సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే.. | Battle for an Affordable Home in Hyderabad House Construction Tips | Sakshi
Sakshi News home page

సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..

Feb 22 2026 10:52 AM | Updated on Feb 22 2026 11:20 AM

Battle for an Affordable Home in Hyderabad House Construction Tips

ఓ సామాన్యుడు నగరంలో సొంతిల్లు కొనుక్కోవాలనే ఆశకు రోజురోజుకూ దూరమవుతున్నాడు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలు ఆలోచనను వెనక్కి నెడుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు, నిర్మాణ అనుమతుల జాప్యం, పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, నైపుణ్య కార్మికుల కొరత.. వంటి రకరకాల కారణాలతో తక్కువ ఆదాయం కలిగిన వారికి, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు గృహాల నిర్మాణం కష్టంగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం పన్నులు, రుసుములను తగ్గించి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సరసమైన గృహాల నిర్మాణానికి చేయూత అందిస్తే.. సామాన్యుడి సొంతింటి కల నెరవేరుతుందని 
నిర్మాణ సంఘాలు సూచిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో

  • మార్కెట్‌లో సరసమైన ఇళ్ల లభ్యత మున్ముందు మరింత తగ్గిపోనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో పెరిగిన ఇళ్ల ధరల తీరు చూస్తే ఇదే స్పష్టమవుతోంది. సొంతిల్లు కొనగలమా లేదా? అని సామాన్య మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  

  • అన్ని వర్గాలకు నగర మార్కెట్‌లో గృహాలు అందుబాటులో ఉన్నాయని, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవచ్చని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. బడ్జెట్‌ ప్రధానం అనుకున్నప్పుడు విస్తీర్ణం పరంగా కొంత రాజీపడితే సరసమైన ఇళ్లు దొరుకుతాయని నిర్మాణదారులు సూచిస్తున్నారు.

  • సొంతింటి కోసం సాయం అందుకోలేని దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని నిర్మాణ రంగ సంఘాలు కోరుతున్నాయి.  

భూమి ధరలు పెరగడంతో.. 
పట్టణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం ఇల్లు కట్టిస్తోంది. సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తోంది. శ్రీమంతులు విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ సాయం అందక సొంతంగా కట్టుకోలేక సతమతమవుతున్నారు. ఈ సమస్యను గురించి అప్పట్లో నేషనల్‌ అర్బన్‌ హౌసింగ్‌ హ్యాబిటేట్‌ పాలసీ(ఎన్‌యూహెచ్‌హెచ్‌పీ) తీసుకొచ్చింది. వీరి కోసం కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో 10 నుంచి 15 శాతం భూమిని, 20–20 శాతం ఫ్లోర్‌ ఏరియా రేషియో(ఎఫ్‌ఏఆర్‌)ను రిజర్వ్‌ చేసేవారు.

ఆ రకంగా ప్రైవేటు డెవలపర్లు సరసమైన గృహాలను నిర్దేశిత శాతం మేరకు నిర్మించేవారు. ప్రభుత్వం బిల్డర్లకు తక్కువ ధరలో భూమి ఇస్తే అక్కడ నిర్మాణాలు చేపట్టి తక్కువ ధరకు ఇల్లు అందించేవారు. కొత్తపేటలో నిర్మించిన హుడా కాలనీ ఇందుకు నిదర్శనం. హెచ్‌ఎండీఏ లే అవుట్లలోనూ ఎల్‌ఐజీ పేరుతో తక్కువ విస్తీర్ణంలో 60 గజాల్లో దొరికే స్థలాలు ఉండేవి. ఈ నిబంధన తొలగించడంతో 150 నుంచి 160 గజాల కంటే తక్కువ దొరకడం లేదు. దీంతో స్థలాలు కొని ఇల్లు కట్టుకుందామంటే ఖరీదుగా మారాయి.

అదనపు వసూళ్లతో మరింత భారం.. 
ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతంలో చూసినా చదరపు అడుగు ధర సగటున రూ.6 వేలకు పైగానే పలుకుతోంది. ఈ ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. రూ.4 వేలకు చ.అ. విక్రయిస్తున్న ప్రాంతాలు ఉన్నా దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో, మెరుగైన మౌలిక సదుపాయలు ఉన్నచోట రూ.80 లక్షలు లేనిదే ఇల్లు రావడం లేదు. ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి రూ.కోటి పెట్టాల్సిందే. ఐటీ కారిడార్‌లో ఏకంగా రూ.కోట్ల పైమాటే.. అదనపు వసూళ్లతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఒక్కోటి కొత్తగా వచ్చి చేరుతున్నాయి. గతంలో కారు పార్కింగ్‌ ఒక్కదానికే ఛార్జ్‌ చేసేచారు. ఇప్పుడు ఇన్‌ఫ్రా, క్లబ్‌హౌస్‌ చార్జీలు, గ్యాస్‌ పైపులైన్‌ కనెన్షన్‌కు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవి సామాన్య వర్గాలకు భారంగా మారుతున్నాయి.  

తక్కువ విస్తీర్ణం కారణంగా.. 
కొన్ని కొత్త నిర్మాణాల్లో వీటి కోసమే రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇవి కాకుండా జీఎస్టీ, రిజి్రస్టేషన్, స్టాంప్‌ డ్యూటీ తలకు మించిన భారంగా సామాన్య, ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కొందరు బిల్డర్లు సరసమైన ధరల ఇళ్లు నిర్మిస్తున్నారు. 800–1,000 చ.అ. విస్తీర్ణంలో రెండు పడక గదుల ఫ్లాట్లు, 350 చ.అ. విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్‌మెంట్లనూ కడుతున్నారు. ఇవన్నీ సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారుల నుంచి తక్కువ విస్తీర్ణం కారణంగా ఆశించిన మేర స్పందన లేదని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశానికి దూరమని, ఇప్పటికిప్పుడు అక్కడ ఉండలేమని కూడా కొందరు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement