రైతు భరోసా ఏదీ? | telangana farmers waiting For rythu bharosa | Sakshi
Sakshi News home page

రైతు భరోసా ఏదీ?

Feb 22 2026 1:10 PM | Updated on Feb 22 2026 1:10 PM

telangana farmers waiting For rythu bharosa

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, రైతులకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించారు. సాధారణంగా వానాకాలం, యాసంగి సీజన్‌లకు అనుగుణంగా సాయం విడుదల చేయాలి. కానీ అమలులో ఉన్న సమస్యలు, ఆలస్యాలు, స్పష్టతలేమి కారణంగా ఈ పథకం రైతులకు నిజంగా భరోసా ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గత యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా సాయం పూర్తిగా విడుదల కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేఏడాది వానాకాలం సీజన్‌లో రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పెద్ద భూస్వాములు మాత్రమే కాదు, 5–6 ఎకరాల చిన్న, మధ్య తరహా రైతులు కూడా నష్టపోయారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసి వెంటనే రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం రైతుల్లో అసంతృప్తి పెంచుతోంది.

● రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. రెండు సీజన్‌లకు విడివిడిగా సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరానికి మొత్తం రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. రెండు సీజన్‌లకు కాకుండా, ఒక్క సీజన్‌కు రూ.6 వేల చొప్పున మాత్రమే జమ అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మేనిఫెస్టోలో చెప్పిన హామీ అమలు కాలేదనే అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది.

● పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం మరోసారి చర్చనీయాంశమైంది. 2025 వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2,54,059 మంది రైతులకు రూ. 255.48 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో బ్యాంకు ఖాతాలు అనుసంధానం ఉన్న మొత్తం 2,14,929 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.240 కోట్లు జమ అయ్యాయి. అయితే అదేవిధంగా యాసంగి సీజన్‌కు కూడా సాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది.

● ప్రస్తుతం యాసంగి సీజన్‌ ప్రారంభమై పంటలు విత్తే సమయం దాటుతున్నా రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కాలేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరిగిన ఈ సమయంలో ప్రభుత్వం ఉంచి రావాల్సిన సాయం ఆలస్యమవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

● ఇప్పటికే పాత రుణాలు ఉన్న రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయడంలో వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులు ఆలస్యం రావడం మరింత ఆర్థిక ఒత్తిడిని తెచ్చిపెడుతోంది. కొంతమంది రైతులు అధిక వడ్డీతో ప్రైవేట్‌ అప్పులు తీసుకుని సాగు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement