మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ | Maoist Leader Devji Surrendered | Sakshi
Sakshi News home page

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ

Feb 22 2026 10:29 AM | Updated on Feb 22 2026 10:51 AM

Maoist Leader Devji Surrendered

సాక్షి, ఆసిఫాబాద్‌: మావోయి‍స్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌, నర్సింహారెడ్డి అలియాస్‌ గంగన్న.. ఆదివారం లొంగిపోయారు. వీరితో సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్‌ఐబీ ఎదుట సరెండర్‌ అయినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కాగా, కర్రెగుట్టలో ఆపరేషన్‌ కగార్‌ కారణంగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా మావోయిస్టులు జనజీవన సవ్రంతిలోకి వస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోగా.. తాజాగా మరో ముగ్గురు సీనియర్లు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నర్సింహారెడ్డి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.  ఆసిఫాబాద్‌ జిల్లాలో వీరు ఆయుధాలు వదిలి లొంగిపోయారు. 

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ ప్రస్తతం.. కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ తర్వాత సెక్రటరీగా దేవ్‌జీ సారథ్యం వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లా రాజిరెడ్డి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక, వీరి లొంగుబాటుతో మావోయిస్టులకు కోలుకులోని దెబ్బ తగిలినట్టు అయ్యింది. 

మధ్యవర్తులెవరు? 
మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సంగ్రామ్‌లకు, ఎస్‌ఐబీ స్పెషల్‌ టీంకు మధ్యవర్తులుగా తెలంగాణలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్, కొంతమంది పౌరహక్కుల నేతలు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వీరితో రాష్ట్రానికి చెందిన ఓ కీలకనేత టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement