breaking news
IED
-
32 చోట్ల మారణహోమానికి స్కెచ్
న్యూఢిల్లీ: దశాబ్దాల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా, తాజాగా ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్లో జైషే మొహమ్మద్ కీలక నేతల మరణాలకు కక్షసాధింపుగా నిద్రాణ ముష్కరమూకలు తలపెట్టిన మారణకాండ గుట్టు రట్టవుతోంది. ఎర్రకోట వద్ద కారును పేల్చేసిన ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ హాస్టల్ గది వేదికగా పేలుళ్ల కుట్రకు ఉగ్రవాదులు పథక రచన చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఏఐ) అధికారులు గురువారం తేల్చారు. ఫరీదాబాద్‌లోని అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయంలోని బాయ్స్ హాస్టల్ 17వ భవంతిలోని 13వ నంబర్ గదిని ఉగ్రవాదులు తమ రహస్య అడ్డాగా ఉపయోగించుకున్నారు. ఇక్కడి నుంచే అన్ని చోట్లా దాడులకు వ్యూహం పన్నారు. 32 పాత, కొత్త కార్లలో బాంబులను అమర్చి దేశంలోని నాలుగు ప్రధాన నగరాలతోపాటు 32 ప్రాంతాల్లో పేల్చేసి పెను విధ్వంసం సృష్టించాలనేది ఉగ్రవాదుల అసలు కుట్ర అని స్పష్టమైంది. ఇప్పటికే అరెస్టయిన డాక్టర్ ముజామిల్‌కు, ఉమర్‌కు మధ్య చివర్లో విబేధాలు పొడచూపాయి. ఈ కారణంగానే దాడి ప్రాంతాలు మారాయా? దాడి చేయాల్సిన తేదీలు మారాయా? అనేది తేలాల్సి ఉంది. డైరీలో కోడ్ నేమ్‌లు, బాంబుల నిల్వ ప్రాంతాలు.. వర్సిటీ హాస్టల్లో ముజామిల్‌కు చెందిన 13వ నంబర్ గదితోపాటు ఉమర్ ఉండే నాలుగో నంబర్ గదిలో అధికారులు 3 డైరీలను స్వాధీనంచేసుకున్నారు. వీటిలో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్‌కు చెందిన వాళ్లే. కోడ్ భాషలో పలు ప్రాంతాల పేర్లు, కొన్ని నంబర్లు రాసి ఉన్నాయి. డైరీలో నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు మార్కింగ్ చేసి ఉంది. చాలా చోట్ల ‘ఆపరేషన్’ అని రాసి ఉంది. దీంతో ఇది ఎంతో పకడ్బందీగా జరిగిన విద్రోహచర్య అని అర్థమైంది. పాతిక మంది సాయంతో తమ ప్రణాళికను ఆచరణలో పెట్టాలని ఉమర్, ముజామిల్ భావించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ధౌజ్ గ్రామంలో 360 కేజీల అమ్మోనియం నైట్రేట్‌ను స్వా«దీనంచేసుకున్న లాడ్జ్ వివరాలను ముజామిల్ డైరీలో అధికారులు గుర్తించారు. అక్రమంగా పెద్ద ఎత్తున కొనుగోలుచేసిన ఎరువులను తమ యూనివర్సిటీ ల్యాబ్‌లోని రసాయనాల తో కలిపి అత్యంత వినాశకర, విస్ఫోటక అమ్మోనియం నైట్రేట్ ప్యూయల్ ఆయిల్(ఏఎన్‌ఎఫ్‌ఓ)ను తయారుచేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా హాస్టల్ గదిలో పలు రకాల రసాయనాల జాడను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. భారీ ఎత్తున ఎరువుల కొనుగోలు ఉమర్ ఏకంగా రూ.26 లక్షల నిధులను సమీకరించాడు. ఇందులో రూ.3 లక్షలు ఖర్చుపెట్టి 26 క్వింటాళ్ల ఎన్పీకే(నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాíÙయం) ఫెర్టిలైజర్‌ను కొనుగోలుచేశాడు. గురుగ్రామ్, నూహ్, సమీప పట్టణాలకు చెందిన సప్లయర్ల ద్వారా వీటిని తెప్పించాడు. ఈ ఎరువులను ల్యాబ్‌లో తీసుకొచ్చిన రసాయనాలతో తొలుత సూక్ష్మస్థాయిలో అత్యంతపేలుడు పదార్థం(ఐఈడీ) తయారుచేశాడు. అది విజయవంతమయ్యాకే పేలుడు పదార్థాలను సొంత కార్లలో ధౌజ్, తాగా గ్రామాల్లోని తమ స్థావరాలకు తరలించారు. అక్కడే కార్లకు బాంబు సర్క్యూట్లను బిగించి లక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్లాన్ చేశారు. థ్రీమా మెసేజింగ్ యాప్‌లో చాటింగ్ తమ ప్లాన్ ఎవరికీ తెలీకూడదనే ఉద్దేశంతో స్విట్జర్లాండ్‌కు చెందిన మెసేజింగ్ యాప్ ‘థ్రీమా’లో ఉమర్, ముజామిల్ ఘనీ, వైద్యురాలు షాహీన్ సయీద్‌లు చాటింగ్ చేసుకునేవారు. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌లోని కీలకమైన సభ్యులతో చర్చించేందుకు ఉమర్ విడిగా సిగ్నల్ యాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. 4 నగరాల్లో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్‌ను నేరుగా పర్యవేక్షించేందుకు ఒక్కో నగరానికి ఇద్దరు ఉగ్రవాదుల చొప్పున మొత్తం ఎనిమిది మంది కీలక సభ్యులను ఎంపికచేశాడు. వర్సిటీని జల్లెడ పడుతున్న అధికారులు ఒకే వర్సిటీలో ఒకే వృత్తిలోని వ్యక్తులు ఉగ్రభావజాలంలో మునిగిపోవడంతో ఈ విద్యాసంస్థ ఉగ్రఅడ్డాగా మారిందా? అనే కోణంలో దర్యాప్తు అధికారులు వర్సిటీని జల్లెడపడుతున్నారు. వర్సిటీకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లను ఫోరెన్సిక్ ఆడిట్‌కు పంపించారు. ఇప్పటికే దొరికిన ఆధారాలతో ఇక్కడి విద్యార్థుల ఫోన్ నంబర్లు, సామాజిక మాధ్యమ ఖాతాలు, సొంత గ్రామాల చిరునామాలు సరిపోలుతాయో లేదోనని చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అరెస్టయిన వైద్యురాలు షాహీన్‌తో సత్సంబంధాలున్న 32 ఏళ్ల వైద్య విద్యార్థి మొహమ్మద్ ఆరిఫ్ మిర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. ఆరిఫ్ ప్రస్తుతం కాన్పూర్‌లోని లక్ష్మీపత్ సింఘానియా కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ కాలేజీలో ఎండీ వైద్య విద్యనభ్యసిస్తున్నాడు. కశ్మీర్‌లోని ఖాగూర్ సాదవారీ ప్రాంతం ఆరిఫ్ స్వస్థలం. నజీరాబాద్‌లో ఆరిఫ్ ఇంట్లోంచి పోలీసులు ఒక ల్యాప్‌టాప్‌ను స్వా«దీనంచేసుకున్నారు. ఏటీఎస్ బృందం వచ్చే సమయానికి ఆరిఫ్ తన ఫోన్ డేటాను తొలగిస్తూ కనిపించాడు. ఆరిఫ్‌కు గతంలో నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామినేషన్‌లో ఆలిండియా 1608 ర్యాంక్ రావడం విశేషం. ఇంతటి ప్రతిభావంతుడు ఉగ్రవాదులతో చేతులు కలపడం ఆశ్చర్యంగా ఉందని కాలేజీ ప్రిన్సిపల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ పట్టణంలోని జీఎస్ మెడికల్ కాలేజీ అధ్యాపకుడు డాక్టర్ ఫారూఖ్‌ను ఢిల్లీ పోలీసులు ఇదే కేసులో గురువారం అరెస్ట్ చేశారు. ఇతను కూడా గతంలో అల్–ఫలాహ్ కాలేజీలోనే విద్యనభ్యసించాడు. వీళ్లంతా ఒకే ఈ–మెయిల్ ఐడీని వాడుతున్నట్లు గుర్తించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ చిక్కకుండా చిక్కుముడి రూట్ ఢిల్లీకి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో పోలీసులకు చిక్కకుండా ఫరీదాబాద్ నుంచి ఉమర్ ప్రయాణించిన మార్గాన్ని పోలీసులు గుర్తించారు. డజన్లకొద్దీ సీసీటీవీ ఫుటేజీలను జల్లెడపట్టాక అతని ప్రయాణరూట్పై ఒక స్పష్టత వచి్చంది. ఆదివారం అతను ఫరీదాబాద్ నుంచి బయల్దేరి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించాడు. నూహ్ జిల్లాలోని ఫిరోజ్‌పూర్ ఝిర్కాకు రాగానే రోడ్డు పక్కన ధాబా వద్ద ఆగాడు. వెనక సీట్లో పెద్ద బ్యాగులో బాంబు ఉండటంతో ఎటూ పోకుండా కారులోనే కూర్చున్నాడు. రాత్రంతా కారులోనే నిద్రపోయాడు. మార్గమధ్యంలో పట్టణాల మీదుగా వెళ్లకుండా గ్రామాలమీదుగా వెళ్లాడు. పెద్ద హోటళ్లలో తినకుండా రోడ్డు పక్కన చిన్న హోటళ్లలో భోజనాలు కానిచ్చాడు. బదార్పూర్ బోర్డర్ గుండా ఢిల్లీకి చేరుకున్నాడు. సరళరేఖ మార్గంలో వెళ్లకుండా గజిబిజి ప్రయాణాల చేశాడు. తూర్పు ఢిల్లీ, ఓఖ్లా, పారిశ్రామిక నడువా, కన్నాట్ ప్లేస్ ఇలా వేర్వేరు చోట్ల తిరిగి చివరకు ఎర్రకోట వద్దకు చేరుకున్నాడు. ఎక్కువ రద్దీ ఉంటే చోట్ల తనిఖీలు, ట్రాఫిక్ పోలీసుల నిఘా ఉండదనే ఉద్దేశ్యంతో ఆ మార్గాల్లో ప్రయాణించాడు.ఉమర్ మూడో కారు లభ్యం వర్సిటీ పార్కింగ్ ప్రదేశంలో ఉమర్ మూడో కారును పోలీసులు గుర్తించారు. ఇది ఇప్పటికే అరెస్టయిన వైద్యురాలి పేరిట ఉంది. దీనిని ఉమర్ పేలుడు పదార్థాల రవాణా కోసం ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం పేలుళ్లకు 32 కార్లు అవసరమని, వాటిల్లో కొన్నింటిని కొత్తగా కొనుగోలుచేయాలని పథక రచనచేశారు. పలువురిచేతులు మారి మూలాలు కనిపెట్టలేని పాత కార్లను దాడుల కోసం ఎంచుకున్నారు. మరోవైపు అల్–ఫలాహ్ వర్సిటీ సభ్యత్వాన్ని రద్దుచేస్తున్నట్లు ‘ది అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్’(ఏఐయూ) గురువారం ప్రకటించింది. విద్యాప్రమాణాల మేరకు సంస్థను నడపని ఈ వర్సిటీకి సంఘంలో ఉండే అర్హతలేదని ఏఐయూ తెలిపిందిపంజాబ్లో ఉగ్ర కుట్ర భగ్నం 10 మంది అరెస్టు చండీగఢ్: పంజాబ్‌లో మరో ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండదండలతో గ్రెనేడ్ దాడికి ముష్కరులు పథకం వేయగా, పోలీసులు ముందుగానే గుర్తించి అడ్డుకున్నారు. ఈ కుట్రకు సంబంధించి 10 మందిని అరెస్టు చేశారు. పంజాబ్‌లో గ్రెనేడ్ దాడి చేసి, అశాంతి సృష్టించాలన్నదే వారి అసలు లక్ష్యమని విచారణలో పోలీసులు తేల్చారు. పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్స్‌తో వారు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను కులదీప్ సింగ్, శేఖర్ సింగ్, అజయ్ సింగ్‌గా గుర్తించారు. వారు పంజాబ్‌లోని శ్రీముక్తార్ సాహిబ్‌కు చెందినవారేనని డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్‌ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల ఐఈడీ స్వాధీనం
శ్రీనగర్: నూతన సంవత్సర వేడుకల వేళ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపుర్ జిల్లాలో సోమవారం భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బసంత్‌గఢ్ ప్రాంతంలో సిలిండర్ లాంటి బాక్సులో సుమారు 15 కిలోల ఐఈడీని అమర్చినట్లు గుర్తించామన్నారు. దాంతో పాటు సంఘటనా స్థలం నుంచి 300-400 గ్రాముల ఆర్డీఎక్స్, 7.62ఎంఎం కార్ట్రిడ్జెస్, ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు పదార్థాలతో పాటు కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న ఓ పత్రం, నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు సంబంధించిన గుర్తులు లభించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముకేశ్ సింగ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బసంత్‌గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: కరోనా ఫోర్త్ వేవ్ భయాలు.. అక్కడ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు! -
ఢిల్లీలో బాంబు కలకలం: ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్..!!
-
బ్యాగులో బాంబు కలకలం.. పోలీసులు అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం సృష్టించింది. సీమపురిలో ఓ ఇంట్లోని బ్యాగులో పేలుడు పదార్ధం ఐఈడీని పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. ఘాజిపూర్ పూల మార్కెట్ కేసు విచారణకు వెళ్లిన పోలీసులకు ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగు కనిపించింది. వెంటనే బ్యాగును తెరిచి చూడటంతో బాంబు కనిపించడంతో పోలీసులు షాకయ్యారు. సమాచారం అందుకున్న బాంబ్ స్వ్కాడ్, ఎన్ఎస్జీ బృందం, స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. గత నెలలో పూల మార్కెట్లో 3 కేజీల ఆర్డీఎక్స్ను పోలీసులు గుర్తించారు. -
ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో భారీ ఉగ్ర కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని అమృత్సర్ ప్రాంతంలో టిఫిన్ బాక్సుల్లో అమర్చిన బాంబులతో సహా పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం డ్రోన్ల శబ్దాలు వినిపించడంతో స్థానికులు అప్రమత్తం చేశారని పోలీసులు పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా వీటిని డ్రోన్ ద్వారా జారవిడచినట్టు అధికారులు అనుమానిస్తున్నామన్నారు. అమృత్సర్ జిల్లాలోని దలేకే గ్రామ సమీపంలో పోలీసులు ఐఈడీ, హ్యాండ్ గ్రెనేడ్ బాంబులను గుర్తించారు. ఏడు సంచుల్లో, రెండు నుండి మూడు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రోన్స్ ద్వారా పిల్లల టిఫిన్ బాక్సుల్లో బాంబులను అమర్చి భారీ దాడికి పథకం వేసినట్టు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించారు. ఐదు హ్యాండ్ గ్రెనేడ్లు, 20 ఐఈడీ బాంబులు, తొమ్మిది పిస్టల్స్, మూడు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 20 మందిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. దేశంలో, పంజాబ్‌లో పనిచేస్తున్న ఉగ్రవాదశక్తులు స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 15కి ముందు భారీ దాడులకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. కాగా ఇటీవలికాలంలో సరిహద్దుల్లో డ్రోన్ల కదలికలు కలకలం రేపాయి. ముఖ్యంగా కశ్మీర్లో వరుసల కదలికలను నిఘా వర్గాలు పసిట్టాయి. ఈ క్రమంలో కశ్మీర్ పోలీసులు ఒక డ్రోన్‌ను పేల్చివేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామం నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంజాబ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో హై అలెర్ట్‌ను ప్రకటించారు. -
ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర, పోలీసుల చెక్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టెర్రరిస్టును అరెస్టు చేశారు. అతన్ని ఐసిస్‌కు ఉగ్రవాద గ్రూపునకు చెందిన అబు యూసుఫ్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. టెర్రరిస్టు నుంచి ఒక గన్, రెండు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నట్టు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ సింగ్ కుశ్వారా మీడియాతో చెప్పారు. అబు యూసుఫ్‌ను పట్టుకునే క్రమంలో గత అర్ధరాత్రి దౌలా కువా, కరోల్ బాగ్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఢిల్లీలో ఓ ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు అబు యూసుఫ్ నగరానికి వచ్చినట్టు తెలుస్తోందని అన్నారు. తన కుట్రకు సంబంధించి ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించినట్టు సమాచారం. ఇక అబు యూసుఫ్‌కు ఢిల్లీలోని కొందరు సహాయసహకారాలు అందిస్తున్నారని వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నామని డిప్యూటీ కమిషన్ ప్రమోద్ సింగ్ కుశ్వారా వెల్లడించారు. కాగా, అబు యూసుఫ్ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌గా విచారణలో తేలిందని చెప్పారు. యూపీలోని అతని నివాసాలపై దాడులు చేపట్టినట్టు ప్రమోద్ సింగ్ పేర్కొన్నారు. (చదవండి: ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్) -
ఉగ్రవాది ఖతం.. బాంబులు మిస్సింగ్!
-
ఉగ్రవాది ఖతం.. కానీ, బాంబులు మిస్సింగ్!
శ్రీనగర్: పుల్వామాలో బుధవారం జరిగిన భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో బాంబు తయారీలో నిపుణుడైన ఫౌజీ భాయ్ అలియాస్ అబ్దుల్ రెహమాన్ కూడా ఉన్నట్టు కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఫౌజీ భాయ్ ఎన్కౌంటర్ భద్రతా బలగాలకు పెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రెహమాన్ తయారు చేసిన మూడు కారు బాంబుల్లో ఒకదానిని భద్రతా బలగాలు పేల్చివేయగా... మరో రెండింటి ఆచూకీ తెలియాల్సి ఉంది. బుడ్గాం, కుల్గాం ప్రాంతాల్లో ఆ బాంబులు ఉండొచ్చని, వాటి జాడ కోసం ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. (చదవండి: పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!) కాగా, పుల్వామా తరహా ఉగ్రదాడి జరగనుందనే ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 20 కిలోల శక్తిమంతమైన ఐఈడీని మోసుకెళ్తున్న శాంట్రో వాహనాన్ని మే 27న సీజ్ చేశాయి. ఐఈడీని తరలిస్తున్న టెర్రరిస్టు సమీర్ అహ్మద్ దార్ తృటిలో తప్పించుకుపోయాడు. ఇక ఐఈడీ వాహనాన్ని తరలించడం ప్రమాదమని భావించిన బాంబు స్క్వాడ్ నిపుణులు దానిని అక్కడే పేల్చివేశారు. గతేడాది పుల్వామా వద్ద భద్రతా బలగాలపై ఆత్మహుతి దాడికి పాల్పడ్డ అదిల్ దార్‌కు సమీర్ అహ్మద్ దార్ బంధువని తేలింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. (చదవండి: పుల్వామాలో భారీ ఎన్కౌంటర్) -
ఐఈడీ కన్నా ఓటర్ ఐడీ గొప్పది: మోదీ
అహ్మదాబాద్: ఉగ్రవాదుల ఐఈడీ (ఆధునీకరించిన పేలుడు పరికరం) కన్నా ఓటర్ ఐడీ (గుర్తింపు కార్డు) శక్తిమంతమైనదని మోదీ అన్నారు. అహ్మదాబాద్‌లో మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘ఒకవైపు ఐఈడీ ఉగ్రవాదుల ఆయుధమైతే , మరోవైపు ఓటరు ఐడీ ప్రజాస్వామ్య ఆయుధం. ఐఈడీ కన్నా ఓటరు ఐడీ శక్తిమంతమైనదని విశ్వసిస్తున్నా’ అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మోదీకి తోడుగా పోలింగ్ బూత్ వరకు వచ్చారు. మోదీ గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో సోమవారం బసచేసి, ఉదయం ఓటు వేయడానికి ముందు ఇంటికెళ్లి తల్లిని కలిశారు. తల్లి హీరాబా నుంచి శాలువా, కొబ్బరికాయ, స్వీట్లు స్వీకరించారు. తల్లి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకుని ఓటు వేసేందుకు వచ్చారు. అనంతరం హీరాబా కూడా గాంధీనగర్ సమీపలోని రైసన్ గ్రామంలో ఓటు వేశారు. గుజరాత్లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలుండగా, అన్ని చోట్లా మంగళవారం పోలింగ్ ముగిసింది. పీఎం పదవినే మమత కొనేవారు పీఎం పదవికి వేలం కానీ నిర్వహించేలా ఉండుంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ పదవిని నారద, Ô >రద కుంభకోణాల్లో సంపాదించిన డబ్బుతో కొనేవారని మోదీ ఎద్దేవా చేశారు. ఆ డబ్బులతో మమత పీఎం పదవి కొనలేకపోయినందుకు తాను ఆమెపై జాలి పడుతున్నానన్నారు. బెంగాల్లో బలవంతపు వసూళ్లకు మమత పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆమె ప్రధాని అయితే దేశం మొత్తాన్నీ వదలరని అన్నారు. బెంగాల్‌లోని అసన్సోల్లో మోదీ మంగళవారం ప్రచారం చేశారు. -
ఉగ్ర కలకలం : సిటీలో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రకదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే గత మూడు రోజులుగా హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్న అధికారులు పాతబస్తీలోని షాయిన్ నగర్, పహడి షరీఫ్, అభిన్‌పురాల్లో సోదాలు నిర్వహించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం అభిపురాకు చెందిన రెహమాన్‌ను అరెస్ట్ చేసిన అధికారులు.. బీహార్‌లోని బౌద్ధగయ, ఉత్తరాఖండ్‌లోని అర్ధ కుంభమేళలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. (నగరంలో ఐసిస్ కలకలం) కేరళ, బెంగుళూరుల్లో కూడా.. బౌద్ధగయలో మారణహోమాన్ని సృష్టించేందుకు ఐఈడీలను అమర్చారనే ఆరోపణలపై ఈ నెల మూడో తేదీన కేరళలో ఇద్దరిని, ‘జమాతే ఉల్ ముజాహిదీన్’ అనే బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారనే సమాచారంతో బెంగుళూరులో మరో ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో హైదరాబాద్‌లోని షాహీన్ నగర్‌కు చెందిన తండ్రీ కొడుకులు అబ్దుల్ కుద్దుస్, అబ్దుల్ ఖదీర్‌లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. -
అధ్యక్షుడే లక్ష్యంగా బాంబు దాడి
-
అధ్యక్షుడే లక్ష్యంగా బాంబు దాడి
లానోవో డెల్ సుర్: పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టేకు పెను ప్రమాదం తప్పింది. ఆయనను లక్ష్యంగా దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు ఐఈడీ (ఇంప్రూవైస్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)ను పేల్చారు. దీని ధాటికి అధ్యక్షుడి రక్షణ బాధ్యతలు చూసే సిబ్బంది(పీఎస్జీ)లో ఏడుగురు, ప్రత్యేక ఆర్మీ బలగంలోని ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మారావి నగరంలో ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ ఫైల్ మాన్ టాన్ ఈ ఘటనను ధృవీకరించారు. మానావి నగరం మీదుగా అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్లే సమయంలో అధ్యక్షుడి ముందు వెళుతున్న ప్రత్యేక భద్రతా సిబ్బంది ఈ బాంబు దాడి బారిన పడ్డారు. మొత్తం 50 మంది వివిధ రకాల ప్రత్యేక సిబ్బంది అధ్యక్షుడి కాన్వాయ్ ముందు వెళుతుంటుంది. వీరి వెనుక పత్రికా సిబ్బంది, ఆర్మీ సిబ్బంది ఉంటారు. మౌతే గ్రూప్ అనే ఓ ఇస్లామిస్ట్ టెర్రరిస్టు గ్రూప్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. -
కశ్మీర్ సరిహద్దులో కలకలం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ సరిహద్దులో పెద్ద ప్రమాదం తప్పింది. రద్దీగా ఉండే జమ్ము సరిహద్దు ప్రాంతంలో అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడి) భద్రతా దళాలు కనుగొన్నాయి. శ్రీనగర్ ముజఫరా బాద్ హైవేపై, కల్వర్ట్ కింద అమర్చిన ఈ పేలుడు పరికరాన్ని గమనించామని రోడ్ ఓపెనింగ్ పార్టీ రక్షక దళాలు తెలిపాయి. రొటీన్ గా నిర్వహించే తనిఖీల్లో భాగంగా ఈ భారీ పేలుడు పదార్థాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. దీన్ని నిర్వీర్యం చేయడంతో ఆ మార్గంలో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నాయి. -
పేలుడుకు బాధ్యులెవరు?
పింప్రి, న్యూస్‌లైన్: ఫరస్కానా పోలీస్ స్టేషన్ వద్ద గురువారం జరిగిన బాంబు పేలుడుకు కారణం ఎవరనే విషయమై స్పష్టత రావడం లేదు. దగుడుసేఠ్ హల్వాయి గణపతి దేవాలయం తీవ్రదాడుల హిట్‌లిస్టులో ఉన్నప్పటికీ, తాజా బాంబు పేలుడు అంత తీవ్రమైనది కాకపోవడంతో దీనికి బాధ్యులెవరే దానిపై స్పష్టత కొరవడింది. ఈ పేలుడు కేవలం ఒకరిని లక్ష్యంగా చేసుకుని జరిపారా అన్న సందేహాలూ కలుగుతున్నాయి. పుణే నగర క్రైంబ్రాంచ్‌లో పని చేస్తున్న ఒక పోలీసు అధికారి నక్సల్ హిట్ లిస్టులో ఉన్నారు. ఈ అధికారి గురువారం దగుడుసేఠ్ గణపతి ఆలయ దర్శనానికి వెళ్లే ముందు తన మోటార్ సైకిల్‌ను ఫరస్కానా పోలీసు స్టేషన్ ఆవరణంలో పెట్టారు. ఆయనకు భద్రతగా స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ సిబ్బందితోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. సదరు అధికారి ఆలయం నుంచి వెళ్లిపోయిన వెంటనే ఈ పేలుడు జరగడంతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేలుడుకు ఉపయోగించిన వాహనం పోలీసుదే పేలుడుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ సాతారాలో పనిచేసే కానిస్టేబుల్ దాదా బాబురావుదని గుర్తించారు. అయితే ఈ బైకు సాతారా కోర్టు వద్ద గత నెల 25న చోరీ అయింది. దీనిని దొంగిలించిన వారిని గుర్తించేందుకు సాతారా-పుణే ప్రాంతాల మధ్య ఉన్న టోల్‌నాకాల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల వీడియోలను పరిశీలిస్తున్నారు. కోరేగాల్ పార్క్ పరిసరాలలోని జర్మన్ బేకరిలో 2010, ఫిబ్రవరి 13న జరిగిన బాంబు పేలుడు పేలుళ్లలో 17 మంది మృతి చెందగా, 52 మంది గాయపడ్డారు. 2012లో ఆగస్టులో డెక్కన్ జంగ్లీ మహరాజ్ మార్గంలో జరిగిన బాంబు పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్దే బాధ్యత అని తేలింది. గణేష్ ఉత్సవాలకు ముందే సీసీటీవీల ఏర్పాటు : మంత్రి పాటిల్ పేలుడు సమాచారం తెలిసిన వెంటనే హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ కేసును ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్)కు అప్పగించామని ప్రకటించారు. గణేష్ ఉత్సవాలకు ముందుగానే నగరంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నగర ప్రజలు ధైర్యంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా అనుమానపు కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. డీజీపీ సంజీవ్ దయాళ్, సీనియర్ పోలీసు అధికారులు మంత్రి వెంట ఉన్నారు. ఈ పేలుడు ఉగ్రవాద చర్యేనని ఏటీఎస్ ప్రకటించింది. ఈ మేరకు సెక్షన్ 324, 120 (బీ) ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. దర్యాప్తు కోసం పది బృందాలు పనిచేస్తున్నాయని, ఘటనాస్థలం నుంచి అన్ని ఆధారాలూ సేకరించామని వెల్లడించింది. ఇదిలా ఉంటే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కూడా శుక్రవారం ఘటనాస్థలాన్ని సందర్శించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీలు స్వాధీనం చేసుకున్న సీఆర్పీఎఫ్
మావోయిస్టులకు కంచుకోటగా నిలిచిన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రెండు ఐఈడీలను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక్కో దాంట్లో 20 కిలోల పేలుడు పదార్థాలు నింపిన రెండు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులతో కలిసి తమ బలగాలు స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేసినట్లు సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. 150 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ బలగాలు వీటిని కొత్తగా ఏర్పాటైన సుక్మా జిల్లాలో గల చింతగుఫ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నాయి. చింతల్నార్ వైపు వెళ్లే రోడ్డు కింద వీటిని మందుపాతరలుగా రోడ్డు కింద తవ్వి పెట్టారని, దాని గురించి తమకు సమాచారం రావడంతో గాలించగా దొరికిందని సీఆర్పీఎఫ్ అధికారి చెప్పారు. వాటిని బాంబు నిర్వీర్య దళం వెంటనే ధ్వంసం చేసిందని వివరించారు.


