మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి? | Spiritual story: Which service is better and Who should we be grateful | Sakshi
Sakshi News home page

ఏ సేవ మంచిది.. ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?

Feb 9 2026 11:04 PM | Updated on Feb 9 2026 11:04 PM

Spiritual story: Which service is better and Who should we be grateful

ఆధ్యాత్మికథ

ఒక చెరుకు వ్యాపారి డబ్బు బాగా గడించాడు. వయసు మీద పడటంతో మనసు చిన్నగా ఆధ్యాత్మికం వైపు మళ్ళింది. గుడులూ గోపురాలూ తిరిగాడు. నదీ స్నానాలు చేశాడు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాడు. అలా చేస్తున్న క్రమంలో అతడికి హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది.

అదేమిటంటే ‘ఏ సేవ మంచిది, మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?’ అని. సమాధానం కొరకు ప్రయత్నించాడు. సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. వారి ఊరికి చాలా దూరంగా ఉన్న గుట్టమీద ఒక సాధువు ఉన్నాడని తెలిసింది. ఆయన్ని అడిగితే సమాధానం దొరుకుతుందని బయలుదేరాడు. దారి సరిగా తెలియక అవస్థలు పడ్డాడు. అప్పటికే బాగా చీకటయ్యింది. వ్యాపారికి ఆ చీకట్లో నడవడం కష్టంగా తోచింది.

దారిలో ఒక రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని వ్యాపారిని ప్రశ్నించాడు. తను వెళ్తున్న విషయం చెప్పాడు వ్యాపారి. ‘ఆ గుట్టపైకి వెళ్ళడానికి పగలే కష్టంగా ఉంటుంది. రాత్రయింది కాబట్టి మరింత కష్టం. అందులోనూ పురుగూపుట్రా ఉంటాయి. నేను మీకు తోడుగా వస్తాను’ అని చెప్పి లాంతరు పట్టుకుని బయలుదేరాడు. ఎలాగైతేనేం గుట్ట చేరారు. సాధువును కలిశారు. తను వచ్చిన విషయం చెప్పా వ్యాపారి.

‘బాగా రాత్రయ్యింది. అలసిపోయి ఉన్నారు. ఇద్దరూ శుభ్రంగా భోజనం చేసి నిద్రపొండి, ఉదయం మాట్లాడుకుందాం’ అని చెప్పాడు సాధువు. ఇద్దరూ అలాగేనని ఒప్పుకున్నారు. తెల్లారిందే లేదో గబగబా నిద్ర లేచిన రైతు పొలం పని ఉంది, నేను బయలుదేరుతాను’ అన్నాడు.

వెంటనే వ్యాపారి ‘‘చీకట్లో ఉన్న నాకు చాలా మంచి సహాయం చేశారు. మీరు లాంతరుతో తోడు రాకుంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాణ్ణి. మీరు చేసిన సహాయం నా జీవితకాలం మరచిపోను’’ అని చెప్పి పడీపడీ నమస్కరిస్తూ అతడిని సాగనంపాడు.

చ‌ద‌వండి: సంక్షోభంలో స్థిర‌త్వం

సాధువు చిరునవ్వు ముఖంతో వ్యాపారిని దగ్గరికి పిలిచి ‘ఒక్క రాత్రి, చీకటిలో ఉన్న నీకు లాంతరు సాయం చేశాడని అతడిని ప్రముఖ వ్యక్తిగా ఆదరిస్తున్నావు. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటినుంచి చీకటిలో ఉన్న నీకు ఆరని దీపంలాగా, నీ ఆలనాపాలనా చూసి, మంచి చెడ్డలు నేర్పించారు నీ అమ్మానాన్నలు. ఎన్నో కష్టాలకు ఓర్చి విద్యాబుద్ధులు నేర్పి నిన్ను ఇంతవాడిగా చేసిన అమ్మానాన్నలకి చేసే సేవకన్నా వేరే ఏ సేవా గొప్పదికాదు, వారికి కృతజ్ఞతగా  ఉండటానికి మించింది ఏదీ లేదు’ అని హితవు చెప్పాడు.

‘నిజమే, నిరంతరం తను కాలుతూ వెలుగునిచ్చే దీపంలాగా మన జీవితాలకు వెలుగునిచ్చే అమ్మా నాన్నలకు మించిన గొప్పవారు ఎవరు ఉంటారని’ తెలుసుకున్న వ్యాపారి అక్కడినుంచి కదిలాడు.
– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement