంతువులు కాదు. వాళ్ల సౌకర్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ల దుస్తులు వాళ్లు ఎంపిక చేసుకునే హక్కుని అంగీకరించాలి. చూడలేకపోతే కళ్ళు మూసుకుని పక్కకు తప్పుకోవాలి, లేకపోతే గుహల్లో బ్రతకాలి. ఒక స్త్రీని దుస్తులని చూసి దాడి చేయాలనుకోవడం మగవాడి బలహీనతకు చిహ్నమే గాక, అది అతడు నాగరికంగా ఎదగలేకపోయిన వెనకబాటుని చూపిస్తుందనీ, రాజ్యాంగం సూచించిన స్వేచ్చా, సమానత్వాన్ని అంగీకరించని చట్టవిరుద్దమైన విషయమనీ, అలా గాకుండా ఇక్కడ ఏకంగా చేతులేస్తాం, రేపులు చేస్తామనడం తిరోగమనతత్వమని హితవు చెప్పి వుంటే అది "కొత్తపలుకు" అనే పదానికి అర్థవంతంగా వుండేది.. అంటూ బాగానే వాతలు పెట్టడం గమనార్హం.
రాధాకృష్ణ వ్యాసంలో ఏముంది?
డ్రెస్ కోడ్‌లతో మొదలైన అహంకారం, నిండు సభలో ఒక మహిళ చీర లాగినందుకు మహాభారత సంగ్రామం జరిగింది. అది ద్వాపర యుగం. కలియుగంలో మహిళలు జన సమూహంలోకి వెళ్లినప్పుడు చీర కట్టుకుంటే మంచిది అన్నందుకు మాటల యుద్ధం జరుగుతోందన్న సోషల్ మీడియా.. పలువురు వాడిన కాపీ డైలాగ్స్‌తో ఈ వ్యాసం సాగుతుంది.
అభినవ కందుకూరి వీరేశలింగం అంటూ
అంతేకాదు స్త్రీ జనోద్ధారకుడు, గొప్ప రచయిత కందుకూరి వీరేశలింగాన్ని కూడా అవమానపరుస్తూ, అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్లు కొద్దిమంది మహిళల తరఫున వత్తాసు పలుకుతున్నారంటూ తన కుంచిత బుద్ధని ప్రకటించుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తన అజ్ఞానాన్ని, అహంకారాన్ని ప్రదర్శించకున్నాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.
ఆకతాయిలను రెచ్చగొడుతున్న వైనం
‘‘చిట్టి పొట్టి దుస్తులతో ఒక మహిళా ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్లడాన్ని ఊహించగలమా? వెళ్లకూడదా? అని గద్దిస్తే ఏం చెబుతాం? వెళ్లవచ్చు. కాకపోతే పర్యవసానాలకు కూడా సిద్ధం కావాలి. జరగరాని పరాభవం జరిగితే చింతించకూడదు’’ అంటూ పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలను ఏం చేసేనా పరవాలేదనే పైత్యాన్ని నూరిపోస్తున్న ఒక మీడియా సంస్థ అధిపతి వైఖరి విమర్శలకు తావిస్తోంది.
ఎవరి వల్ల ఎవరికి కష్టం? ఎవరిని శిక్షించాలి?
‘‘వస్త్రధారణ విషయంలో స్వేచ్ఛ అంటే అది కష్టాలు తెచ్చి పెట్టేదిగా ఉండకూడదు. తిండి, బట్ట విషయంలో స్వేచ్ఛ అనేది మనకు మేలు మాత్రమే చేయాలి. ఈ రెండు విషయాలలో నియమ నిబంధనలు పెట్టుకోవడం మనకే మంచిది!’’ అంటూ పెద్ద ముక్తాయింపు ఒకటి.
ఇక్కడ ఎవరి వల్ల ఎవరికి కష్టం. దుస్తుల పేరుతో మహిళలపై, సెలబ్రిటీలపై ఆంబోతులపై ఎగబడుతున్నది ఎవరు అని ప్రశ్నించారు నెటిజన్లు. మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ప్రస్తుతం శివాజీ పరిస్థితి తయారైంది అంటూ శివాజీకి మద్దతు పలకడాన్ని మహిళలు తీవ్రంగా ఖండించారు.
అసందర్భ ప్రేలాపన
మోరల్ పోలీసింగ్ అంటే అర్థం తెలియని వాగాడంబరం ఎలా ఉందంటే ‘‘జంక్ ఫుడ్ తింటే ఊబకాయం వస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధ పడతారు’ అని వైద్యులు చెబుతారు కదా! జంక్ ఫుడ్ తినవద్దని చెప్పడానికి మీరెవరు? అని ప్రశ్నించడం ఎంత అహేతుకంగా ఉంటుందో దుస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించడాన్ని తప్పుపట్టడం కూడా అంతే అహేతుకం. జాగ్రత్తగా ఉండాలనడం మోరల్ పోలీసింగ్ అవుతుందని విమర్శించడం ఏమిటి?’’ అంటూ రాసుకు రావడం విడ్డూరంగా నిలిచింది.
అల్లు అర్జున్‌పై దాడి గురించి ఏమంటారో?
హైదరాబాద్‌లో హైటెక్ సిటీలోని ప్రసిద్ధ నిలోఫర్ కేఫ్‌కు టీ కోసం వెళ్లిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి రాధాకృష్ణ ఏమంటారు? సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా రెచ్చిపోతున్న యువకులను సమర్ధిస్తారా?. సెల్ఫీల కోసం ఎగబడి ఒక ఆడకూతుర్ని ఇబ్బంది పెట్టిన వైనంపై ఏమంటారో?. ఏ దుస్తులు వారిని అలా ప్రొవోక్ చేశాయి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘వస్త్రధారణ స్వేచ్ఛే.. మహిళా సాధికారతా?’’ పేరుతో మగ దురహంకారంతో రాసిన రాతలు తప్ప మరొకటి కాదని రాధాకృష్ణ ఆర్టికల్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల వస్త్రధారణపై చర్చ అంటూ అవాస్తవాలు, అవాకులు చెవాకులతో, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా ప్రచురించిన ఈ వ్యాసంపై రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.


