సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సరైన స్కూల్ బ్యాగులు అందించటం చేతగాని మంత్రి నారా లోకేష్ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులకు సరైన బ్యాగులు, బూట్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి లోకేష్. తన పదవికి రాజీనామా చేయాలంటూ రవిచంద్ర డిమాండ్ చేశారు.
‘‘పాఠశాలల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. మూడు దశల్లో తనిఖీలు చేసి బ్యాగులు ఇచ్చామన్న లోకేష్ ఒకసారి ఆ బ్యాగులను చూసి మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకం బ్యాగులు అందించారు. నారా లోకేష్ చెప్పిన మాటలకు, విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులకు చాలా తేడా ఉంది. రూ.953 కోట్లు ఖర్చు చేశామనే పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. జగన్ హయాంలో అత్యంత నాణ్యమైన బ్యాగులు అందించారు. జగన్ హయాంలో ఇచ్చిన బ్యాగులనే ఇప్పటికే విద్యార్థులు వాడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేశామని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు.
‘‘ఒక్కో బ్యాగు మీద రూ.2,270లు ఖర్చు చేసి ఇలాంటి నాసిరకం అందిస్తారా?. పిల్లలకు సరైన బూట్లు కూడా అందించలేని ప్రభుత్వం ఇది. నాడు-నేడు కింద జగన్ స్కూళ్లు బాగు చేశారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని ధ్వంసం చేశారు. సరైన బ్యాగులనే పంపిణీ చేయలేని చేతగాని మంత్రి లోకేష్’’ అంటూ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


