'మొహ‌మ్మ‌ద్‌ దీప‌క్' క‌ష్టాలు! | How Mohammad Deepak life turns after republic day incident | Sakshi
Sakshi News home page

జిమ్ అద్దె 40 వేలు.. లోన్ 16 వేలు..

Feb 11 2026 6:29 PM | Updated on Feb 11 2026 6:44 PM

How Mohammad Deepak life turns after republic day incident

'మొహ‌మ్మ‌ద్‌ దీప‌క్' గుర్తున్నాడా? జ‌న‌వ‌రి 26న జ‌రిగిన సంఘ‌ట‌న‌తో అత‌డు పేరు దేశం మొత్తం మారుమోగింది. 70 ఏళ్ల ముస్లిం వ్యక్తికి అండగా నిల‌బ‌డి వార్త‌ల్లో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ (video viral) కావ‌డంతో అత‌డి గురించి అంద‌రికీ తెలిసింది. అత‌డి ధైర్యాన్ని ప్ర‌శంసిస్తూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా మెచ్చుకున్నారు.

38 ఏళ్ల దీప‌క్ కుమార్ ఉత్త‌రాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో హ‌ల్క్ పేరుతో జిమ్ న‌డుపుతున్నాడు. రిప‌బ్లిక్ డే నాడు బజరంగ్ దళ్‌కు చెందిన కొంత‌మంది.. దుకాణం పేరు మార్చాలంటూ ముస్లిం వృద్ధుడిపై ఒత్తిడి తెచ్చారు. పార్కిన్స‌న్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ముస‌లాయన కొంచెం స‌మ‌యం కావాల‌ని వారిని అభ్య‌ర్థించాడు. అయినా వారు వినిపించుకోకుండా వాద‌న‌కు దిగ‌డంతో అక్క‌డే ఉన్న దీపక్ కుమార్ క‌ల‌గ‌జేసుకున్నాడు. బజరంగ్ దళ్ కార్య‌క‌ర్తలు త‌న‌ పేరేంట‌ని అడ‌గ‌డంతో మొహ‌మ్మ‌ద్‌ దీప‌క్ (Mohammad Deepak) అని స‌మాధానం ఇచ్చాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయింది. బీబీసీ స‌హా ప‌లు వార్తా సంస్థ‌లు అత‌డిని ఇంట‌ర్వ్యూ చేశాయి. మాన‌వ‌త్వంతోనే ముస్లిం వృద్ధుడికి అండ‌గా నిల‌బ‌డ్డాన‌ని దీప‌క్ చెప్పాడు. మ‌నుషులంతా స‌మాన‌మేన‌ని, మ‌న‌మంతా సోద‌ర భావంతో మెల‌గాల‌ని ఆకాంక్షించాడు.

జ‌నం చప్పట్లు కొట్టరు
జ‌న‌వ‌రి 26 ఘ‌ట‌న త‌ర్వాత దీప‌క్‌కు ప్ర‌శంస‌ల‌తో పాటు చిక్కులు ఎదుర‌య్యాయి. కోట్‌ద్వార్‌లో (Kotdwar) సంఘీభావంతో పాటు నిర‌స‌నను ఎదుర్కొవాల్సి వ‌చ్చింది. కొంత మంది అత‌డిని స‌మ‌ర్థించ‌గా, మ‌రికొంత మంది వ్య‌తిరేకించారు. జనవరి 31న, బజరంగ్ దళ్ సభ్యులు దీపక్‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో పోలీసులు వారిని చెద‌ర‌గొట్టారు. ''కోట్‌ద్వార్‌ పట్టణంలో సగం మంది నన్ను సమర్థిస్తారు, కానీ మీరు మంచి పనులు చేసినప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టరు. నిజాయితీకి మూల్యం చెల్లించాల్సి రావచ్చు" అని ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అన్నారు.

150 నుంచి 15కు డౌన్‌
మ‌రోవైపు దీప‌క్ జిమ్‌ను వ‌చ్చే వారి సంఖ్య బాగా త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు రోజుకు 150 మంది వ‌చ్చేవార‌ని, ఇప్పుడు క‌నీసం 15 మంది కూడా రావ‌డం లేద‌ని దీప‌క్‌ వాపోయాడు. ''ఆ ఘ‌ట‌న త‌ర్వాత నా జిమ్‌కు రావ‌డానికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. వాళ్ల భ‌యం నాకు అర్థ‌మైంది. నెలకు రూ. 40,000 అద్దెతో జిమ్ (Gym) నిర్వ‌హిస్తున్నాను. అదీగాక ఈ మ‌ధ్య‌నే ఇల్లు కూడా క‌ట్టుకున్నాను. దీనికి నెలవారీ రూ. 16,000 రుణాన్ని చెల్లిస్తున్నాను. నాకున్న ఆదాయ‌మార్గం జిమ్ ఒక‌టే. స‌భ్యుల సంఖ్య బాగా త‌గ్గ‌డంతో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌''ని దీప‌క్ వాపోయాడు.

జాన్ బ్రిట్టాస్ సంఘీభావం 
దీప‌క్ కుమార్‌కు రాజ్యసభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నాయకుడు జాన్ బ్రిట్టాస్ (John Brittas) సంఘీభావం ప్ర‌క‌టించారు. ఈ నెల 8న కోట్‌ద్వార్ ప‌ట్ట‌ణానికి వ‌చ్చి దీపక్‌తో పాటు మొహ‌మ్మ‌ద్‌  బాబా డ్రెస్ షాప్‌ యజమాని వకీల్ అహ్మద్‌ను క‌లిశారు. మతతత్వ శక్తుల బెదిరింపుల కారణంగా దీప‌క్ జిమ్‌కు వ‌చ్చే వారి సంఖ్య త‌గ్గడంతో తాను స‌భ్య‌త్వం తీసుకున్న‌ట్టు ఎక్స్‌లో వెల్ల‌డించారు జాన్ బ్రిట్టాస్.

చ‌ద‌వండి: మ‌నం ఎవ‌రికి కృతజ్ఞతగా ఉండాలి?

''మత సామరస్యాన్ని గౌరవించే రాష్ట్రమైన కేరళ త‌ర‌పున‌ శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను కోట్‌ద్వార్ ప‌ట్ట‌ణానికి వెళ్లాను. దీపక్‌ను మాత్రమే కాకుండా అతడి తల్లి, భార్య, బిడ్డను కూడా కలిశాను. జీవనోపాధి కోసం టీ అమ్ముకునే అతని తల్లి అందించే వేడి అల్లం టీ తాగాను. మతపరమైన అంశాల బెదిరింపుల కారణంగా ఇప్పుడు నిర్జనమై ఉన్న అతని జిమ్‌ను సందర్శించి సభ్యత్వం తీసుకున్నాను. ముహమ్మద్ బాబా వస్త్ర దుకాణాన్ని కూడా సందర్శించి కొన్ని కొనుగోళ్లు చేశాను. దీపక్‌పై కేసు నమోదు చేసిన కోట్‌ద్వార్ పోలీస్ స్టేషన్‌లో బలమైన నిరసన తెలియ‌జేశాను. 'ముహమ్మద్' దీపక్‌గా రూపాంతరం చెందిన దీపక్ కుమార్ కేవలం ఒక వ్యక్తి కాదు.. అతడు భ‌విష్య‌త్ విశ్వాసానికి వజ్ర-ప్రకాశవంతమైన కాంతి'' అంటూ జాన్ బ్రిట్టాస్ ఎక్స్‌లో పేర్కొన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement