సాక్షి,తిరుపతి: ‘నువ్వ చచ్చిపో.. చచ్చిపోతే కాలేజీకి ఒక్కరోజైనా సెలవు ఇస్తారంటూ’ అవమానించడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.
కుప్పంకు చెందిన విద్యార్థి జస్విన్ తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 10వ తేదీన ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే,జస్విన్ ఆత్మహత్యాయత్నానికి కాలేజీ అధ్యాపకులే కారణమని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘నీకు చదువు ఎందుకు? నువ్వు చనిపోతే కాలేజీకి ఒక రోజు సెలవు వస్తుంది’ అంటూ ఓ అద్యాపకురాలు తోటి విద్యార్థుల ముందు అమానుషంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ అవమానాలు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక జస్విన్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు.
తల్లిదండ్రుల ఆవేదన
జస్విన్ తల్లి రాధ కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ.. ‘నా కొడుకు పట్ల కాలేజీ లెక్చరర్లు దారుణంగా మాట్లాడారు. సరైన సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది’ అని ఆరోపించారు. తన కుమారుడి పరిస్థితికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యాజమాన్యం వైఖరిపై విమర్శలు
ఈ ఘటనపై ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పటికీ, కాలేజీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు, సంఘాలు మండిపడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, దళిత సంఘాలు ఎన్ఆర్ఐ కళాశాల ముందు బైటాయించి నిరసనలు చేపట్టాయి. విద్యార్థులపై వేదింపులు ఆపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


