ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ? | Viral Penguin Story Full Details Telugu | Sakshi
Sakshi News home page

Penguin Story: పూరీ చాన్నాళ్ల క్రితమే చెప్పాడు.. పెంగ్విన్ స్టోరీ పాతదే కానీ

Jan 24 2026 4:47 PM | Updated on Jan 24 2026 5:14 PM

Viral Penguin Story Full Details Telugu

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో 'పెంగ్విన్' స్టోరీ ఒకటి తెగ వైరల్ అవుతోంది. కొన్ని పెంగ్విన్స్ గుంపుగా సముద్రం వైపు వెళ్తుండగా.. ఒకటి మాత్రం ఒంటరిగా మంచు పర్వతాల్లోకి వెళ్తున్న వీడియో ఇది. చాలామంది దీనికి రిలేట్ అవుతున్నారు. తమని తాము ఆ ఒంటరి పెంగ్విన్‌లో చూసుకుంటున్నారు. ఇంతకీ ఈ సింగిల్ పెంగ్విన్ స్టోరీ ఏంటి? అసలేమైంది?

(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)

పెంగ్విన్ వీడియో.. సాధారణ వైరల్ వీడియో అయితే కాదు. దీని వెనక పెద్ద బ్యాక్ స్టోరీనే ఉంది. టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఐదేళ్ల క్రితం తన మ్యూజింగ్స్‌లో ఒంటరి పెంగ్విన్ గురించి చెప్పుకొచ్చాడు. సందర్భం ఏంటో తెలీదు గానీ ఇప్పుడు మరోసారి అది వైరల్ అవుతోంది. అంటార్కిటికాలో పెంగ్విన్స్ అన్నీ నివసిస్తుంటాయి. వీటి జీవన విధానం చాలా సింపుల్. సముద్రంలో ఉంటాయి. లేదంటే కాలనీల్లో ఉంటూ మిగతా పెంగ్విన్స్‌తో కలిసి పిల్లల్ని కంటూ ఉంటాయి. ట్రెండింగ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్ వెనక మాత్రం కళ్లు చెమర్చే కథ ఉందట! మనుషులకే పరిమితమైన ప్రేమ, విరహం, వైరాగ్యం అనే ఎమోషన్స్ మూగజీవుల్లోనూ ఉంటాయని ఈ పెంగ్విన్ స్టోరీ చెప్పకనే చెబుతోంది.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెప్పిన దానిబట్టి చూస్తే.. సాధారణంగా మగ పెంగ్విన్ తన భాగస్వామి పట్ల చాలా నమ్మకంగా ఉంటుంది. ఒకసారి జత కుదిరితే చనిపోయే వరకు ఆ బంధాన్ని వదులుకోదు. ఒకవేళ ఆడ పెంగ్విన్.. ఆ నమ్మకాన్ని వంచిస్తే లేదా బంధాన్ని బ్రేక్ చేస్తే మాత్రం మగ పెంగ్విన్ ఆ వియోగాన్ని తట్టుకోలేదు. ఈ ఒంటరి పెంగ్విన్ కూడా అలానే బంధం నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. అందుకే మిగతా వాటితో కాకుండా ఒంటరిగా పర్వతాల వైపు వెళ్లదలుచుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెంగ్విన్ వీడియో బిట్.. 2007లో ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన 'ఎన్‌కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' అనే డాక్యుమెంటరీలోనిది. పరిశోధకుడు డాక్టర్ ఐన్లీతో కలిసి వెర్నర్.. అంటార్కిటికాలో ఓ పెంగ్విన్ గుంపుని గమనించినప్పుడు.. ఈ ఒంటరి పెంగ్విన్‌ని చూశారు. మిగతా పెంగ్విన్లు అన్నీ సముద్రం వైపు ఆహారం కోసం కదులుతుంటే..ఈ ఒంటరి పెంగ్విన్ మాత్రం కాసేపు అక్కడే ఆగిపోయింది. వెనక్కి తిరిగి దాదాపు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న మధ్యభాగం వైపు నడవటం మొదలుపెట్టింది. అది దారితప్పిందేమో అనుకుని తీసుకొచ్చి గుంపులో కలిపినా  తిరిగి పర్వత ప్రాంతాల వైపు వెళ్లింది. దీంతో ఏదో విషయంలో అది మోసపోయిందని, జీవితంలో బాగా విసిపోయిందని.. అందుకే ఒంటరి దారిని ఎంచుకుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రేమలో విఫలమైందని అంటున్నారు.

సోషల్ మీడియా.. ఈ ఒంటరి జీవికి 'నిహిలిస్ట్ పెంగ్విన్' అని పేరు పెట్టింది. ప్రస్తుతం జీవితం చాలా ఒత్తిడిగా మారిపోయిందని భావించే చాలామంది.. తమని తాము ఈ పెంగ్విన్‌లో చూసుకుంటున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. పోటీతత్వం, బాధ్యతలు, జీవితంలో అలసట వల్ల 'ఇక చాలు' అని విషయాన్ని ఆ పెంగ్విన్ ప్రవర్తన ప్రతిబింబిస్తోందని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఓ ఒంటరి పెంగ్విన్ వీడియో.. ఇంతలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషమే!

(ఇదీ చదవండి: మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement