కేసు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం
తెలంగాణ తరఫున వాదించాలని అభిషేక్ సింఘ్వీని నేడు ఢిల్లీలో కోరనున్న మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పక్కనపెట్టిన ఏపీ ప్రభుత్వం తాజాగా పోలవరం–నల్లమలసాగర్‌ను తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాకుండా గోదావరి–కావేరి అనుసంధానాన్ని నల్లమలసాగర్ నుంచే చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ చర్యలను అడ్డుకొనే ప్రయత్నాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు కూడా రాసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి కూడా ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ అంశాన్ని న్యాయస్థానం ద్వారా అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కేసులో తెలంగాణ తరఫున వాదించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఢిల్లీలో కలిసి కోరనున్నారు.
ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీని ప్రతివాదిగా చేర్చి కేసు వేయాలని సింఘ్వీకి ఉత్తమ్ సూచించనున్నారు. ప్రస్తుతం అంతర్రాష్ట్ర నదీ జలాల అంశాలపై మరో న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదిస్తున్నారు. ఆయన స్థానంలో సింఘ్వీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రాజెక్టు డీపీఆర్‌కు ఏపీ టెండర్లు..
పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎస్‌ఆర్)ను ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖతోపాటు సీడబ్ల్యూసీకి అందించి మదింపు చేయిస్తోంది. మరోవైపు ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేయడానికి వీలుగా గత నెలలోనే టెండర్లు పిలిచింది. పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు తొలిదశలో... నల్లమలసాగర్ నుంచి సోమశిలకు రెండోదశలో... ఆ తర్వాత కావేరికి తరలించాలని యోచిస్తోంది.
కేంద్రం సంకేతాల నేపథ్యంలో..
గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి నీటిని తరలించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) నుంచి నీటి తరలింపునకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమ్మతి తెలపగా... కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నీటిని తరలించాలని సూచించింది. అంతేకాకుండా ఇచ్చంపల్లి బ్యాక్‌వాటర్ నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది.
తెలంగాణ కొన్ని షరతులతో ఇచ్చంపల్లికి అంగీకరించగా ఏపీ మాత్రం బేషరతుగా పోలవరం–నల్లమలసాగర్–సోమశిల–కావేరి అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరడం.. అందుకు కేంద్రం సానుకూల సంకేతాలు ఇవ్వడంతో దీన్ని అడ్డుకొనే ప్రయత్నాల్లో తెలంగాణ ఉంది.


