2026కు 26 ట్రెండ్స్‌.. ఏఐ నుంచి జీరో వేస్ట్‌ వరకూ.. | 26 Trends for 2026 From AI to Zero Waste | Sakshi
Sakshi News home page

2026కు 26 ట్రెండ్స్‌.. ఏఐ నుంచి జీరో వేస్ట్‌ వరకూ..

Dec 28 2025 12:40 PM | Updated on Dec 28 2025 1:08 PM

26 Trends for 2026 From AI to Zero Waste

మరికొద్ది రోజుల్లో 2026 రానుంది.. కోటి ఆశలతో మనమంతా కొంగొత్త కాలంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ తరుణంలో కొత్త సంవత్సరంలో ఇవి చేయాలి.. అవి చేయాలి అంటూ కొందరు లక్ష్యాలను పెట్టుకుంటారు. ఇటువంటి తరుణంలో రాబోయే 2026 మన జీవనశైలిని, సాంకేతికతను, మార్కెట్లను ఎలా ప్రభావితం చేయనుంది? ఏయే అంశాలు రాజ్యమేలనున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుండి జీరో వేస్ట్ వరకు   ఎలా ఉండబోతోంది.. ఏ టు జెడ్‌ ధోరణులపై సమగ్ర విశ్లేషణ మీకోసం..

AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)
2026లో ఏఐ రంగంలో అతిపెద్ద మార్పు రానుంది. ఇప్పటి వరకు కేవలం మన ప్రశ్నలకు సమాధానమిచ్చే చాట్‌బాట్‌ల స్థాయి నుండి, సొంతంగా పనులు పూర్తి చేసే ఏజెంటిక్ వ్యవస్థల వైపు అడుగులు పడనున్నాయి. అలాగే ప్రైవసీ, వేగాన్ని దృష్టిలో ఉంచుకుని  ఫోన్‌లలోనే నేరుగా పనిచేసే ఏఐ ఆదరణ పొందనుంది.

Beauty (సౌందర్యం)
సౌందర్య సాధనాలు కేవలం అందం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా అన్నట్లుగా మారనున్నాయి. అంటే మేకప్ వేసుకుంటేనే చర్మం హైడ్రేట్  కావడం, సూర్యుడి నుండి రక్షణ పొందడం వంటి 'హైబ్రిడ్ ఫార్ములా'లు మార్కెట్‌ను ఏలబోతున్నాయని ‘ది ఎకనమిక్‌ టైమ్స్‌’తన విశ్లేషణలో పేర్కొంది.

Cars (కార్లు)
ప్రీమియం కార్లలో మాత్రమే ఉండే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సరౌండ్ వ్యూ కెమెరాలు, ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్స్ వంటి ఫీచర్లు సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

Dining & Drinks (ఆహారం- పానీయాలు) 
భారతదేశంలో ఏటా 23 మిలియన్ల మంది కొత్తగా మద్యం తాగే వయస్సులోకి వస్తున్నారు. 2026లో క్రాఫ్ట్ బీర్లు, తక్కువ ఆల్కహాల్ ఉండే కాక్‌టెయిల్స్, రమ్ వంటి వాటికి ఆదరణ పెరగనుంది. ఆహార రంగంలో 'మైక్రో డైనర్స్', కేవలం రుచి మాత్రమే కాకుండా వాతావరణం కూడా అనుభూతినిచ్చే ‘మల్టీ-సెన్సరీ డైనింగ్’ కీలకం కానున్నాయి.

Entertainment (వినోదం)
వినోద రంగంలో ఏఐ వినియోగం పెరగడంతో కళాకారుల నుండి వ్యతిరేకత  ఎదురుకానుంది. దీంతో పలువురు నటులు ఇప్పటికే తమ పేరు, రూపం,  శైలిపై కాపీరైట్ హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రియేటివ్ కమ్యూనిటీని రక్షించేందుకు కఠినమైన నిబంధనలు వచ్చే అవకాశం ఉంది.

Fashion (ఫ్యాషన్)
2026ను  పర్సనల్‌ స్టయిల్‌ సంవత్సరంగా పిలుస్తున్నారు. అల్గారిథమ్స్ చూపించే ట్రెండ్స్ కంటే తమకు నచ్చినట్లు దుస్తులు ధరించడానికి జనం మొగ్గు చూపుతారు. మెకిన్సే నివేదిక ప్రకారం కొత్త దుస్తుల కంటే సెకండ్ హ్యాండ్ ఫ్యాషన్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందనుంది.

Gaming (గేమింగ్)
గేమింగ్‌లో ఏఐ ప్రతి యూజర్ కోసం ప్రత్యేకమైన కథనాలను, పరిసరాలను సృష్టిస్తుంది. దీనివల్ల గేమ్స్ మరింత అడిక్టివ్‌గా మారనున్నాయి. అయితే ఇది గేమర్స్ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆందోళనకరంగా మారింది.

Health (ఆరోగ్యం)
జబ్బులు రాకముందే గుర్తించే 'ప్రిడిక్టివ్‌ హెల్త్‌కేర్‌’ సాధారణం  కానుంది. పోషకాహార లోపం, గుండె పనితీరు, నిద్ర సమస్యలను ఏఐ విశ్లేషించి రోజువారీ సూచనలు అందిస్తుంది.  నిరంతర హెల్త్ మానిటరింగ్ కీలకం కానుంది.

Interiors (ఇంటీరియర్స్)
కృత్రిమంగా కనిపించే ఇళ్ల కంటే సహజమైన కలప, వంపులు తిరిగిన ఫర్నిచర్, వైవిధ్యమైన టెక్స్చర్లకు 2026లో డిమాండ్ ఉంటుంది. పాతకాలపు వస్తువులను మళ్లీ ఇళ్లలో చేర్చుకోవడం ఫ్యాషన్‌గా మారుతుంది.

Jobs (ఉద్యోగాలు)
ఐటీ వంటి రంగాల్లో ఆటోమేషన్ వల్ల మార్పులు వచ్చినా, సరైన నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ఉద్యోగ మార్కెట్ బలంగా ఉంటుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీఎస్‌) విస్తరించడం వల్ల నియామకాలు పెరిగే అవకాశం ఉంది.

Kids & Family (పిల్లలు-కుటుంబం)
తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆడుకోవడం ద్వారా బంధాన్ని బలపరుచుకునే 'కిడల్టింగ్' (Kidulting) పెరుగుతోంది. ఇది పెద్దల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. పాఠశాలల్లో బట్టీ పట్టే పద్ధతుల కంటే అనుభవం ద్వారా నేర్చుకోవడం అనేదానికి ప్రాధాన్యత పెరుగుతుంది.

Luxury (లగ్జరీ)
కేవలం ఖరీదైన వస్తువులను కొనడం కంటే, ప్రత్యేకమైన ప్రయాణాలు, అరుదైన సాంస్కృతిక కార్యక్రమాలు, వెల్నెస్ రిట్రీట్స్ వంటి అనుభూతిని ఇచ్చే అంశాలకు ప్రాధాన్యత పెరుగుతుంది.

Music (సంగీతం)
పంజాబీ సంగీతం తరహాలోనే హర్యాన్వీ, భోజ్‌పురి, మలయాళం తదితర ప్రాంతీయ భాషల సంగీతం గ్లోబల్ స్థాయిలో పాపులర్ అవుతుంది. భారతీయ కళాకారులు తమ ఫ్యాన్ బేస్ నుండి ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషిస్తారు.

Nutrition (పోషణ)
జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడం కోసం, దీర్ఘాయువు కోసం ఆహారంలో ఫైబర్ (పీచు పదార్థం) ను విపరీతంగా పెంచడం (Fiber maxing) అనేది 2026లో ప్రధాన హెల్త్ ట్రెండ్ కానుంది.

Outdoors (అవుట్‌డోర్స్)
రోజుకు 10 వేల అడుగులు నడవడమే కాకుండా, డిస్క్ గోల్ఫ్ , ఫ్రిస్బీ వంటి సామాజిక ఆటల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కమ్యూనిటీలుగా ఏర్పడి ఆరుబయట సమయం గడపడం పెరుగుతుంది.

Pets (పెంపుడు జంతువులు)
పెంపుడు జంతువులను కేవలం జంతువులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా చూసే ధోరణి మరింత పెరుగుతుంది. 2026లో ‘పెట్ పేరెంటింగ్’ శైలిలో మార్పులు రానున్నాయి. పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్, ఆర్గానిక్ ఆహారం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ‘పెట్ థెరపీ’ సెషన్లకు డిమాండ్ పెరుగుతుంది.

Quiet Travel (ప్రశాంత ప్రయాణాలు)
పర్యాటకులు.. రద్దీగా ఉండే ప్రదేశాల కంటే, ఏకాంతంగా,  ప్రశాంతంగా ఉండే ప్రాంతాల వైపు మొగ్గు చూపుతారు. దీన్నే 'క్వయిట్‌ ట్రావెల్‌’ అంటున్నారు. ధ్వని కాలుష్యం లేని ప్రాంతాలు, డిజిటల్ డిటాక్స్  అందించే రిసార్టులు 2026లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

Retail (రిటైల్)
ఆన్‌లైన్ షాపింగ్, ఆఫ్-లైన్ స్టోర్స్ కలయికతో ఫిజిటల్' అనుభవం కొత్త పుంతలు తొక్కుతుంది. షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఏఆర్ (ఏఆర్‌) అద్దాల ద్వారా దుస్తులను ట్రై చేయడం, క్యూలో నిలబడకుండా నేరుగా యాప్ ద్వారా చెల్లింపులు చేయడం వంటివి సాధారణం కానున్నాయి.

Sustainability (సుస్థిరత)
పర్యావరణంపై శ్రద్ధ కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలోకి వస్తుంది. వినియోగదారులు వస్తువులను కొనేముందు అవి పర్యావరణానికి ఎంత హాని చేస్తాయో  అనేది చూసి కొంటారు. కంపెనీలు కూడా రీసైకిల్ చేసిన ప్యాకేజింగ్‌ను విధిగా వాడాల్సి ఉంటుంది.

Tech (సాంకేతికత)
2026లో క్వాంటం కంప్యూటింగ్,  6G దిశగా పరిశోధనలు వేగవంతం అవుతాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)మన ఇళ్లలోని ప్రతి వస్తువును స్మార్ట్‌గా మారుస్తుంది. వ్యక్తిగత డేటా భద్రత కోసం మరిన్ని కఠినమైన సాంకేతిక నిబంధనలు అమల్లోకి వస్తాయి.

Urban Farming (నగరాల్లో వ్యవసాయం)
నగరాల్లో నివసించే వారు తమ మేడల మీద లేదా బాల్కనీలలో హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు పెంచుకోవడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారుతుంది.  కెమికల్స్ లేని ఆహారం కోసం జనం ఈ దిశగా అడుగులు వేస్తారు.

Virtual Reality (వర్చువల్ రియాలిటీ)
వీఆర్‌ టెక్నాలజీ  ఇకపై విద్య, వైద్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యార్థులు క్లాస్‌రూమ్‌లో కూర్చుని, ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా చారిత్రక కట్టడాలను వర్చువల్‌గా సందర్శించవచ్చు. అలాగే వైద్యులు సంక్లిష్టమైన సర్జరీల కోసం వీఆర్‌ సిమ్యులేషన్లను ఉపయోగిస్తారు.

Work-Life Balance (వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యత)
కంపెనీలు ‘ఫోర్ డే వర్క్ వీక్’ (వారానికి నాలుగు రోజులే పని) ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి  పెద్దపీట వేయడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని పలు సంస్థలు భావిస్తున్నాయి.

Xenotransplantation (జెనో-ట్రాన్స్‌ప్లాంటేషన్)
జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే ‘జెనో-ట్రాన్స్‌ప్లాంటేషన్’ రంగంలో 2026లో కీలక పురోగతి కనిపించవచ్చు. అవయవ దాతల కొరతను తీర్చేందుకు జన్యుమార్పిడి చేసిన జంతువుల అవయవాలపై పరిశోధనలు పెరిగే అవకాశం ఉంది.

Youth Activism (యువత క్రియాశీలత)
రాజకీయ, సామాజిక మార్పులలో యువత పాత్ర మరింత కీలకం కానుంది. సోషల్ మీడియా వేదికగా వారు లేవనెత్తే అంశాలు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయనున్నాయి.

Zero Waste (జీరో వేస్ట్)
చెత్తను పూర్తిగా తగ్గించే ‘జీరో వేస్ట్‌’ జీవనశైలిని జనం అలవాటు చేసుకుంటారు. ప్లాస్టిక్ బదులు తినగలిగే నీటి పాడ్స్ , భూమిలో కలిసిపోయే ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి ఇన్నోవేషన్లు మార్కెట్లోకి  రానున్నాయి. 2026వ సంవత్సరం మానవ మేధస్సు , పర్యావరణ స్పృహల కలయికగా ఉండనుంది. టెక్నాలజీ మన పనులను సులభతరం చేస్తే, పర్యావరణ పరిరక్షణ మన భవిష్యత్తును కాపాడనుంది.

ఇది కూడా చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement