కొండాపూర్(సంగారెడ్డి): కట్టుకున్న భర్తే భార్య ఆత్మహత్యను గుండెపోటుగా చిత్రీకరించాడు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తాలోని గీతానగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కుటుంబం నివాసం ఉంటోంది.
ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో విధులు నిర్వహిస్తుండగా అతడి భార్య సుచిత(35) బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఆదివారం ఇద్దరి మధ్యలో మనస్పర్థలు రావడంతో సుచిత ఇంట్లో ఉరివేసుకుంది. కాగా ఈ విషయం బయటకు వెళ్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తాయని, ఆత్మహత్యను కాస్త గుండెపోటుగా చిత్రీకరిస్తూ శ్రీనివాస్ బంధువులకు సమాచారం అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు నారాయణ ఖేడ్ మండలం మద్వార్‌కు తీసుకెళ్లారు.
అక్కడ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మృతురాలి మెడపై మరకలు ఉండడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్ట్ వచ్చిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ సుచితది గుండెపోటు కాదని, ఆత్మహత్య అని ప్రకటించారు. మృతురాలి సోదరుడు ఆశిష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


