మల్లికార్జున్ ఖర్గేకు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, వివేక్, బలరాం నాయక్, మల్లు రవి, రఘువీర్‌రెడ్డి, వంశీకృష్ణ
సీఎం రేవంత్‌కు ఖర్గే, ప్రియాంక అభినందనలు
భారీ పెట్టుబడుల ఒప్పందాలపై ప్రశంసల జల్లు
ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్’పై కాంగ్రెస్ అధిష్టానం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర భవిష్యత్ ముఖచిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారంటూ ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ఖర్గే, ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ విజయవంతమైన తీరును రేవంత్‌రెడ్డి వారికి వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేలా చేసుకున్న ఒప్పందాలు, విజ న్ డాక్యుమెంట్ ఆవిష్కరణ వంటి అంశాలపై వారి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. సమ్మిట్ నిర్వహణ, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అగ్రనేతలు ప్రత్యేకంగా అభినందించారు. రేవంత్‌రెడ్డి వెంట మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎంపీలు సురేశ్ షెట్కార్, మందాడి అనిల్ కుమార్, పోరిక బలరాం నాయక్, డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.
ప్రణబ్ ముఖర్జీకి ఘన నివాళి
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో ఘన నివాళులర్పించారు. ప్రణబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దశాబ్దాలపాటు ప్రజాసేవకే అంకితమైన గొప్ప దార్శనికుడు ప్రణబ్ ముఖర్జీ అని సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


