ప్రజల ఆస్తులపై రేవంత్‌ కన్నుపడింది: హరీష్‌రావు | Harish Rao Fires On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

ప్రజల ఆస్తులపై రేవంత్‌ కన్నుపడింది: హరీష్‌రావు

Feb 22 2026 11:18 AM | Updated on Feb 22 2026 11:47 AM

Harish Rao Fires On CM Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: మూసీ బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారం ఆయన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ వల్ల నష్టపోతున్న బాపు ఘాట్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులపై  రేవంత్‌  కన్నుపడిందని మండిపడ్డారు. మూసీ పేరిట కాంగ్రెస్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందంటూ దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణను బీఆర్‌ఎస్‌ వ్యతిరేకించడం లేదని హరీష్‌రావు అన్నారు.

‘‘కేసీఆర్‌కు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌ వార్ రూమ్ నుండే బీఆర్‌ఎస్ విజనరీ డాక్యుమెంట్‌ను తయారు చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌కు కేసీఆర్ మూడుసార్లు వచ్చారు. మంచి నీరు లేవని.. అపార్ట్‌మెంట్‌ వాసులు కేసీఆర్‌ను కలిస్తే.. కేసీఆర్ వెంటనే మంచి నీటి సదుపాయాన్ని ప్రత్యేక పైప్లైన్ ద్వారా నీరు అందించారు. అపార్ట్‌మెంట్‌ వాసులను కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నాడు. మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చొదు.. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దు.

..రేవంత్ ఏది చేసిన రియల్ వ్యాపారం కోసమే.. మూసీ పేరుతో భూములు లాక్కొని బడా వ్యాపారులకు ఈ భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టలేదు కానీ పేదల ఇండ్లు కూల్చేస్తున్నారు. డబ్బులు లేవంటూనే ప్రపంచ సుందరి పోటీలు పెట్టారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి మూసి సుందరీకరణ చేస్తున్నారు. వీరి బతుకులను కూల్చకండి.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ వాసులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోండి’’ అంటూ హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement