గ్రామాల్లో పరిస్థితి తమకు అనుకూలంగానే ఉందంటూ విశ్లేషణలు
ఇంకా మరిన్ని సర్పంచ్ స్థానాలు రావాల్సిందనే భావనలో కాంగ్రెస్
అధికార పార్టీని దీటుగా ఎదుర్కొన్నామంటున్న బీఆర్‌ఎస్
బలం మరింత పెంచుకోవాలంటున్న బీజేపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ సమరం ముగిసింది. ఫలితాలు కూడా శుక్రవారం ఉదయం కల్లా పూర్తి స్థాయిలో వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలి విడత పోరుపై రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాల్లో అంతర్గత విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుపొందడంపై కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో పంచాయతీ ఫలితాలు జోష్‌ను నింపాయి. మరోవైపు బీజేపీ కూడా పల్లె పోరు ఫలితాలను సానుకూలంగా చూస్తుండటం గమనార్హం.
ఎవరి లెక్కలు వారివే..
అధికార పార్టీ విషయానికొస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నా..ప్రజాపాలనలో
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదన్న భావన అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పని చేయకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయా అన్న సందేహాలు కూడా నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సాధించిన స్థానాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం.. జిల్లాల వారీగా గులాబీ పార్టీ గట్టి పోటీనిచ్చిన ప్రాంతాల్లో ఓట్ల గణాంకాలను పరిశీలించే పనిలో పడింది. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కసరత్తు చేస్తోంది.
ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ఊపిరి పోశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నైరాశ్యంలో ఉన్న పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారని, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఇదే ఒరవడి కొనసాగించే యోచనలో ఉన్నారు.
బీజేపీ కూడా ఫలితాలపై అంతర్గత లెక్కలు వేస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీలో ఉన్న బలంతో పోలిస్తే పంచాయతీలు తక్కువగా వచ్చాయని, అయితే గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తమ బలం పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తంగా 500 కంటే ఎక్కువ పంచాయతీలు గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో రికార్డు సృష్టిస్తామని వారంటున్నారు. రెండంకెల స్థానాలు దక్కించుకోవడం ద్వారా గ్రామాల్లో తమ ఉనికి చాటుకున్నామని లెఫ్ట్ పార్టీలంటుండడం గమనార్హం.


