దక్ష ప్రజాపతికి తన కూతురు సతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒక మహాయాగాన్ని నిర్వహించినప్పుడు సతీదేవిని, మహాశివుడిని ఆహ్వానించడు. పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞాన్ని చూడాలనే కోరికతో శివుడు నిరాకరించినప్పటికీ సతీదేవి అక్కడికి వెళుతుంది. తండ్రి చేసిన అవమానంతో యజ్ఞగుండంలోకి వెళ్లి, ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ స్థలమే దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ సమీపంలోని కంఖాల్ ప్రాంతంలో ఉన్న దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించి నాటి పౌరాణిక విశేషాలు తెలుసుకోవచ్చు. శివరాత్రి రోజులలో అత్యంత ప్రాచీన ఆలయాల సందర్శనకు,ఆధ్యాత్మిక విషయాల అవగాహనకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతంది..
శక్తి పీఠాల కథకు ఆది
ప్రధాన ఆలయం లోపల ఉన్న సతీకుండ్ అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. పౌరాణిక కథనాల ప్రకారం ఈ యజ్ఞగుండంలోనే సతీదేవి అగ్ని ప్రవేశం చేసి ఆత్మార్పణం చేసుకుందని విశ్వాసం ఉంది. ఈ ఘటన తరువాత మహాశివుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేయగా, విశ్వ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడని పురాణాలు చెబుతాయి.
అవి మొత్తం 108 భాగాలు కాగా, వాటిలో ముఖ్యమైన 54 భాగాలు, మరీ ముఖ్యమైన 18 భాగాలే ఈ శక్తి పీఠాల కథకు మూలంగా భావించే ప్రదేశంగా ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని భక్తులు నమ్ముతారు. ఆలయ ్ర΄ాంగణంలో అనేక ఉ΄ాలయాలు, పవిత్ర వృక్షాలు దర్శనమిస్తాయి. మరోవైపు గంగానది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తుంది. ఇక్కడ భక్తులు పితృకార్యాలు, నదీ పూజలు, పిండప్రదానాలు నిర్వహిస్తారు.
అహంకారానికి అంతం
దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయ సముదాయంలో దశ మహావిద్య ఆలయం, బ్రహ్మేశ్వర్ మహాదేవ్ ఆలయం, శని ఆలయం, శ్రీరాముడి దర్బార్, శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు రుద్రాక్ష చెట్టును కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని పూర్తిగా దర్శించాలంటే కనీసం రెండు నుండి మూడు గంటల సమయం వెచ్చించాలి. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివుడు తన అత్తారింటికి వస్తాడని నమ్మకం ఉంది. శివరాత్రి రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ కాలంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksha Mahadev Temple) ఒక ఆలయం మాత్రమే కాదు అహంకారానికి ముగింపు ఉంటుందని తెలియజేసే పవిత్ర స్థలం. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక భూమి. శక్తి పీఠాల కథతో ముడిపడిన పవిత్ర ప్రదేశంగా భక్తుల విశ్వాసంలో నిలిచింది.
ఇలా చేరుకోవచ్చు..
దక్షేశ్వర మహాదేవ్ ఆలయం సమీప రైల్వే స్టేషన్- హరిద్వార్
సమీప విమానాశ్రయం- డెహ్రాడూన్.
హరిద్వార్ నుండి 35 కి.మీ. రోడ్ వే ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
తక్కువ ధర, ఆశ్రమాల వంటి ఉచిత వసతితో సహా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి
ఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే లభిస్తుంది.
గంగానది ఒడ్డున
హరిద్వార్ (Haridwar) భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక మతపరమైన ప్రాచీన నగరం. హిందువులకు పవిత్ర స్థలం. అనేక దేవాలయాల సముదాయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇది హిందువుల ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దక్షేశ్వర మహాదేవ్ హరిద్వార్‌లోని అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది హరిద్వార్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కంఖల్‌లో ఉంది.
సలేశ్వరం ప్రకృతి రమణీయత
శివరాత్రి నుంచి గుర్తు పెట్టుకోవాల్సిన సందర్శన స్థలాల జాబితా తయారుచేసుకుంటే అందులో చేర్చాల్సిన పర్యాటక ప్రాంతం ‘సలేశ్వరం.’ ప్రకృతి ఏర్పాటు చేసిన ఈ ప్రాంత సందర్శన మనలో ఒక ఉత్తేజాన్ని, శక్తిని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం క్షేత్రానికి దగ్గరలో.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువై ఉన్న యాత్రా స్థలం ఇది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం.
శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్లు వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లోయలో ఉన్న గుహలో లింగ రూపంలో దర్శనమిస్తాడు. సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడి జలపాతానికి సందర్శకులు ముగ్ధులు అవుతుంటారు. లోయలోకి ట్రెక్కింగ్ చేసేవారికి అనుకూలం. లోయ అడుగు భాగంలో ఉన్న శివయ్యను దర్శించుకోవాలంటే గుట్టల మధ్య నుంచి కిందుగా కాలి నడకన ప్రయాణించాల్సి ఉంటుంది.
ఆ దారిలో ఎన్నో గుహల నుండి జాలువారే సన్నని జల ధారలు కనిపిస్తూ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అడుగు భాగంలో ఉన్న గుండం చేరుకున్నాక పైకి చూస్తే .. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి.. మధ్యలో మనం.. తెలియని అనుభూతికి లోనవుతాం.
గుండంలోని నీళ్లు అతి చల్లగా, స్వచ్ఛంగా, రుచిగా ఉంటాయి. స్థానిక చెంచులు ఇక్కడ పూజారులుగా ఉంటారు. చైత్ర పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేష పూజలు జరుపుతారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో 150 కి.మీ దూరంలో పరహాబాద్ వస్తుంది. అక్కడి నుంచి మరో 32 కిలో మీటర్ల దూరం దట్టమైన అడవిలోకి వెళ్లాలంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అమర్‌నాథ్ నమ్మకమే శాశ్వతం
హిమాలయాల మధ్యలో అమర్‌నాథ్ మంచు గుహలో మహాశివుడు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. సహజంగా ఏర్పడే ఈ లింగం జీవితం శాశ్వతం కాదు అని, నమ్మకం, విశ్వాసమే శాశ్వతం అని గుర్తు చేస్తుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు. అమర్‌నాథ్ యాత్ర అనేది శరీరానికి పెద్ద పరీక్ష లాంటిది.
పలుచని గాలి, తీవ్రమైన చలి, చుట్టూ సంపూర్ణ నిశ్శబ్దం – ఇవే యాత్రలో భక్తులకు ఎదురయ్యే సవాళ్లు. అందుకే తొలిసారి అమర్‌నాథ్ యాత్ర చేపట్టిన వారు మొదట్లో కాస్త తటపటాయించినా, భోళాశంకరుడు తన భక్తుడికి కావాల్సిన మనోధైర్యం, శారీరక శక్తిని అందిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రయాణంలో మాటలు తగ్గిపోతాయి. ప్రతి శ్వాస లెక్కతోనే సాగుతుంది. అయినా లక్షలాది మంది ఈ మార్గంలో నడుస్తారు.
అద్భుతం కోసమో, అడ్వెంచర్ కోసమో కాదుం పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఇలా శివయ్యను దర్శించుకుంటారు. ఈ యాత్రలో ప్రయాణాన్ని బాధగా కాకుండా తత్త్వబోధనగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి అడుగు ఒక ధ్యానం. నిశ్శబ్దం మనలో ఉన్న అహంకారాన్ని కరిగిస్తుంది. మంచు మన మనసు కూడా తెల్లగా, స్వచ్ఛంగా ఉండాలి అని బోధిస్తుంది. లింగం కరిగిపోతుంది కానీ అనుభూతి మాత్రం మనసులో మిగిలిపోతుంది. అదే అమర్‌నాథ్ గుహాలయం చెప్పే సారాంశం. అదే శివతత్వం.
కేదార్‌నాథ్ క్షేత్రం ఓ సందేశం
ప్రతి సంవత్సరం సుమారు ఆరు నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మంచు పొరల కింద నిశ్శబ్దంగా నిద్రపోతుంది. నిత్య పూజలు జరగవు. భక్తుల సందడి, రాకపోకలు ఉండవు. అయినప్పటికీ మహాశివుడు అక్కడే ఉన్నాడని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.
ఇక్కడ శివుడిని ఉనికిగా కాకుండా, లేమిగా పూజిస్తారు. అంటే ప్రత్యక్ష దర్శనం లేకపోయినా భక్తి ఆగదనే భావానికి కేదార్‌నాథ్ ఒక జీవంత ఉదాహరణగా నిలుస్తుంది. వేసవిలో ఆలయం మళ్లీ తెరుచుకున్నప్పుడు భారీ ఉత్సవాల కంటే ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి దీపోత్సవం నిశ్శబ్దంగా జరిగినా, ఆ దీపం ఆలయ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రారంభాన్ని ఒక పండగగా కాకుండా ఆధ్యాత్మిక యాత్రకు నాందిగా భావిస్తారు.
ఆ తరువాతే తీర్థయాత్రికుల రాక ప్రారంభమవుతుంది. భక్తి అంటే దేవుడిని ప్రతిరోజూ దర్శించుకోవడమే కాదు. ఆలయానికి నిత్యం వెళ్లడమే కాదు. దూరంగా ఉన్నా దేవుడిని స్మరించడమే నిజమైన భక్తి అని ఈ క్షేత్రం సందేశం ఇస్తుంది. అందుకే ఆలయం మూసి ఉన్న కాలం ముగిసిన వెంటనే భక్తులు దేశం నలుమూలల నుంచి కేదార్‌నాథ్ దర్శనం కోసం తరలివస్తారు.
ఈ ఏడాది ఆలయం తెరుచుకునే తేదీ 2026 సంవత్సరంలో కేదార్‌నాథ్ ఆలయం ఏప్రిల్ 22న ఉదయం సుమారు 7 గంటలకు భక్తుల దర్శనానికి తెరుచుకోనుంది. అలాగే నవంబర్ 11 వరకు దర్శనాలు కొనసాగనున్నట్లు తెలియజేస్తున్నారు. అధికారిక ప్రకటనలు, వాతావరణ పరిస్థితులను బట్టి తేదీలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి యాత్రకు ముందు తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది.
కాశీ దివ్యమైన అనుభూతి
గంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం (Kashi Vishwanath Temple) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని భక్తులు కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా, మోక్షపురిగా కూడా భావిస్తారు. ఇక్కడ శివుడిని కాలాన్ని కూడా నియంత్రించగల విశ్వనాథుడిగా పూజిస్తారు. కాశీలో జీవితం, మరణాన్ని ఒకే తత్వంగా చూస్తారు.
గంగానది తీరంలో జరిగే పూజలు, హారతులు, సంస్కారాలు జీవితం శాశ్వతం కాదని గుర్తు చేస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుడిని మాత్రమే కాదు జీవిత సారాన్ని కూడా దర్శించుకుంటారు. జననం, మరణం, మోక్షం అనే చక్రం గురించి ఆలోచిస్తారు.
ప్రతీ రోజు జరిగే గంగా హారతి ఒక ఆచారం మాత్రమే కాదు. అది భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మిక అనుభూతి కలిసే ఒక దివ్యమైన సందర్భం. అగ్ని జ్యోతి గంగాజలాలపై ప్రతిబింబించే సమయంలో భక్తులు తమ భయాలు, బాధలు అన్నింటినీ శివుడికి సమర్పించినట్లు భావిస్తారు. కాశీ గురించి చాలా మంది ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మరణించిన వారికి శివయ్యే మోక్ష మార్గాన్ని చూపిస్తాడని భక్తులు నమ్ముతారు.
అందుకే జీవితంలో ఒక్కసారి అయినా కాశీ దర్శనం చేయాలని భక్తులు కోరుకుంటారు. కాశీ విశ్వనాథుడి ఆలయం మనిషికి ఒక సందేశాన్ని కూడా అందిస్తుంది. జీవితం అశాశ్వతంం ఆధ్యాత్మికతే శాశ్వతం అని చాటి చెప్పే పవిత్ర ప్రదేశం కాశీ నగరం. భక్తి అంటే దేవుడిని బయట వెతకడం కాదుం మనలోని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనడం అని చెప్పే పరమ పవిత్ర క్షేత్రం కాశీ.
– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు.. ఆ దేశాల్లో లక్షాధికారులే..?


