అక్కడ 'చెత్త' ఆదాయంగా మారుతుంది..! | Bihars Lakhwa village turns household waste into income | Sakshi
Sakshi News home page

చెత్తను కొనుగోలు చేసే తొలి గ్రామం..అందుకోసం ఏకంగా యాప్‌..!

Dec 22 2025 11:13 AM | Updated on Dec 22 2025 1:16 PM

Bihars Lakhwa village turns household waste into income

చాలాచోట్ల పరిశుభ్రత, స్వచ్ఛ భారత్‌ అనే నినాదం మాటలకే పరిమితమైంది. కానీ కొన్నిచోట్ల కార్యరూపానికి నోచుకుని సరికొత్త విధానంతో మార్పుకి నాంది పలుకుతూ.. స్ఫూర్తిని కలిగిస్తోంది. అది ఒకరకంగా అటు పర్యావరణ పరంగా, ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది కూడా. ఇలాంటి వినూత్న మార్గాలు ఆదర్శంగానే కాదు యావత్తు దేశాన్ని క్లీన్‌ అండ్ గ్రీన్‌కి నిలయంగా ఉండేలా చేస్తాయి కూడా. అలాంటి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి..దేశంలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది ఈ గ్రామం. అంతేకాదు చెత్తతో సంపద సృష్టించి మొత్తం దేశాన్నే ఆకర్షించింది కూడా. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.

బిహార్‌లోని సివాన్ జిల్లాలోని లఖ్వా గ్రామ పంచాయతీ గృహ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చి..ఆదర్శం గ్రామంగా నిలిచింది. ఏకంగా మొబైల్‌ అప్లికేషన్‌తో గృహవ్యర్థాలను కొనుగోలు చేసిన తొలి గ్రామం కూడా ఇదే.  లోహియా స్వచ్ఛ బీహార్ అభియాన్ (LSBA) కింద ప్రారంభించిన ఈ చొరవ గ్రామస్తులు తమ గృహ వ్యర్థాల వివరాలను 'కబాద్ మండి' యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 

ఈ సమాచారం అందిన వెంటనే సంబంధిత ఏజెన్సీ  అస్రాజ్ స్కేప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యర్థాలను తూకం వేసి, నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా డబ్బులను తత్‌క్షణమే చెల్లిస్తుంది. ఈవ్యవస్థ ఒక రకంగా పారదర్శకత, సరళత, విశ్వసనీయతను నిర్థారిస్తుంది. ఇక్కడ వాళ్లు సేకరించిన వ్యర్థాలలో ప్రతిదానికి ఒక ఫిక్స్డ్‌ రేటు ఉంటుంది. దాంతో సులభంగా ప్రజలు ఈ విధానాన్ని ఉపయోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అక్కడ అధికారులు చెబుతున్నారు. 

రాష్ట్ర సమాచార, విద్య, కమ్యూనికేషన్‌ సలహాదారు(ఎల్‌ఎస్బీఏ) సుమన్‌ లాల్‌కర్న్‌ ప్రకారం..ఈ కార్యక్రమం విజయానికి దాని స్పష్టమైన ధరల విధానమేనని అన్నారు. దీనివల్ల గృహ వ్యర్థాల విభజన సులభమైందని కూడా  చెబుతున్నారు. ఇంతకీ వ్యర్థాల ధరలు వస్తువుల వారీగా ఎలా ఉంటాయంటే..

  • ప్లాస్టిక్ సీసాలు: కిలోకు రూ. 15

  • టిన్: కిలోకు రూ. 10

  • పెద్ద కార్డ్‌బోర్డ్: కిలోకు రూ. 8

  • మధ్యస్థ కార్డ్‌బోర్డ్: కిలోకు రూ. 6

  • తెల్లటి పాలిథిన్‌ కవర్లు(ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్‌ ఉండేవి): కిలోకు రూ. 5

  • చిన్న కార్డ్‌బోర్డ్: కిలోకు రూ. 4

  • కాగితం: కిలోకు రూ. 3

  • బ్లాక్‌ ప్లాస్టిక్: కిలోకు రూ. 2

సేకరించిన వ్యర్థాలను ఏం చేస్తారంటే..
సేకరించిన వ్యర్థాలను  ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు (PWMU), వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లకు (WPU) రవాణా చేస్తారు. ఆ తర్వాత వ్యర్థాలను ల్యాప్‌టాప్ బ్యాగులు, మహిళల పర్సులు, డైరీలు, కీ రింగ్‌లు, కప్‌బోర్డ్‌లు, బెంచీలు వంటి ఇతర మన్నికైన ఉత్పత్తులుగా రీసైకిల్ చేస్తారు. ఈ ప్రక్రియ పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా స్థానికులకు ఉపాధిని కూడా అందిస్తోంది

రాష్ట్రవ్యాప్త ప్రభావం
వ్యర్థాల నిర్వహణలో బిహార్‌ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని గ్రామీణాభివృద్ధి రవాణా మంత్రి శ్రావణ్ కుమార్ హైలైట్ చేశారు. ప్రస్తుతం, బీహార్‌లో దాదాపు 7 వేలకు పైగా గ్రామ పంచాయతీలలో వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లను, 171 ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేసింది. దీంతో వేల టన్నుల ప్లాస్టిక్‌ని రీసైకిల్‌ చేసి.. తిరిగి ఉపయోగించుకునేలా మార్చి.. బిహార్‌ స్వావలంబన, పరిశుభ్రతకు శ్రీకారం చుట్టింది. చెప్పాలంటే ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలిచింది. 

(చదవండి: అలాంటి ఇలాంటి పిల్లి కాదు..! నష్టాల్లో ఉన్న రైల్వేని గట్టేక్కించిదట..ఎలాగో తెలుసా..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement