గరిటెతో కాల్చి వాతలు పెట్టిన టీచర్
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
నిందితురాలి అరెస్టు
బంజారాహిల్స్: ట్యూషన్‌లో చదవడం లేదనే కారణంతో ఓ కసాయి ట్యూషన్ టీచర్ ఒకటో తరగతి విద్యార్థికి గరిటెతో కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి నాలుగు చోట్ల వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలుకాగా ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. షేక్‌పేట ఓయూ కాలనీలో నివసించే వి.మానస ఎథిక్ సొల్యూషన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం నుంచి ఆమె ఇంట్లో కళ్యాణి, సత్యబాబు దంపతులు పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు.
మానస రోజూ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచితంగా ట్యూషన్లు చెబుతోంది. ఇందుకోసం ఇంట్లో పనిచేస్తున్న వారికి జీతం ఇవ్వకుండా ట్యూషన్లు చెబుతున్నానంటూ ఎగ్గొట్టేది. సమీపంలోని కాకతీయ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్న తేజానందన్ (6) గురువారం సాయంత్రం అన్నతోపాటు మానస వద్దకు ట్యూషన్‌కు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తేజానందన్ అన్న ఇంటికి వెళ్లిపోగా, తేజానందన్ చదువుకుంటున్నాడు.
అయితే ట్యూషన్‌లో సరిగా చదవడం లేదంటూ ఆగ్రహానికి గురైన మానస గరిటె కాల్చి చేతులు, తొడలు, వీపుపై వాతలు పెట్టింది. గాయాలతో విలవిల్లాడుతూ చిన్నారి ఏడుస్తుండగా తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. చిన్నారికి గరిటెతో కాల్చినట్లుగా ఒళ్లంతా ఎర్రగా బొబ్బలెక్కింది. దీంతో బాధిత తల్లిదండ్రులు తేజానందన్‌ను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మానసపై ఫిర్యాదుచేశారు.
పోలీసులు మానసపై బీఎన్‌ఎస్ సెక్షన్ 324, 75 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
నాకేమీ పశ్చాత్తాపం లేదు: మానస
తేజానందన్ సరిగ్గా చదవడం లేదని భయపెట్టడానికే గరిటె కాల్చి వాతలు పెట్టినట్లు మానస వెల్లడించింది. గతంలో రెండుసార్లు ఇలాగే భయపెట్టానని, ఈసారి మాత్రం వాతలు పెట్టానని చెప్పింది. అయితే, తానేమీ పశ్చాత్తాపం చెందడంలేదంది.


