ఏటీఎం అంటే అందరికీ తెలిసింది డబ్బులు విత్‌డ్రా చేసుకునే మెషిన్ అని మాత్రమే. కానీ ఇకపై ధాన్యం కూడా ఏటీఎం నుంచి వస్తాయి. ఇప్పటికే ఇలాంటి ఏటీఎంలను బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది. ఇందులో ఏమేమి వస్తాయి అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్ట్ కింద, బీహార్ ప్రభుత్వం పాట్నాలో మూడు ధాన్యం ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. నిజానికి మనదేశంలో మొట్టమొదటి ధాన్యం ATM.. 2024 ఆగస్టులో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మొదలైంది. ఇప్పుడు బీహార్‌లో కూడా ఈ ప్రయోగం ప్రారంభించనున్నారు.
ధాన్యం ATM అనేది పూర్తిగా ఆటోమేటెడ్ యంత్రం. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాల ద్వారా తమను తాము ధృవీకరించుకుంటారు. ఆ తరువాత బియ్యం, గోధుమలు వంటి అవసరమైన ధాన్యం సెలక్ట్ చేసుకుంటారు. ఎంపిక చేసుకున్నదాన్ని బట్టి.. ఆ మెషిన్ ధాన్యం అందిస్తుంది. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా డిజిటల్‌గా పూర్తవుతాయి.
ఒక ధాన్యం ATM ఐదు నిమిషాల్లో 50 కిలోల వరకు ధాన్యాన్ని పంపిణీ చేయగలదు. గంటకు కేవలం 0.6 వాట్స్ విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది. సోలార్ ఫలకాలు & ఇన్వర్టర్లతో కూడా నడిచే విధంగా వీటిని రూపొందించారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు.
బీహార్‌లో ప్రస్తుతం 8.5 కోట్లకు పైగా PDS లబ్ధిదారులు ఉన్నారు. 50,000కి పైగా రేషన్ దుకాణాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ధాన్యం ATMలు ప్రవేశపెట్టడం వల్ల అక్రమ రవాణా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ డీలర్లు తక్కువ ధాన్యం ఇవ్వడం.. లేదా బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం వంటి సమస్యలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని నిపుణుల అభిప్రాయం.


