సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలో బీజాపూర్ జిల్లా, కర్రెగుట్ట కొండల అటవీ ప్రాంతంలో నక్సల్స్ అమర్చిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైజ్‌లు (IEDs) పేలాయి. ఐఈడీలు పేలడంతో 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిలో పదిమంది డీఆర్‌జీ సిబ్బంది, ఒకరు కోబ్రా బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ రుద్రేష్ సింగ్ ఉన్నారు. ఆయనతో పాటు ఇద్దరు డీఆర్‌జీ సిబ్బంది కాళ్లకు గాయాలు కాగా, మరో ముగ్గురి కంటికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్సనందిస్తున్నారు.
కర్రెగుట్ట ప్రాంతం గతంలో నక్సల్స్‌కు సురక్షిత స్థావరంగా ఉండేది. 2025 ఏప్రిల్-మే నెలల్లో 21 రోజులపాటు జరిగిన విస్తృత ఆపరేషన్‌లో 31 మంది నక్సల్స్ హతమయ్యారు. ఆ సమయంలో భద్రతా బలగాలు 35 ఆయుధాలు, 450 ఐఈడీలు, పెద్ద సంఖ్యలో డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు, వైద్య సరఫరాలు, విద్యుత్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. గతేడాది నవంబర్‌లో భద్రతా బలగాలు ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడ్పాల గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉంది.
కాగా,తాజాగా ఐఈడీ పేలుళ్ల ఘటన మరోసారి నక్సల్స్ వ్యూహాత్మక దాడుల తీవ్రతను చూపించింది. భద్రతా బలగాలు నిరంతరం ఆపరేషన్లు కొనసాగిస్తున్నప్పటికీ, ఐఈడీ దాడులు వారికి ప్రధాన సవాలుగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.


