బ్యాంకు ఖాతాల్లో రివార్డు డబ్బు వేసేందుకు వీలుగా..
ఖాతాల కోసం పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డుల జారీ
స్కూళ్ల నుంచి 50 ఏళ్ల కిందటి బోనఫైడ్ సర్టిఫికెట్ల సేకరణ
ఆగమేఘాల మీద ధ్రువీకరణలు ఇప్పిస్తున్న పోలీస్ శాఖ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆపరేషన్ కగార్ ఫలితాలు కనిపిస్తున్నాయి. దండకారణ్యంలో ఆయుధాలతో పోరులో అలిసిపోయిన మావోలు క్రమంగా లొంగుబాటు బాట పడుతున్నారు. వనం వీడి జనంలోకి వస్తున్న మావోలకు పోలీసులు పునరావాసం కింద వారి మీద ప్రకటించిన రివార్డులను లొంగిపోయినందుకు వారికే ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, రివార్డుల చెక్కులను వీరికి ఇచ్చినా.. దాన్ని వీరు సొమ్ము చేసుకోవాలంటే తప్పకుండా వీరికి బ్యాంకు ఖాతాలు కావాల్సిందే. అందుకే, వాటి కోసం పోలీసుశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. 2025 ఏడాదిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు వందలాది మంది లొంగిపోయిన మావోలకు బ్యాంకు ఖాతాల కోసం పోలీసుశాఖ ఇపుడు ధ్రువీకరణ పత్రాలు సాధించే పనిలో పడింది.
ఎవరి రివార్డ్ వారికే చెందేలా..
మావోయిస్టు కేంద్ర కమిటీలో అగ్రభాగాన తెలంగాణ వారే ఉన్నారు. అలాంటి అగ్రనేతల్లో కొందరు ఎదురుకాల్పుల్లో చనిపోగా.. మిగిలిన వారంతా లొంగిపోయారు. అడవిలో యుద్ధం కష్టమవడం, ప్రజల నుంచి మావోల ఉద్యమానికి మునుపటి తరహాలో ఆదరణ రాకపోవడం, ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోల ఏరివేతను ముమ్మరం చేయడంతో అనేకమంది అగ్రనేతలు పునరాలోచనలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో వీరిలో పలువురిని తెలంగాణ పోలీసులు రహస్యంగా సంప్రదించారు. ఫలితంగా ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు నుంచి కంకణాల రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు వరకు అనేక మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటు ఎంచుకున్నారు. వీరికి అందాల్సిన రివార్డులు సైతం తెలంగాణ డీజీపీ కార్యాలయం అందజేసింది. ఎవరి తల మీద ఎంత రివార్డు ఉంటే అది వారికే చెందేలా చెక్కులు అందజేశారు. చెక్కులు సొమ్ము చేసుకునే క్రమంలో వీరికి బ్యాంకు ఖాతాలు లేవన్న సంగతి గుర్తించిన పోలీసులు వెంటనే ఆ పనిలోకి దిగిపోయారు.
50 ఏళ్ల నాటి రికార్డులు వెలికితీసి..
లొంగిపోయిన మావోలకు రివార్డు డబ్బుల కోసం బ్యాంకు ఖాతాలు కావాలి. వాటి కోసం మావోయిస్టు అగ్రనేతలు చదివిన 50 ఏళ్ల కిందటి స్కూళ్ల రికార్డులు వెదికి సంపాదించారు. ఆయా స్కూళ్ల నుంచి బోనఫైడ్ సాధించాక వారికి కులం, నివాస సర్టిఫికెట్లు, ఆధార్, ప్యాన్, ఓటరు కార్డులు దగ్గరుండి తీయించారు. వాటితో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. కొత్తగా తీసిన బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం పునరావాసం కింద ఇచ్చిన చెక్కులను జమచేసుకునే వీలయ్యేలా చేశారు. ధ్రువీకరణ పత్రాలు సంపాదించి మాజీ మావోలకు ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాలు తెరిపించే పనిని డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) చేపట్టింది. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన సమాచారం వరకు ఇప్పటివరకూ దాదాపు 700 మందికి ఆధార్, ప్యాన్, ఓటరు కార్డులు, బ్యాంకు ఖాతాలు ఇప్పించినట్లు సమాచారం. వీరందరికీ కలిపి దాదాపు రూ.10 కోట్లకుపైగా నగదును మాజీ మావోల ఖాతాల్లో జమచేసినట్లు తెలిసింది.


