సాక్షి, తాడేపల్లి: కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. అధికారులను బెదిరించి తన మీద కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసులు క్లోజ్‌పై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన మీద ఉన్న కేసులను క్లోజ్ చేసుకోవటం సరికాదని గౌతమ్‌రెడ్డి అన్నారు.
‘‘చంద్రబాబు వ్యవహారం దొంగే.. దొంగా దొంగా అన్నట్టుగా ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌ను కూడా ఉల్లంఘించారు. ఫైబర్ నెట్ కేసును ఇప్పుడు క్లోజ్ చేయించుకున్నారు. సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది. అవినీతి చేసినట్టు ఆధారాలు ఉన్నా సీఐడీ ఎందుకు కేసును వదిలేసింది?. జగన్ హయాంలో పూర్తయిన కేసులను కూడా రీఓపెన్ చేశారు. చంద్రబాబే స్వయంగా సంతకాలు చేసి దొరికిన కేసులను మాత్రం క్లోజ్ చేశారు’’ అంటూ గౌతమ్‌రెడ్డి నిలదీశారు.
‘‘ఫైబర్ నెట్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. వేమూరి హరిప్రసాద్ కోసం చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారు. వందల కోట్లు కైంకర్యం చేయటానికి చంద్రబాబు నాటకాలు ఆడారు. చంద్రబాబు నేరాల మీద నేరాలు చేశారు. ఆర్థిక అరాచకం చేసిన చంద్రబాబు తన మీద ఉన్న కేసులను ఎలా క్లోజ్ చేస్తారు?. దీనిపై మేము ప్రొటెక్షన్ పిటిషన్‌ని హైకోర్టులో వేస్తాం. బ్లాక్ లిస్టులో ఉన్న మనిషిని పిలిచి అందలం ఎక్కించారా లేదా?’’ అంటూ గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఈవీఎంల విషయంలో వేమూరి హరిప్రసాద్‌కు కోర్టు శిక్ష వేసింది. అలాంటి వ్యక్తిని ఫైబర్ నెట్‌లోకి ఎలా తెచ్చారు?. 105 రకాల నాసిరకం వస్తువులు కొని అవినీతికి పాల్పడ్డారా? లేదా?. వేమూరి హరిప్రసాద్‌ని డైరెక్టర్‌గా తీసుకోవాలని సీఎంవో నుండి లెటర్ ఇవ్వలేదా?. రూ.114 కోట్ల విలువైన అవకతవకలు ఫైబర్ నెట్‌లో జరిగాయా? లేదా?. ఇలాంటి విషయాలపై విచారణ జరుగుతుండగా కేసును ఎందుకు క్లోజ్ చేశారు?. కేసులను ఎదుర్కోవడం చేతకాని పిరికిపంద చంద్రబాబు. ఈ కేసులను క్లోజ్ చేయటానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అంగీకరించవు. దీనిపై మరింతగా న్యాయ పోరాటం చేస్తాం’’ అని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.


