శోభిత తెలుగమ్మాయే. కానీ దాదాపు పదేళ్ల కెరీర్‌లో రెండే తెలుగు సినిమాలు చేసింది. కానీ అక్కినేని కోడలు అయిన తర్వాత ఈమె ముందు కంటే బాగానే ఫేమస్ అయిపోయింది. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె చేసిన సినిమా 'చీకటిలో'. థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? అక్కినేని కోడలు హిట్ కొట్టిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)
కథేంటి?
క్రిమినాలజీ చదివిన సంధ్య(శోభిత).. ఓ న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ వార్తలు చదివే యాంకర్‌గా పనిచేస్తుంటుంది. చేస్తున్న ఉద్యోగంపై పెద్దగా ఆసక్తి ఉండదు. సొంతంగా పాడ్‌కాస్ట్ ఛానెల్ ప్రారంభించాలనేది ఈమె గోల్. మరోవైపు అమర్ (విశ్వదేవ్ రాచకొండ)తో ప్రేమలో ఉంటుంది. పెళ్లికి కూడా వీళ్లిద్దరూ రెడీ అవుతుంటారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ రోజు సంధ్య సహొద్యోగి బాబీ(అదితీ మ్యఖల్) హత్యకు గురవుతుంది. ఇంతకీ ఈమెని చంపింది ఎవరు? 25 ఏళ్ల క్రితం గోదావరి జిల్లాల్లో జరిగిన వరస హత్యలకు.. బాబీ చావుకు ఏమైనా సంబంధం ఉందనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా అనగానే స్టోరీ ఏంటనేది ఓ అంచనా ఏర్పడుతుంది. 'చీకటిలో' కూడా దాదాపు అదే శైలిలో తీశారు. హత్యలు జరగడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇలా చాలా విషయాలు రొటీన్‌గానే అనిపిస్తాయి. జానర్ పరంగా చూస్తే మాత్రం ఇదో మాములు స్టోరీలానే అనిపిస్తుంది. కాకపోతే ఇందులో సామాజిక అంశాన్ని చూపించిన విధానం బాగుంది.
అత్యాచారాలకు ముగింపు ఇవ్వాలంటే.. ధైర్యంగా బయటకు వచ్చి తమపై అత్యాచారం జరిగిందని చెప్పే గొంతుక కావాలి. బాధితులు ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ పాయింట్ పరంగా చూస్తే మాత్రం 'చీకటిలో' కాస్త భిన్నంగా అనిపిస్తుంది. అసలు విషయానికొస్తే.. శోభిత పరిచయం, హత్యలు జరగడం లాంటి అంశాలతో సినిమాని చాలా ఫ్లాట్‌గా మొదలుపెట్టారు. దాదాపు గంటవరకు అలానే వెళ్తుంది. శోభిత, పోలీసులతో కలిసి చేసే ఇన్వెస్టిగేషన్ అయితే ఏ మాత్రం ఆసక్తి కలిగించదు. ఇప్పటికే చాలా సినిమాల్లో ఇదంతా చూసేశాం అనే ఫీలింగ్ కలిగిస్తుంది.
కానీ చివరి అరగంట మాత్రం బాగుంది. రెగ్యులర్‌గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లు కూడా సీరియల్ కిల్లర్ ఎవరనేది ఊహించడం కష్టం. ఎందుకంటే హీరోయిన్ చుట్టుపక్కనే అతడు ఉంటాడు. కానీ చివరివరకు అతడు ఎవరనేది తెలియనివ్వలేదు. అలానే చిన్నతనంలో జరిగే లైంగిక వేధింపులు, పెద్దయిన తర్వాత కూడా జీవితంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అనే విషయాన్ని బాగానే చూపించారు. మహిళలపై అత్యాచారం, హత్యలు లాంటి సీన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు వల్గారిటీ జోలికి పోలేదు. ఎక్కడ అసభ్యతగా అనిపించదు.
ఇలా పాజిటివ్స్ పరంగా చాలా అంశాలు ఉన్నప్పటికీ నెగిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. క్లైమాక్స్, సీరియల్ కిల్లర్ ఎవరనేది రివీల్ చేసినప్పడు తప్పితే మిగతా విషయాల్లో అస్సలు థ్రిల్ అనిపించదు. శోభిత చేసే ఇన్వెస్టిగేషన్ అయితే మరీ లాజిక్‌లెస్‌గా ఉంటుంది. పోలీసులు బొమ్మల్లా ఉంటారు. ఈమెకు మాత్రం అన్ని ప్రూఫ్స్ దొరికిపోతుంటాయి. ఇది మాత్రం కన్విన్సింగ్‌గా అనిపించలేదు.
ఎవరెలా చేశారు?
చాన్నాళ్ల తర్వాత శోభిత చేసిన తెలుగు సినిమా ఇది. సంధ్య పాత్రలో పద్ధతిగా చుడీదార్, చీరల్లో కనిపించింది. సెటిల్డ్ యాక్టింగ్ చేసింది. పాత్రకు ఎంత కావాలో అంతే చేసింది. డబ్బింగ్ కూడా బాగుంది. విశ్వదేవ్ రాచకొండ, ఇషా చావ్లా, ఆమని, ఝాన్సీ, రవీంద్ర విజయ్ లాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్లలో ఒక్కరికి కూడా ఆకట్టుకునే అవకాశం దొరకలేదు. మూవీ అంతా దాదాపు శోభిత చుట్టూనే తిరగడం దీనికి కారణం కావొచ్చు.
టెక్నికల్ విషయాలకొస్తే.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీకి తగ్గట్లు ఉంది. టైటిల్‌కి తగ్గట్లు సినిమా చాలావరకు చీకటిలోనే ఉంటుంది. అందుకు తగ్గట్లే సినిమాటగ్రఫీ ఉంది. దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ తప్పితే మిగతాది అంతా రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే 'చీకటిలో' మరో మంచి థ్రిల్లర్ అయ్యిండేది. కుటుంబంతోనూ కలిసి ఈ సినిమా చూడొచ్చు.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!)


