తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు
ఒకవైపు 200 సర్పంచ్ స్థానాల్లో గెలుపుపై సంతోషం
గ్రామాల్లో పరిస్థితిని సానుకూలంగానే చూడాలంటున్న కొందరు నేతలు
ఆశించిన ఫలితాలు రాలేదనే నిరాశ మరోవైపు...
8 మంది చొప్పున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు గెలిచినా.. ఆ స్థాయిలో ప్రాతినిధ్యం రాలేదనే అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై కమల దళంలో మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 200 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడంపై బీజేపీ నాయకులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. పార్టీ బలం పెరుగుతోందని ప్రస్తుతం ఉన్న భావనకు అనుగుణంగా, ఆశించిన ఫలితాలు రాలేదనే అభిప్రాయం మరోవైపు విన్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ, కౌన్సిల్ ఎన్నికల్లో మూడింట్లో రెండు సీట్లు గెలుపొందాక.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర నేతలు అంచనా వేశారు. అయితే ఈ పరిస్థితులకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ జరుగుతోందా లేదా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమౌతున్నాయి.ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే వివిధ ఎన్నికల్లో గెలిచినంత స్థాయిలో గ్రామాల్లో పార్టీకి ఆశించిన ప్రాతినిధ్యం రాలేదని అంటున్నారు.
సానుకూలంగా చూడాలి..
గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి పార్టీ రహితంగా, రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలు లేకుండా జరిగేవే అయినా, గ్రామాల్లో మద్దతుదారులను, కార్యకర్తలు, నాయకులను పార్టీలు వెనుకనుంచి బలపరుస్తాయనే విషయం తెలిసిందే. కాగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలపడేందుకు, విస్తరణకు ఈ ఎన్నికలు కీలకమనే విషయం కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా బీజేపీ ఈ విషయాన్ని కాస్త తేలిగ్గా తీసుకుందని, ముఖ్యంగా నామినేషన్ల దాఖలుకు ముందు జిల్లా, మండల నాయకులతో రాష్ట్ర నాయకత్వం పెద్దగా సమన్వయంతో వ్యవహరించిన దాఖలాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే ఈ ఎన్నికల బాధ్యత అంతా స్థానిక నేతలకే అప్పగించడంతో రాష్ట్ర పార్టీ నుంచి సమన్వయం, పర్యవేక్షణ అనేది నామమాత్రమై పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అన్ని చోట్లా పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. స్థానిక నేతలను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని, అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదనే విమర్శలు అప్పట్లోనే పార్టీ నాయకుల నుంచే వచ్చాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 200 దాకా సర్పంచ్ పదవులు గెలుచుకోవడాన్ని సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని కొందరు ముఖ్య నేతలంటున్నారు. గ్రామ రాజకీయాల్లో పెరుగుతున్న పార్టీ పట్టుకు ఇది నిదర్శనమని అంటున్నారు. ఇదే తీరున 2,3 దశల పంచాయతీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన కనబరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత పట్టు బిగించేందుకు వీలవుతుందని నేతలు విశ్లేషిస్తున్నారు.
సమన్వయం లోపించకపోతే మరింత మెరుగైన ఫలితాలు!
అదే సమయంలో అన్ని జిల్లాల్లో అన్ని స్థానాలకు పార్టీ పోటీ చేయాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలైతే ఇచ్చారు కానీ దాని అమలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పోటీచేసి బలం చాటాలనే పార్టీ ఉద్దేశానికి అనుగుణంగా నామినేషన్లు దాఖలయ్యాయా ? ఆ మేరకు క్షేత్రస్థాయిలో గట్టి ప్రయత్నమేదైనా జరిగిందా అని కొందరు నిలదీస్తున్నారు.
పార్టీలో పోటీకి ఆసక్తి చూపేవారిని ప్రోత్సహించడం, అభ్యర్థులను గుర్తించి పోటీకి నిలపడం, పోల్ మేనేజ్‌మెంట్‌లో సమన్వయం వంటి అంశాలపై నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. పంచాయతీల్లో పోటీకి ఆసక్తి, ఉత్సాహం కనబరిచే వారిని ప్రోత్సహించేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాల్సి ఉండగా అది అంతగా జరగలేదని చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగి ఉంటే పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని బీజేపీ నేతలు కొందరంటున్నారు.


