చేవెళ్ల: ఇన్‌స్టాలో పరిచయమైన ప్రియుడి మోజులో పడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా నిందితులైన మృతుడి భార్య, ఆమె ప్రియుడిని జైలుకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడెం కృష్ణ(35) జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి చంద్రారెడ్డినగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
ఇదిలా ఉండగా, చేవెళ్ల మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన శరత్ అనే వ్యక్తి చేవెళ్లలోని గణేశ్‌నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం రాజేశ్వరితో ఇతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఇతని మోజులో పడిన రాజేశ్వరి భర్తతో తరచూ గొడవ పడుతోంది. ఇదే అదనుగా భావించిన శరత్ నీ భర్తను అడ్డు తొలగించుకో, నిన్ను బాగా చూసుకుంటా అని నమ్మించాడు. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచి్చన భర్తతో రాజేశ్వరి గొడవ పడింది. అతను నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. గాఢ నిద్రలో ఉన్న కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. అతడు చనిపోయిన తర్వాత, తెల్లవారుజాము వరకూ ఇంట్లోనే ఉన్న ప్రియుడు ఆతర్వాత జారుకున్నాడు.
శుక్రవారం ఉదయం ఏమీ తెలియనట్లు తన భర్త నిద్ర లేవడం లేదంటూ, ఆటోను పిలిపించి పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని చెప్పడంతో, బాడీని ఇంటికి తీసుకెళ్లి బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. తన కొడుకు మృతికి కోడలే కారణమని కృష్ణ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ భూపాల్‌శ్రీధర్, డీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని, ఆమె ఫోన్ నంబర్ల ఆధారంగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడు శరత్‌తో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించింది. ఇరువురినీ కోర్టులో హాజరుపర్చిన అనంతరం శనివారం రిమాండ్‌కు తరలించారు.



