పాట్నా: ‘అమ్మా,నాన్న. నన్ను క్షమించండి. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చితికి నిప్పు నా భర్తతో కాదు.. నా మూడేళ్ల కూతురితో పెట్టించండి’అంటూ ఓ మహిళా ఉపాధ్యాయురాలు బలవన్మరణం చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిహార్ రాష్ట్రం వైశాలీ జిల్లాకు చెందిన ప్రియా భారతి ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో భారతి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఇలా ఉంది.
‘అమ్మా,నాన్నా నన్ను క్షమించండి. నేను చనిపోతున్నాను. అనారోగ్య సమస్యల వల్ల ప్రాణం తీసుకుంటున్నాను. నా మరణానికి ఎవరూ కారణంగా కాదు.నాకు నచ్చినట్లు నా అంత్యక్రియలు నిర్వహించండి. నేను మరణించిన నా భౌతిక కాయాన్ని నా స్వగ్రామానికి తీసుకుని వెళ్లొద్దు. నా చితికి నా కుమార్తెతో నిప్పుపెట్టించండి.నా భర్తతో వద్దు. 5.5లీటర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. నా పర్సులో నుంచి తీసుకోండి. నా ఫోన్‌ని నాభర్తకు ఇవ్వండి. అందులో కొన్ని ఆడియో,వీడియో ఫైల్స్ ఉన్నాయి. ఫోన్ పాస్‌వర్డ్ ఏంటో నా భర్తకు తెలుసు.
నా వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వారందరికీ నేను క్షమాపణలు కోరుతున్నాను. పోస్టుమార్టం నిర్వహించవద్దని పోలీసులను అభ్యర్థిస్తున్నాను. నా భర్త, కుటుంబంపై ఎటువంటి కేసు నమోదు చేయద్దు. ఈ చర్య నా వ్యక్తిగత నిర్ణయం. అమ్మా, నాన్న, మీ కూతురు ఓడిపోయింది. క్షమించండి అమ్మా’అని నోట్‌లో రాశారు.
అయితే, భారతి కుటుంబ సభ్యులు అత్తింటి వారిపై ఆరోపణలు చేస్తున్నారు. భారతి తన భర్త దీపక్ రాజ్, అత్తింటివారి వేధింపులకు గురయ్యిందని, ఈ విషయాన్ని ఆమె తన తల్లికి కూడా చెప్పిందని తెలిపారు. కాగా, బాధితురాలి తల్లి తండ్రుల ఆరోపణలకు.. ఆత్మహత్యా లేఖలోని మాటలకు విరుద్ధంగా ఉండటం వల్ల కేసు మరింత క్లిష్టంగా మారింది.


