డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ సినిమా "కాన్ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్‌కు కాస్తున్నాయి. అవును, బటన్ నొక్కితే చాలు లిమిట్ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్ చేస్తూనే ఉంది.
డబ్బులు ప్రింట్ చేసే మిషన్
సోమవారం సాయంత్రం కాన్‌సిటీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్‌లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్‌ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.
చేతులు మారిన యంత్రం
దాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్ కనిపిస్తుంది. బటన్ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్‌గా మిషన్ కనిపించకుండా పోతుంది.
వీధిలో నోట్ల వర్షం
ఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్ సిటీ చూడాల్సిందే! హరీశ్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ మూవీకి సేన్ రోల్డన్ సంగీతం అందించాడు. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్ తెలుగులో తీసుకురానుంది.


