ఏకంగా 7.7 డిగ్రీల దాకా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
ఈశాన్య గాలుల ప్రభావంతో అనూహ్యంగా పెరిగిన చలి తీవ్రత
సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 5.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత..
హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరులో 5.4 డిగ్రీల సెల్సియస్ నమోదు
మరో 4 రోజులు ఇదే పరిస్థితి: వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతన మయ్యాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత, పొగమంచు అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 7.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి.
శుక్రవారం హనుమ కొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 7.4 డిగ్రీలు తక్కువగా 8.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవగా హైదరాబాద్, ఖమ్మం, రామగుండంలలో 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా.. మిగిలిన ప్రాంతాల్లో 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది.
ప్రణాళిక శాఖ గణంకాల ప్రకారం రాష్ట్రంలోకెల్లా అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 5.8 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయింది. కోహిర్‌లో గతేడాది ఇదేరోజున 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా ఇప్పుడు మరింత తగ్గడం గమనార్హం. అలాగే హైదరాబాద్ శివారులో ప్రాంతాల్లోనూ చలి గజగజలాడించింది.
ముఖ్యంగా పటాన్ చెరులో సాధారణం కంటే 7.7 డిగ్రీలు తక్కువగా 5.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదై గత ఐదేళ్ల రికార్డును తిరగరాసింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 6.3, మొయినాబాద్‌లో 6.0, మౌలాలిలో 7.1, ఉప్పల్‌లో 7.1, రాజేంద్ర నగర్‌లో 7.5, శివరాంపల్లిలో 8.8, అల్వాల్‌లో 9.0, గచ్చిబౌలిలో 9.1, దుండిగల్‌లో 10.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
మొత్తంగా హైదరాబాద్‌లో సగటున 10.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు దట్టమైన పొగమంచు పరుచుకోవడంతో హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–ముంబై హైవేలపై వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రానున్న నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో)
ఆదిలాబాద్ 7.2
భద్రాచలం 14.6
దుండిగల్ 10.7
హకీంపేట్ 14.3
హనుమకొండ 8.5
హైదరాబాద్ 10.8
ఖమ్మం 12.4
మహబూబ్‌నగర్ 13.5
మెదక్ 7.2
నల్లగొండ 14.0
నిజామాబాద్ 11.2
రామగుండం 10.9


