సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఈ వారెంట్‌ను ఇష్యూ చేసింది.
కిందటి ఏడాది అక్టోబర్‌లో కొండా సురేఖ మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన కోర్టు, కేసు కొనసాగించడానికి తగినంత సాక్ష్యాలు ఉన్నాయని తేల్చింది.
భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 356 కింద, అలాగే సెక్షన్ 222, 223 ప్రకారం కేసు కొనసాగించవచ్చని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి కోర్ట స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.


