ఒక్కో పరీక్ష మధ్య నాలుగు రోజుల వ్యవధిపై టీచర్ల వ్యతిరేకత
నెల రోజులకుపైగా పరీక్షలు కొనసాగించనుండటంపై పెదవివిరుపు
ప్రశ్నపత్రాల భద్రతపై అనుమానాలు.. ఒకవేళ లీకైతే తమను బాధ్యుల్ని చేస్తారని ఆందోళ
ముఖ్యమంత్రిని కలిసే యోచనలో ఉపాధ్యాయ సంఘాలు
సీబీఎస్‌ఈ విధానాన్నే అనుసరించామంటున్న అధికారులు
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు, సాఫీగా పరీక్షల నిర్వహణ కోసమే మార్పులు: విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ వ్యవహారం సరికొత్త వివాదానికి దారితీస్తోంది. ప్రతి పరీక్షకూ మధ్య కనీసం నాలుగు రోజుల వ్యవధి ఉండేలా మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించేలా టెన్త్ పరీక్షల విభాగం నిర్ణయించి షెడ్యూల్ విడుదల చేయడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమంటూ మండిపడుతున్నారు. దీనివల్ల ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు. విద్యాశాఖ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది.
సీబీఎస్‌ఈ కూడా ఇదే విధానంలో పరీక్షలు నిర్వహిస్తోందని.. ఇతర రాష్ట్రాల్లో కొన్ని బోర్డులు కూడా ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయని తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు, పరీక్షల నిర్వహణ సాఫీగా ఉండేందుకే మార్పులు చేశామని విద్యాశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధమవుతున్నాయి. యథావిధిగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.
టీచర్ల అభ్యంతరం ఏమిటి?
నాలుగు రోజులకో పరీక్ష వల్ల ఎగ్జామ్స్ నిర్వహణ కాలం పెరుగుతుందని టీచర్లు చెబుతున్నారు. నెల రోజులకుపైగా పరీక్షల కోసం పనిచేయాల్సి వస్తుందని.. అన్ని రోజులపాటు స్కూళ్లు, హాస్టళ్లలో విద్యా ర్థులను చదివించాలని, తమకు సెలవులు పెట్టే అవకాశం ఉన్నతాధికారులు ఇవ్వరని వాదిస్తున్నా రు. మరోవైపు ప్రశ్నపత్రాలను అన్ని రోజులపాటు రక్షించడం కూడా సమస్యేనని టీచర్లు చెబుతున్నా రు.
టెన్త్ ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రాల నుంచి తొలుత సమీపంలోని పోలీసు స్టేషన్లకు.. పరీక్షల రోజుల్లో అక్కడి నుంచి ఎగ్జామ్ సెంటర్లకు చేరవేసే మధ్య ఎక్కువ కాలవ్యవధి ఉండటం వల్ల ప్రశ్నప త్రాలు ఎక్కడైనా లీకయ్యే అవకాశం ఉంటుందని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. దీనికి తామే బా ధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుందని కలవ రపడుతున్నారు. పరీక్షలకు ఎక్కువ సమయం ఇచ్చి నా పెద్దగా పురోగతి ఉండదని అంటున్నారు.
వ్యవధి ఇస్తే ప్రయోజనం ఉంటుందా?
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. కొన్నేళ్లుగా 94 శాతం మంది రెగ్యులర్‌గా, మరో 2 శాతం మంది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో పాసవుతున్నారు. అంతిమంగా ఫెయిలయ్యే విద్యార్థులు 4 శాతమే ఉంటున్నారు. వారిలోనూ గ్రామీణ ప్రాంతాల వారే ఎక్కువ మంది ఉంటున్నారు. టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో సగానికిపైగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉంటున్నారు.
సాధారణంగా వారిలో ఎక్కువ మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్నారు. విద్యార్థులకు చాలాకాలం క్రితమే సిలబస్ పూర్తి చేయడంతో పరీక్షల సమయానికి రెండు దఫాల రివిజన్ కూడా చేయిస్తున్నారు. కాబట్టి ఇంతకు మించి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం లేదని టీచర్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు పరీక్షల మధ్య ఎక్కువ సమయం ఇచ్చినా నష్టమే జరుగుతుందనేది టీచర్ల వాదన.
స్థానికంగా ఉపాధ్యాయులు ఉండనందున విద్యార్థులను చదివించే వారు ఉండరని... పైగా ఇతర పనులకు వెళ్లడం వల్ల విద్యార్థులు పరీక్షలు తప్పే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.


