సాక్షి, నెల్లూరు: నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరు నగరంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. టీడీపీ నైతికంగా ఓడిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్, రౌడీయిజం పెరిగిపోయింది. నెల్లూరు సిటీ ఐదో డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారు. మా కార్పొరేటర్లను తీసుకుంటే మాకు నష్టమేమీ లేదు. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరులో దళారి వ్యవస్థ నడుస్తోంది.
మా పార్టీకి సంబంధం లేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి వైఎస్సార్‌సీపీపై ట్రోల్స్ చేయడం విడ్డూరం ఉంది. కార్పొరేషన్ విషయంలో ఒకసారి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్‌లో ఉన్న 54 మంది కార్పొరేటర్స్ వైఎస్సార్‌సీపీ బీఫాంతో గెలిచిన వారే. నయానో, భయానో వారిని ప్రలోభ పెట్టి టీడీపీలోకి లాక్కున్నారు. ప్రస్తుతం మాకు వున్న కార్పొరేటర్స్ పదకొండు మంది ఉన్నారు. నిన్న ఐదుగురు జగనన్న హయాంలో మా పార్టీలో చేరారు. అలా చేరిన కార్పొరేటర్ ఒక్కరిని అరెస్ట్ పేరుతో డ్రామా క్రియేట్ చేశారు. నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారు. మాకు సంఖ్య బలం లేదు, మేయర్ మా పార్టీ కాదు. ఐదు మంది మా వైపు వచ్చేసరికి భయపడ్డారు. నేడు టీడీపీ అధికారంలో ఉండి, సంఖ్య బలం ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మాకు భయపడి కార్పొరేటర్లను క్యాంపునకు తరలించినప్పుడే మేము నైతికంగా గెలిచాం’ అని వ్యాఖ్యలు చేశారు.


