32 చోట్ల మారణహోమానికి స్కెచ్‌ | 32 cars with explosives for multiple blasts was planned | Sakshi
Sakshi News home page

32 చోట్ల మారణహోమానికి స్కెచ్‌

Nov 14 2025 4:46 AM | Updated on Nov 14 2025 4:46 AM

32 cars with explosives for multiple blasts was planned

4 ప్రధాన నగరాలుసహా పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు పక్కా ప్రణాళిక 

అల్‌–ఫలాహ్‌ వర్సిటీ బాయ్స్‌ హాస్టల్‌ 13వ నంబర్‌ గదిలో పథక రచన 

గదిలో కీలక డైరీలు లభ్యం – డైరీలో నవంబర్‌ 8 నుంచి 12వ తేదీ వరకు మార్కింగ్‌ 

అందులో పాతిక మంది అనుమానిత ఆత్మాహుతి బాంబర్‌ల వివరాలు 

స్విట్జర్లాండ్‌ యాప్‌లో రహస్య చాటింగ్‌ 

సొంతంగా సిగ్నల్‌ యాప్‌ గ్రూప్‌ సృష్టించిన ఆత్మాహుతి బాంబర్‌ ఉమర్‌ 

బాంబుల తయారీ కోసం 26 క్వింటాళ్ల ఎన్‌పీకే ఎరువుల కొనుగోలు 

మరో ఇద్దరు డాక్టర్ల అరెస్ట్‌ – రూ.26 లక్షల నిధులను సమీకరించిన ఉమర్‌ 

తీగ లాగేకొద్దీ బయటపడుతున్న ఢిల్లీ పేలుడు కుట్ర రహస్యాలు 

వర్సిటీలో దొరికిన ఉమర్‌ మూడో కారు

న్యూఢిల్లీ: దశాబ్దాల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా, తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌ వేళ పాకిస్తాన్‌లో జైషే మొహమ్మద్‌ కీలక నేతల మరణాలకు కక్షసాధింపుగా నిద్రాణ ముష్కరమూకలు తలపెట్టిన మారణకాండ గుట్టు రట్టవుతోంది. ఎర్రకోట వద్ద కారును పేల్చేసిన ఆత్మాహుతి బాంబర్‌ డాక్టర్‌ ఉమర్‌ ఉన్‌ నబీ హాస్టల్‌ గది వేదికగా పేలుళ్ల కుట్రకు ఉగ్రవాదులు పథక రచన చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఏఐ) అధికారులు గురువారం తేల్చారు. 

ఫరీదాబాద్‌లోని అల్‌–ఫలాహ్‌ విశ్వవిద్యాలయంలోని బాయ్స్‌ హాస్టల్‌ 17వ భవంతిలోని 13వ నంబర్‌ గదిని ఉగ్రవాదులు తమ రహస్య అడ్డాగా ఉపయోగించుకున్నారు. ఇక్కడి నుంచే అన్ని చోట్లా దాడులకు వ్యూహం పన్నారు. 32 పాత, కొత్త కార్లలో బాంబులను అమర్చి దేశంలోని నాలుగు ప్రధాన నగరాలతోపాటు 32 ప్రాంతాల్లో పేల్చేసి పెను విధ్వంసం సృష్టించాలనేది ఉగ్రవాదుల అసలు కుట్ర అని స్పష్టమైంది. ఇప్పటికే అరెస్టయిన డాక్టర్‌ ముజామిల్‌కు, ఉమర్‌కు మధ్య చివర్లో విబేధాలు పొడచూపాయి. ఈ కారణంగానే దాడి ప్రాంతాలు మారాయా? దాడి చేయాల్సిన తేదీలు మారాయా? అనేది తేలాల్సి ఉంది. 

డైరీలో కోడ్‌ నేమ్‌లు, బాంబుల నిల్వ ప్రాంతాలు.. 
వర్సిటీ హాస్టల్‌లో ముజామిల్‌కు చెందిన 13వ నంబర్‌ గదితోపాటు ఉమర్‌ ఉండే నాలుగో నంబర్‌ గదిలో అధికారులు 3 డైరీలను స్వాధీనంచేసుకున్నారు. వీటిలో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్‌కు చెందిన వాళ్లే. కోడ్‌ భాషలో పలు ప్రాంతాల పేర్లు, కొన్ని నంబర్లు రాసి ఉన్నాయి. డైరీలో నవంబర్‌ 8 నుంచి 12వ తేదీ వరకు మార్కింగ్‌ చేసి ఉంది. చాలా చోట్ల ‘ఆపరేషన్‌’ అని రాసి ఉంది. 

దీంతో ఇది ఎంతో పకడ్బందీగా జరిగిన విద్రోహచర్య అని అర్థమైంది. పాతిక మంది సాయంతో తమ ప్రణాళికను ఆచరణలో పెట్టాలని ఉమర్, ముజామిల్‌ భావించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ధౌజ్‌ గ్రామంలో 360 కేజీల అమ్మోనియం నైట్రేట్‌ను స్వా«దీనంచేసుకున్న లాడ్జ్‌ వివరాలను ముజామిల్‌ డైరీలో అధికారులు గుర్తించారు. అక్రమంగా పెద్ద ఎత్తున కొనుగోలుచేసిన ఎరువులను తమ యూనివర్సిటీ ల్యాబ్‌లోని రసాయనాల తో కలిపి అత్యంత వినాశకర, విస్ఫోటక అమ్మోనియం నైట్రేట్‌ ప్యూయల్‌ ఆయిల్‌(ఏఎన్‌ఎఫ్‌ఓ)ను తయారుచేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా హాస్టల్‌ గదిలో పలు రకాల రసాయనాల జాడను ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించారు.  

భారీ ఎత్తున ఎరువుల కొనుగోలు 
ఉమర్‌ ఏకంగా రూ.26 లక్షల నిధులను సమీకరించాడు. ఇందులో రూ.3 లక్షలు ఖర్చుపెట్టి 26 క్వింటాళ్ల ఎన్‌పీకే(నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాíÙయం) ఫెర్టిలైజర్‌ను కొనుగోలుచేశాడు. గురుగ్రామ్, నూహ్, సమీప పట్టణాలకు చెందిన సప్లయర్ల ద్వారా వీటిని తెప్పించాడు. ఈ ఎరువులను ల్యాబ్‌లో తీసుకొచ్చిన రసాయనాలతో తొలుత సూక్ష్మస్థాయిలో అత్యంతపేలుడు పదార్థం(ఐఈడీ) తయారుచేశాడు. అది విజయవంతమయ్యాకే పేలుడు పదార్థాలను సొంత కార్లలో ధౌజ్, తాగా గ్రామాల్లోని తమ స్థావరాలకు తరలించారు. అక్కడే కార్లకు బాంబు సర్క్యూట్‌లను బిగించి లక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్లాన్‌ చేశారు. 

థ్రీమా మెసేజింగ్‌ యాప్‌లో చాటింగ్‌ 
తమ ప్లాన్‌ ఎవరికీ తెలీకూడదనే ఉద్దేశంతో స్విట్జర్లాండ్‌కు చెందిన మెసేజింగ్‌ యాప్‌ ‘థ్రీమా’లో ఉమర్, ముజామిల్‌ ఘనీ, వైద్యురాలు షాహీన్‌ సయీద్‌లు చాటింగ్‌ చేసుకునేవారు. ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌లోని కీలకమైన సభ్యులతో చర్చించేందుకు ఉమర్‌ విడిగా సిగ్నల్‌ యాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశాడు. 4 నగరాల్లో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్‌ను నేరుగా పర్యవేక్షించేందుకు ఒక్కో నగరానికి ఇద్దరు ఉగ్రవాదుల చొప్పున మొత్తం ఎనిమిది మంది కీలక సభ్యులను ఎంపికచేశాడు.    

వర్సిటీని జల్లెడ పడుతున్న అధికారులు 
ఒకే వర్సిటీలో ఒకే వృత్తిలోని వ్యక్తులు ఉగ్రభావజాలంలో మునిగిపోవడంతో ఈ విద్యాసంస్థ ఉగ్రఅడ్డాగా మారిందా? అనే కోణంలో దర్యాప్తు అధికారులు వర్సిటీని జల్లెడపడుతున్నారు. వర్సిటీకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లను ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు పంపించారు. ఇప్పటికే దొరికిన ఆధారాలతో ఇక్కడి విద్యార్థుల ఫోన్‌ నంబర్లు, సామాజిక మాధ్యమ ఖాతాలు, సొంత గ్రామాల చిరునామాలు సరిపోలుతాయో లేదోనని చెక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అరెస్టయిన వైద్యురాలు షాహీన్‌తో సత్సంబంధాలున్న 32 ఏళ్ల వైద్య విద్యార్థి మొహమ్మద్‌ ఆరిఫ్‌ మిర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. ఆరిఫ్‌ ప్రస్తుతం కాన్పూర్‌లోని లక్ష్మీపత్‌ సింఘానియా కార్డియాలజీ, కార్డియాక్‌ సర్జరీ కాలేజీలో ఎండీ వైద్య విద్యనభ్యసిస్తున్నాడు. 

కశ్మీర్‌లోని ఖాగూర్‌ సాదవారీ ప్రాంతం ఆరిఫ్‌ స్వస్థలం. నజీరాబాద్‌లో ఆరిఫ్‌ ఇంట్లోంచి పోలీసులు ఒక ల్యాప్‌టాప్‌ను స్వా«దీనంచేసుకున్నారు. ఏటీఎస్‌ బృందం వచ్చే సమయానికి ఆరిఫ్‌ తన ఫోన్‌ డేటాను తొలగిస్తూ కనిపించాడు. ఆరిఫ్‌కు గతంలో నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఎగ్జామినేషన్‌లో ఆలిండియా 1608 ర్యాంక్‌ రావడం విశేషం. ఇంతటి ప్రతిభావంతుడు ఉగ్రవాదులతో చేతులు కలపడం ఆశ్చర్యంగా ఉందని కాలేజీ ప్రిన్సిపల్‌ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ పట్టణంలోని జీఎస్‌ మెడికల్‌ కాలేజీ అధ్యాపకుడు డాక్టర్‌ ఫారూఖ్‌ను ఢిల్లీ పోలీసులు ఇదే కేసులో గురువారం అరెస్ట్‌ చేశారు. ఇతను కూడా గతంలో అల్‌–ఫలాహ్‌  కాలేజీలోనే విద్యనభ్యసించాడు. వీళ్లంతా ఒకే ఈ–మెయిల్‌ ఐడీని వాడుతున్నట్లు గుర్తించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ చిక్కకుండా చిక్కుముడి రూట్‌ 
ఢిల్లీకి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో పోలీసులకు చిక్కకుండా ఫరీదాబాద్‌ నుంచి ఉమర్‌ ప్రయాణించిన మార్గాన్ని పోలీసులు గుర్తించారు. డజన్లకొద్దీ సీసీటీవీ ఫుటేజీలను జల్లెడపట్టాక అతని ప్రయాణరూట్‌పై ఒక స్పష్టత వచి్చంది. ఆదివారం అతను ఫరీదాబాద్‌ నుంచి బయల్దేరి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించాడు. నూహ్‌ జిల్లాలోని ఫిరోజ్‌పూర్‌ ఝిర్కాకు రాగానే రోడ్డు పక్కన ధాబా వద్ద ఆగాడు. వెనక సీట్లో పెద్ద బ్యాగులో బాంబు ఉండటంతో ఎటూ పోకుండా కారులోనే కూర్చున్నాడు. 

రాత్రంతా కారులోనే నిద్రపోయాడు. మార్గమధ్యంలో పట్టణాల మీదుగా వెళ్లకుండా గ్రామాలమీదుగా వెళ్లాడు. పెద్ద హోటళ్లలో తినకుండా రోడ్డు పక్కన చిన్న హోటళ్లలో భోజనాలు కానిచ్చాడు. బదార్‌పూర్‌ బోర్డర్‌ గుండా ఢిల్లీకి చేరుకున్నాడు. సరళరేఖ మార్గంలో వెళ్లకుండా గజిబిజి ప్రయాణాల చేశాడు. తూర్పు ఢిల్లీ, ఓఖ్లా, పారిశ్రామిక నడువా, కన్నాట్‌ ప్లేస్‌ ఇలా వేర్వేరు చోట్ల తిరిగి చివరకు ఎర్రకోట వద్దకు చేరుకున్నాడు. ఎక్కువ రద్దీ ఉంటే చోట్ల తనిఖీలు, ట్రాఫిక్‌ పోలీసుల నిఘా ఉండదనే ఉద్దేశ్యంతో ఆ మార్గాల్లో ప్రయాణించాడు.

ఉమర్‌ మూడో కారు లభ్యం 
వర్సిటీ పార్కింగ్‌ ప్రదేశంలో ఉమర్‌ మూడో కారును పోలీసులు గుర్తించారు. ఇది ఇప్పటికే అరెస్టయిన వైద్యురాలి పేరిట ఉంది. దీనిని ఉమర్‌ పేలుడు పదార్థాల రవాణా కోసం ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం పేలుళ్లకు 32 కార్లు అవసరమని, వాటిల్లో కొన్నింటిని కొత్తగా కొనుగోలుచేయాలని పథక రచనచేశారు. పలువురిచేతులు మారి మూలాలు కనిపెట్టలేని పాత కార్లను దాడుల కోసం ఎంచుకున్నారు. మరోవైపు అల్‌–ఫలాహ్‌ వర్సిటీ సభ్యత్వాన్ని రద్దుచేస్తున్నట్లు ‘ది అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌’(ఏఐయూ) గురువారం ప్రకటించింది. విద్యాప్రమాణాల మేరకు సంస్థను నడపని ఈ వర్సిటీకి సంఘంలో ఉండే అర్హతలేదని ఏఐయూ తెలిపింది

పంజాబ్‌లో ఉగ్ర కుట్ర భగ్నం 10 మంది అరెస్టు 
చండీగఢ్‌: పంజాబ్‌లో మరో ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అండదండలతో గ్రెనేడ్‌ దాడికి ముష్కరులు పథకం వేయగా, పోలీసులు ముందుగానే గుర్తించి అడ్డుకున్నారు. ఈ కుట్రకు సంబంధించి 10 మందిని అరెస్టు చేశారు. పంజాబ్‌లో గ్రెనేడ్‌ దాడి చేసి, అశాంతి సృష్టించాలన్నదే వారి అసలు లక్ష్యమని విచారణలో పోలీసులు తేల్చారు. పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్స్‌తో వారు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను కులదీప్‌ సింగ్, శేఖర్‌ సింగ్, అజయ్‌ సింగ్‌గా గుర్తించారు. వారు పంజాబ్‌లోని శ్రీముక్తార్‌ సాహిబ్‌కు చెందినవారేనని డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ వెల్లడించారు. చైనాలో తయారైన హ్యాండ్‌ గ్రెనేడ్‌ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement