
హరిద్వార్: ఉత్తరాఖండ్‌లో ఘోరం చోటుచేసుకుంది. స్కూలుకు రెండ్రోజులు రాలేదని ఏడేళ్ల చిన్నారిపై ఇద్దరు ఉపాధ్యాయులు అమానుషంగా ప్రవర్తించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలోని ఒక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత బాలుని తండ్రి తొలుత ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో అతను ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాలుని తండ్రి ఫిర్యాదు ప్రకారం ఏడేళ్ల బాలుడిని ఇద్దరు ఉపాధ్యాయులు అమానుషంగా కొట్టారు. రెండు రోజులు స్కూలుకు రాలేదని వారు ఆ బాలుడిని నేలపై పడవేసి, అతని ముఖాన్ని బూటుతో అదిమిట్టారు. అదే సమయంలో మరో ఉపాధ్యాయుడు బాలుడిని కర్రతో కొట్టాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. జాబ్రేడా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అజయ్ షా మాట్లాడుతూ ఆ పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్న విద్యార్థి రెండు రోజులు గైర్హాజరు అయ్యాడు. ఆ తర్వాత క్లాసుకు వెళ్లినప్పుడు, అతనిని కొట్టారు. నిందితులు ఇద్దరికీ నోటీసులు జారీ చేశామని, తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
కాగా టీచర్లు కొట్టిన కారణంగా పిల్లవాడి చేయి ఎముక విరిగింది. అతని వీపు, తుంటిలో కూడా గాయాలు అయ్యాయి. బాలుడు ఇప్పటికీ షాక్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 11న ఇంటికి తిరిగి వచ్చిన బాలుడు స్కూలులో జరిగిన ఘటన గురించి ఇంట్లో చెప్పాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదుదారు ఆ చిన్నారి మెడికల్ రిపోర్టు, అతని వీపుపై పడిన ఎర్రటి మచ్చలు ఫొటోలను పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ (పిల్లల సంరక్షణ) సెక్షన్ 75 కింద కేసు నమోదు చేశారు.