న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. శుక్రవారం ఆ పార్టీకి చెందిన అగ్రనేత నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఎంపీల భేటీకి డుమ్మా కొట్టారు. అయితే.. ఆయన ఇలా గైర్హాజరు కావడం ఇది వరుసగా మూడోసారి. అదీ పార్లమెంట్ సమావేశాల వేళ కావడంతో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం కోసం రాహుల్ గాంధీ అధ్యక్షతన శుక్రవారం కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరిగింది. ఈ భేటీకి థరూర్ దూరంగా ఉన్నారు. థరూర్‌తో మరో సీనియర్ నేత, ఛండీగఢ్ ఎంపీ మనీశ్ తివారీ కూడా గైర్హాజరు అయ్యారు. అయితే..
థరూర్ గత రాత్రి కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తాను అందుబాటులో ఉండటంలేదని థరూర్ ముందే సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ చీఫ్ విప్ మాత్రం థరూర్, తివారీల గైర్హాజరు గురించిన సమాచారం తనకు తెలియదని చెబుతుండడం గమనార్హం.
శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్డీయే హయాంలోని విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన నేరుగా ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్‌పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఈలోపు..
నవంబర్ 30వ తేదీన జరిగిన మీటింగ్‌కు విమాన ప్రయాణంలో ఉన్నందున హాజరు కాలేకపోయానని థరూర్ మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జరిగిన చర్చలోనూ ఆయన పాల్గొనలేదు. ఆ సమయంలో అనారోగ్యం కారణంగా పాల్గొనలేకపోయానని అన్నారాయన. కానీ, ఆయన కార్యాలయం మాత్రం తన తల్లి(90) వెంట ఉండాల్సి రావడంతోనే హాజరు కాలేకపోయారని భిన్నమైన ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే.. థరూర్ వరుసగా ఇలా ఎగ్గొట్టడాన్ని కాంగ్రెస్ నేతలు తేలికగా తీసుకోవడం లేదు.
పుతిన్ పర్యటన సమయంలో ప్రభుత్వం రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందుకు హాజరు కావడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ సీనియర్లు. ఇలా పార్టీ మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై పెదవి విరుస్తున్నారు. అయితే థరూర్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.
ఐదేళ్ల కిందటే మొదలై..
2020లో కాంగ్రెస్‌లో జీ-23 గ్రూప్ పరిణామం తీవ్ర కలకలం రేపింది. పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ గ్రూప్‌లో థరూర్ కూడా ఉన్నారు. ఆ సమయంలో దీనిని సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) ఓ తిరుగుబాటులాగా భావించారంతా.
ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అధిష్టానం అండతో ఖర్గే గెలిచినా, థరూర్‌కు 1,000కి పైగా ఓట్లు రావడం కొసమెరుపు.
2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్‌కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్ చెబుతూ వస్తున్నారు.


