ఆయన్ను బిహార్ నుంచి రాజ్యసభకు పంపే అవకాశం
ఏప్రిల్‌లో ఖాళీ కానున్న స్థానం నుంచి ఎంపిక చేసే చాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ మరికొద్ది నెలల్లో రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం బిహార్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నబీన్‌ను ఏప్రిల్‌లోనే రాజ్యసభకు ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన సొంత రాష్ట్రమైన బిహార్ నుంచే ఆయన ఎంపిక ఉండవచ్చని తెలుస్తోంది.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబీన్ ఇన్నాళ్లూ బిహార్‌లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ బంకీపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అసెంబ్లీకి హాజరవ్వడం అంత సులభమేమీ కాదు.
అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్వంద్వ పాత్రలు పోషించడం కష్టమని భావిస్తున్నారు. ఆయనను రాజ్యసభకు పంపడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో ఇదే మాదిరిగా మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాజ్యసభకు పంపిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నాయి. వచ్చే ఏప్రిల్‌లో బిహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఖాళీ అవుతున్న స్థానాల్లో రెండింటిని బీజేపీ తీసుకొని, మిగతా మూడింటిని కూటమి పార్టీలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. తమ రెండింటిలో ఒక స్థానం నుంచి నబీన్‌ను రాజ్యసభకు పంపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో స్థానం నుంచి భోజ్‌పురి నటుడు పవన్ సింగ్‌కు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


