పంచాయతీరాజ్ రోడ్లకు టెండర్ల కాలపరిమితి ముగిసినా ముందుకురాని కాంట్రాక్టర్లు
నేటితో ముగియనున్న ఆర్ అండ్ బీ రోడ్ల టెండర్లకూ అదే పరిస్థితి
ఆర్ అండ్ బీలో టెండర్ల దాఖలుమరో 2 వారాలు పొడిగించాలని నిర్ణయం
రుణాలిచ్చేందుకు ముందుకురాని బ్యాంకర్లు.. నేడు బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో ఆర్ అండ్ బీ శాఖ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారి హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం–హ్యామ్) విధానంలో ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రహదారుల విస్తరణ, మరికొన్ని రోడ్ల పటిష్టతకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గ్యారంటీ ఇచ్చే తరహాలో కాంట్రాక్టర్లతో ఒప్పందానికి ముందుకు వచ్చినా కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అధికార వర్గాల సమాచారం.
నిధులు క్రమం తప్పకుండా కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ఎస్క్రో (నేరుగా ఖజానా నుంచి మొదట కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా) ఖాతా ఏర్పాటుచేయడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ)ని ఆహా్వనించినా పంచాయతీరాజ్ శాఖ పిలిచిన ఆర్‌ఎఫ్‌పీకి స్పందన రాలేదని తెలియవచ్చింది. అలాగే ఆర్ అండ్ బీ అధికారులు పిలిచిన ఆర్‌ఎఫ్‌పీకి టెండర్ల దాఖలుకు శుక్రవారం చివరిరోజుకాగా టెండర్లకు స్పందన రాకపోవడంతో మరో 15 రోజులపాటు గడువు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కాంట్రాక్టర్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి కూడా అయిన భట్టి విక్రమార్క హ్యామ్ రహదారుల కోసం కాంట్రాక్టర్లకు రుణాలు ఇవ్వాలని.. తద్వారా ప్రభుత్వం చేపట్టాలనుకున్న ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ బ్యాంకర్ల నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులు శుక్రవారం మరోసారి బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు.
ఇదీ లక్ష్యం..: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నుంచి మండలాలకు మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, జి ల్లా కేంద్రాల నుంచి నాలుగు లేన్ల రహదారులుగా మార్చా లని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ఇవి కాకుండా ప్రస్తుత రహదారులను మరింత పటిష్ట పరిచేలా ప్రణాళిక రచించింది. తొలిదశలో ఆర్ అండ్ బీకి చెందిన 5,824 కి.మీ. రోడ్లను రూ. 11,399 కోట్లతో.. పంచాయతీరాజ్ శాఖలో 17 ప్యాకేజీల కింద 7,449 కి.మీ. రోడ్లను రూ. 6,294 కోట్లతో నిర్మించడంతోపాటు వాటిని 15 ఏళ్లపాటు కాంట్రాక్టర్లే నిర్వహించేలా హ్యామ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది.
రోడ్ల నిర్మాణాన్ని ఏకకాలంలో చేపట్టడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని రహదారులు నిర్మించేలా ఈ విధానాన్ని రూపొందించింది. హ్యామ్ పద్ధతి కింద రహదారి నిర్మాణం జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మేరకు నిధులను కాంట్రాక్టర్లకు సమకూర్చి మిగిలిన 60 శాతం నిధులను సంవత్సరానికి అసలు, వడ్డీని కలుపుతూ వారికి చెల్లిస్తుంది.
అయితే ప్రభుత్వం వాయిదా పద్ధతిలో చేసే చెల్లింపుల్లో జాప్యం ఉండబోదన్న నమ్మకం కాంట్రాక్టర్లకు లేకపోవడంతో వారు ముందుకు రావడంలేదని ఆర్ అండ్ బీలోని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టర్ల నెట్‌వర్త్, వారి రుణాల చెల్లింపు ప్ర క్రియ సక్రమంగా ఉంటేనే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చే పరిస్థితులు ఉంటాయని వ్యాఖ్యానించారు.


